Prem Kumar Movie Review: నటుడిగా పలు సినిమాల్లో కనిపించిన అభిషేక్ మహర్షి రచయితగా కుడా సినీ వర్గాల వారికి తెలుసు. ఆయన దర్శకుడిగా ‘ప్రేమ్ కుమార్’ అనే సినిమా తెరకెక్కించారు. సంతోష్ శోభన్ హీరోగా రాశి సింగ్, రుచితా సాధినేని హీరోయిన్లుగా తెరకెక్కిన ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి అందరి దృష్టి ఆకర్షించింది. అయితే ఈ సినిమా ఎట్టకేలకు ఈ శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? అనేది రివ్యూలో తెలుసుకుందాం.
ప్రేమ్ కుమార్ కథ ఏమిటంటే?
ప్రేమ్ కుమార్ (సంతోష్ శోభన్), నేత్ర (రాశి సింగ్) పెళ్లి మండపంలో పెళ్ళికి సిద్దం అవుతూ ఉండగా నేత్రను ప్రేమిస్తున్నానని హీరో రైజింగ్ స్టార్ రోషన్ బాబు (కృష్ణ చైతన్య) వచ్చి పెళ్లి ఆపేస్తాడు. ఆ తర్వాత ప్రేమ్ కుమార్ మరో పెళ్లికి రెడీ అయితే అదీ క్యాన్సిల్ అవుతుంది. పెళ్లి కావడం లేదని ప్రేమ్ కుమార్ తన స్నేహితుడు సుందర్ లింగం (కృష్ణ తేజ)తో కలిసి ఒక డిటెక్టివ్ ఏజెన్సీ పెడతాడు. ప్రేమ, పెళ్లి జంటలను విడగొట్టడం, ఒక్కోసారి కలపడం వీరి స్పెషాలిటీ. అయితే అంతా సాఫీగా సాగిపోతున్న క్రమంలో ప్రేమ్ కుమార్ కి నేత్ర అడ్డుపడుతుంది. ఆమె మీద ప్రేమ్ కి ప్రేమ కలుగుతుంది. అయితే అదే సమయంలో రోషన్, నేత్రని కాకుండా అంగనా(రుచితా సాధినేని)ని పెళ్లి చేసుకోవడానికి సిద్దమై అదే కాంట్రాక్ట్ నేత్రకు వెళ్ళడంతో ఆమె ఏం చేసింది? ప్రేమ్ కుమార్ దగ్గరకు అంగనా పెళ్లి చెడగొట్టమని వచ్చింది ఎవరు? చివరికి అంగనా, రోషన్ పెళ్లి చేసుకున్నారా? న్రేత్రకు తన ప్రేమ విషయం ప్రేమ్ చెబుతాడా? అనేది ఈ సినిమా కధ.
విశ్లేషణ :
‘ప్రేమ్ కుమార్’ సినిమాను కథగా చూస్తే ఐడియా బాగుంది. అలాగే సినిమాలో డిస్కస్ చేసిన అంశాలు కూడా ఆలోచించదగ్గవే. ఎందుకంటే ఈ రోజుల్లో పెళ్లి కాని యువతీ యువకులు, అలాగే పెళ్ళైనా తమ భార్య లేదా భర్తపై అనుమానం ఉన్న వాళ్ళు ఎక్కువయ్యారు. అయితే అలాంటి వారు అందరినీ భాగం చేసేలా కథ రాసుకున్నాడు అభిషేక్. అభిషేక్ మహర్షి కథలో చాలా విషయం ఉంది కానీ, కథనం మాత్రం ఆసక్తి కలిగించకుండా సాగతీతగా సాగుతూ ఉంటుంది. సినిమా కథనం ఊహించగలిగేలా ఉండడం సినిమాకి పెద్ద మైనస్. తీసుకున్న పాయింట్ తో సినిమా పండించే ఆస్కారం ఉంది కానీ అందుకో ఆశించిన స్థాయిలో వినోదం పండలేదు. ఎమోషనల్ సన్నివేశాలు కూడా కనెక్ట్ అయ్యేలా లేవు. ఇక పాటలు బాగున్నాయి. నేపథ్య సంగీతం ఫర్వాలేదు అనిపించింది. చూడడానికి చిన్న బడ్జెట్ సినిమా అనిపిస్తున్నా నిర్మాణ్ విలువలు బాగున్నాయి. మంచి పాయింట్ అయినా ఎగ్జిక్యూషన్ లో తేడా పడింది లేకుంటే దూసుకుపోయేది.
ఎవరెలా చేశారంటే?
ప్రేమ్ కుమార్ పాత్రకు సంతోష్ శోభన్ పూర్తి స్థాయిలో సూట్ అయ్యాడు. ప్రేమ్ కుమార్ అలియాస్ పీకేగా పాత్రలో సంతోష్ శోభన్ ఒదిగిపోయాడు. అంగనా పాత్రలో రుచితా సాధినేని నేటి తరం అమ్మాయిగా భలే సూట్ అయింది. సంతోష్ శోభన్, రాశి సింగ్ హీరోహీరోయిన్లు అయినా చివరికి కానీ కలవరు కాబట్టి రాశికి పెద్దగా స్కోప్ లేదు. కృష్ణ తేజ కామెడీతో అదరగొట్టాడు. మేనేజర్ డాడీ పాత్రలో సుదర్శన్ రెచ్చిపోయాడు. రోషన్ బాబు పాత్రలో నటించిన కృష్ణ చైతన్య, సంతోష్ శోభన్ తల్లిగా సురభి ప్రభావతి, రాశి సింగ్ తండ్రిగా రాజ్ మాదిరాజు తమ తమ పాత్రల పరిధి మేరకు నటించారు.
ఫైనల్ గా
కామెడీ వర్కవుట్ కాలేదు కానీ మంచి పాయింట్.. ప్రేమ్ కుమార్.. అందర్నీ ప్రేమలో పడేసుకోలేక పోయాడు.