Seetharam Sitralu Review: తెలుగు ప్రేక్షకులు చిన్న సినిమా, పెద్ద సినిమా అని చూడడం లేదు. కంటెంట్ బాగుంటే ఎలాంటి సినిమాను అయినా ఆదరించానికి మనవాళ్లు రెడీగా ఉన్నారు. అందుకే కంటెంట్ బాగున్న సినిమాలు ఈ మధ్యకాలంలో మంచి విజయాన్ని అందుకుంటున్నాయి. ఈ క్రమంలో కంటెంట్‌ను నమ్ముకుని చేసిన చిన్న సినిమా ఒకటి నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది అదే ‘సీతారాం సిత్రాలు’. కొత్తవాళ్లతో కొత్త డైరెక్టర్ చేసిన ఈ సినిమా ఎలా ఉంది? ప్రేక్షకులను ఏ మేరకు అలరించింది అనేది తెలుసుకోవాలంటే రివ్యూ చదివేయండి.
కథ:
కర్నూల్ దగ్గరలో ఒక టీ స్టాల్ నడుపుకుంటూ ఉంటాడు శివ(లక్ష్మణమూర్తి). శివ పెట్టే టీ ఆ చుట్టుపక్కల బాగా ఫేమస్. మంచి మాటలను వాట్సప్‌లో స్టేటస్‌గా పెట్టుకునే అతన్ని అందరూ స్టేటస్ శివ అని పిలుస్తూ ఉంటారు.. జీవితంలో ఒక స్థాయికి వెళ్లాలని ఆశపడుతూ ఉండే శివ అదే ఊర్లో టీచర్ గా పని చేసే పార్వతి( భ్రమరాంబిక)తో ప్రేమలో పడతాడు. అయితే అనుకోకుండా ఆమెతోనే పెళ్లి కూడా నిశ్చయం అవుతుంది. ఇష్టమైన అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నానని బాగా ఖర్చు చేసి, అప్పు చేసి మరి పెద్ద ఎత్తున ఏర్పాటు చేసుకుంటున్న సమయంలో పార్వతీ తండ్రి పెళ్లి చేయనని షాకిస్తాడు. అనుకున్న పెళ్లి జరగక, ప్రేమించిన అమ్మాయి దూరమై, పెద్ద ఎత్తున అప్పులు నెత్తిన పడడంతో ఒక వ్యాపారం మొదలు పెట్టేందుకు నిర్ణయం తీసుకుంటాడు. సరిగ్గా అక్కడే అతనికి అవాంతరాలు ఎదురవుతాయి. ఆ అవాంతరాలు ఏంటి? అసలు పార్వతితో ఎందుకు పెళ్లి చేయనని అడ్డం తిరిగారు? చివరికి పార్వతిని దక్కించుకున్నాడా లేదా? లాంటి విషయాలు తెలియాలంటే సినిమా మొత్తం చూడాల్సిందే.
విశ్లేషణ:
ఈరోజుల్లో తెలుగు ఆడియన్స్ టేస్ట్ పూర్తిగా మారిపోయింది. అయినా సరే దర్శకనిర్మాతలు పట్టించుకోకుండా వయలెన్స్, రొమాన్స్ ఎక్కువ ఉన్న సినిమాలు చేస్తూ వస్తున్నారు. చాలా తక్కువ మంది మాత్రమే కుటుంబం అంతా కలిసి చూసే సినిమాలు చేస్తున్నారు.. అయితే అవి పూర్తిస్థాయిలో బాక్స్ ఆఫీస్ వద్ద నిలబడడం లేదు. అయినా కొందరు కంటెంట్ ని నమ్ముకుని అలాంటి సినిమాలే చేసేందుకు సిద్ధమవుతున్నారు. సినిమా చూసిన తర్వాత ఈ సినిమా దర్శకుడు కూడా అదే కోవకు చెందిన వాడని అర్థమైంది.. కుటుంబంతో కలిసి చూసే సినిమాగా సీతారాం సిత్రాలును ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు. స్వయంకృషితో ఎదగాలనుకున్న ఒక కుర్రాడు ఒక అమ్మాయిని ప్రేమించడం ఆమెతోనే పెళ్లి కూడా నిశ్చయం కావడంతో అంతా బావుందని ఫిక్స్ అవుతాడు.. భారీగా అప్పులు చేసిన తర్వాత నెత్తిన పిడుగు లాంటి వార్త పడితే ఆత్మహత్య లాంటి నిర్ణయాలు తీసుకోకుండా ఎలా తిరిగి నిలబడ్డాడు అనే పాయింట్ను చాలా ఆసక్తికరంగా ప్రేక్షకులను కన్విన్స్ చేసేలా దర్శకుడు తెరమీద ఆవిష్కరించాడు. మనసుకు నచ్చిన పనిని మరింత ఇష్టంగా చేస్తే విజయం వరిస్తుందని చూపిస్తూనే బంధువులు ఎలాంటి ప్రయత్నాలు చేస్తారు స్నేహితులలో మంచి వాళ్ళు లేకపోతే ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి లాంటి విషయాలను కూడా కుండ బద్దలు కొట్టినట్టు చూపించాడు. దర్శకుడు నాగ శశిధర్ రాసుకున్న లైన్ బావుంది కానీ దాన్ని పూర్తిస్థాయిలో సినిమాగా తెరకెక్కించే విషయంలో అనుభవ లేమి కనిపించింది.. అయితే సెకెండ్ హాఫ్‌లో కొన్ని సన్నివేశాలను మరింత పకడ్బందీగా రాసుకుని ఉంటే సినిమా ఇంకా బాగా పండేది. అలాగే ముఖ్య పాత్రల్లో కొంచెం తెలిసిన వాళ్లను తీసుకుని ఉంటే మరింత కనెక్టివిటీ బాగుండేది అనిపిస్తుంది. మొత్తంగా ఈ సినిమాతో ఒకపక్క లవ్ స్టోరీ చూపిస్తూనే మరోపక్క ఎలాంటి పరిస్థితులు వచ్చిన వెనుతిరగకుండా పోరాడే స్ఫూర్తిని రగిలించే ప్రయత్నం చేశాడు డైరెక్టర్.
నటీనటుల విషయానికి వస్తే హీరోగా చేసిన లక్ష్మణ మూర్తి తన పాత్రలో జీవించాడు. జీవితంలో ఒక స్థాయికి వెళ్లాలని కలగదు కానీ సగటు కుర్రాడిగా టీ స్టాల్ నడిపే వ్యక్తిగా ఒదిగిపోయాడు.. హీరోయిన్ భ్రమరాంబిక టీచర్ పాత్రలో హుందాగా కనిపిస్తూనే క్యూట్ నెస్ తో ఆకట్టుకుంది. మిగతా నటీనటులు కూడా తమ పాత్రల పరిధిమేరకు నటించారు. దర్శకుడు నాగ శశిధర్ దర్శకుడిగా తీను చెప్పాలనుకున్న పాయింట్‌ను సూటిగా చెప్పడంలో సక్సెస్ అయ్యాడు. అరుణ్ కుమార్ పర్వతనేని సినిమాటోగ్రఫీ కూడా సినిమాను ఎలివేట్ చేసేలా ఉంది. రుద్ర కిరణ్ ఇచ్చిన సంగీతం బాగుంది. నిర్మాతల నిర్మాణ విలువలు చాలా చోట్ల కనిపించాయి.
ఫైనల్లీ ఈ ‘సీతారాం సిత్రాలు’ ఒక హానెస్ట్ అటెంప్ట్.. కానీ అందరికీ ఎక్కకపోవచ్చు..