NTV Telugu Site icon

Save The Tigers 2 Review: సేవ్ ది టైగర్స్ 2 వెబ్ సిరీస్ రివ్యూ

Save The Tigers 2 Review

Save The Tigers 2 Review

Save The Tigers 2 Review in Telugu : ప్రియదర్శి, చైతన్య కృష్ణ, అభినవ్ గోమఠం, జోర్దార్ సుజాత, పావని గంగిరెడ్డి, దేవియాని శర్మ ముఖ్యపాత్రల్లో చేసిన వెబ్ సిరీస్ ‘సేవ్ ది టైగర్స్’ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. మహి వి రాఘవ్ నిర్మాణ పర్యవేక్షణలో తెరకెక్కిన ఈ సిరీస్ ప్రేక్షకులను అయితే ఒక రేంజ్ లో నవ్వించింది. తాజాగా సిరీస్‌కు సీక్వెల్‌గా వచ్చిన ‘సేవ్ ది టైగర్స్ 2’ డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌ ఓటీటీలో మార్చ్ 15 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. మహి వి రాఘవ్ నిర్మాణ పర్యవేక్షణలో ఈ సెకండ్ సీజన్ అరుణ్‌ కొత్తపల్లి డైరెక్ట్ చేశారు. ఈ సిరీస్ ఎలా ఉందో ఒక లుక్ వేద్దాం పదండి.

కథ: సరిగ్గా సీజన్ 1 ముగిసినప్పటి నుంచి సీజన్ 2 మొదలవుతుంది. స్టార్ హీరోయిన్ హంసలేఖ (సీరత్ కపూర్) మిస్ అవడంతో పోలీసులు ఒక వీడియో ఆధారంగా గంటా రవి (ప్రియదర్శి), విక్రమ్ (చైతన్య కృష్ణ), రాహుల్(అభినవ్ గోమఠం)ని అరెస్ట్ చేస్తారు. అయితే చివరికి హంసలేఖ కనిపించడంతో ఈ ముగ్గురిని పోలీసులు విడిచిపెడతారు. అయితే పోలీస్‌ స్టేషన్‌ నుంచి బయటకు వచ్చాక ముగ్గురి భార్యలు డాక్టర్ కౌన్సిలర్‌ స్పందన (సత్యకృష్ణ) దగ్గరకు వెళ్తారు. తమ భర్తలు దూరం అవుతున్నారని చెబితే ఆమె కొన్ని టిప్స్ చెబుతుంది. అలాగే ఆమె వారిలో అనుమానాలను రేపుతుంది. ఆ తర్వాత ఆ ముగ్గురి ఫ్యామిలీల్లో ఏం జరిగింది? గంటా రవిని ఎమ్మెల్యే ఎందుకు మోసం చేశాడు? గేటెట్ కమ్యూనిటీలో ఇల్లు కొనాలని కలలు కనే హైమా ఆశ నెరవేరిందా? హీరోయిన్ హంసలేఖ ఎందుకు ఇబ్బందులు ఎదుర్కొంది? హారిక (దర్శన బానిక్) వల్ల విక్రమ్ ఫ్యామిలీకి ఏమైంది? విక్రమ్‌ భార్య రేఖ (దేవయాని శర్మ) లాయర్‌ ప్రాక్టీస్‌ ఎందుకు ఆపేయాలనుకుంది? చిన్న చిన్న గొడవలతో సాగిపోతున్న మూడు జంటల మధ్య మళ్లీ గొడవలు ముదరడానికి కారణమేంటి? అన్నది సిరీస్‌ చూసి తెలుసుకోవాల్సిందే!

విశ్లేషణ: హీరోయిన్ హంస లేఖ మిస్సింగ్, ఆ తరువాత గంటా రవి, రాహుల్, విక్రమ్‍ను పోలీసులు ఇంటెరాగేట్ చేయడంతో ఈ సీజన్ సరదాగా మొదలవుతుంది. ఈ ముగ్గురు హంసలేఖను చంపేశారు అని ఓ టీవీ ఛానెల్ ప్రతినిధిగా బలగం వేణు అత్యుత్సాహం ప్రదర్శిస్తాడు. ఇక అక్కడ ప్రస్తుత పరిస్థితులకు సెటైర్ రాస్కున్నట్టు అనిపించింది. హైమా, రేఖ, మాధురి సైకాలజిస్ట్ స్పందన దగ్గరికి వెళ్లి వారి భర్తలు తమతో సరిగా ఉండడం లేదని, పట్టించుకోవడం లేదని చెప్పగా స్పందన సెవెన్ ఇయర్స్ ఇట్చింగ్ అనే థియరీ చెప్పి షాక్ ఇస్తుంది. అయితే అది కొంత కన్విన్సింగ్ అనిపంచకపోగా కథనం స్లో అయిన ఫీలింగ్ కలుగుతుంది. అయితే ఆ తర్వాత హైమ, రేఖ, మాధురి పార్టీకి వెళ్లిన సీన్స్ అలాగే రాతియుగమైన క్రీస్తు పూర్వం 10000 సంవత్సరం అంటూ ఓ ఎపిసోడ్‍లో పెళ్లి అనే కాన్సెప్ట్ ఎలా పుట్టింది, మహిళల ఆధిపత్యాన్ని తగ్గించేందుకు పురుషుడు ఈ పద్ధతిని తీసుకొచ్చాడని చూపారు. అయితే అది కూడా కొంత కన్విన్సింగ్ అనిపించదు. అయినా సరే మొదటి సీజన్‌లాగే ఈ సీజన్‌లోనూ కామెడీకి కొదవ లేకుండా ప్లాన్ చేశారు క్రియేటర్స్ మహి వీ రాఘవ్ అండ్ టీం. కామెడీతో పాటు సందేశాన్ని మేళవించి కళ్లతో చూసే ప్రతీది నిజం కాదని, ఏది నిజం? ఏది అబద్ధం? అనేది మనమే తెలుసుకోవాలని చెప్పే ప్రయత్నం చేసినట్టు అనిపించింది.. క్రియేటర్స్ మహి-ప్రదీప్ తో అరుణ్‌ డైరెక్షన్‌ సింక్‌ సిరీస్ కి బాగా ప్లస్ అయింది. నిజానికి గతంలో ఇలాంటి కథతో టాలీవుడ్ లో పలు సినిమాలు ఆడియన్స్ ముందుకు వచ్చినా న్యూ ఏజ్ స్టోరీ అనిపించేలా ఉంది. క్రింజ్ కామెడీ కాకుండా క్లీన్ కామెడీతో ఆడియన్స్ ని ఎంగేజ్ చేసేలా క్రియేటర్ మహి ఈ సిరీస్ ను తెరకెక్కించారు.

నటీనటుల విషయానికి వస్తే ఈ సిరీస్‌లో జోర్దార్ సుజాత, దేవయాని, పావని వారితో పోటీపడి నటించినట్లు అనిపించినా సుజాత పాత్ర గుర్తుండిపోతుంది. ఇక ప్రియదర్శి, అభినవ్, చైతన్య ముగ్గురూ సూపర్ పెర్ఫార్మన్స్ తో ఆకట్టుకున్నారు. ముఖ్యంగా ప్రియదర్శికి అయితే కొన్ని ఎమోషనల్ సీన్స్ పడడంతో మిగతా ఇద్దరి కంటే డామినేట్ చేసినట్టు అనిపించింది. ఇక గంగవ్వ, అవినాష్‌, సత్యకృష్ణ, సీరత్ కపూర్, వేణు ఇలా చాలా మంది తమ పాత్రల పరిధిమేర నటించారు. ఇక రోహిణి మరోసారి ఫుల్‌గా కామెడీ పాత్రతో ఆకట్టుకుంది. ఇక టేక్నీకల్ టీం విషయానికి వస్తే క్రియేటర్ గా షో రన్నర్ గా మహి వి రాఘవ మార్క్ ఆద్యంతం కనిపించింది. ఒక పక్క యాత్ర 2, సైతాన్ వంటి భిన్నమైన సబ్జెక్ట్ లతో ఆకట్టుకుంటున్న మహి వి రాఘవ ఫ్యామిలీ కామెడీ ఎంటర్టైనర్ తో కూడా ఆడియన్స్ ని మెప్పిస్తూ అదుర్స్ అనిపించేలా చేసుకున్నాడు. మొదటి సీజన్ తో సూపర్ హిట్టుని అందుకున్న మేకర్స్, ఈ సెకండ్ సీజన్ తో కూడా దాదాపు మళ్ళీ హిట్ టాక్ అందుకుంటున్నారు.

ఫైనల్ గా : ఈ వీకెండ్ లో ఫ్యామిలీ అంతా కూర్చొని సరదాగా చూసి ఎంజాయ్ చేయగలిగేలా ఉంది సేవ్ ది టైగర్స్ 2.

Show comments