మిత్ర విందా మూవీస్ తో కలిసి ప్రియాంక దత్ నిర్మించిన సినిమా ‘అన్నీ మంచి శకునములే’. నందినీరెడ్డి దర్శకత్వం వహించిన ఈ మూవీలో సంతోష్ శోభన్, మాళవిక నాయర్ జంటగా నటించారు. గురువారం జనం ముందుకు వచ్చిన ఈ సినిమాకు మిక్కీ జె మేయర్ మ్యూజిక్ అందించారు. మరి ఈ సినిమా శకునం ఎలా ఉందో చూద్దాం.
ఆంధ్ర, తమిళనాడు సరిహద్దు గ్రామమైన విక్టోరియా పురంలోని ఓ కాఫీ ఎస్టేట్ కోర్టు గొడవల్లో ఉంటుంది. మూడు తరాలుగా రెండు కుటుంబాలు దాని కోసం ఎడతెగని న్యాయపోరాటం చేస్తుంటాయి. ఈ తరానికి వస్తే రిషి (సంతోష్ శోభన్), ఆర్య (మాళవిక నాయర్) ఆ రెండు కుటుంబాలకు చెందిన వాళ్ళు. చిత్రం ఏమిటంటే… ఈ రెండు ఫ్యామిలీస్ మధ్య కోర్టులో కేసు సాగుతున్నా… రాకపోకలు బాగానే ఉంటాయి. అంతే కాకుండా ఈ రెండు కుటుంబాలకు మధ్య మరో ట్విస్ట్ కూడా ఉంటుంది. అది రివీల్ చేస్తే… మజా పోతుంది! సో ఆ సీక్రెట్ ను అలానే మెయిన్ టైన్ చేస్తే బెటర్! చిన్నప్పటి నుండి కలిసి చదువుకున్న రిషి, ఆర్య ఒకరి పట్ల ఒకరు ప్రేమ పెంచుకుంటారు. కానీ దాన్ని బయటకు చెప్పుకోరు! ఒకానొక టైమ్ లో రెగ్యులర్ తెలుగు సినిమా తరహాలోనే బ్రేకప్ కూడా జరుగుతుంది. ఆర్య మరో కుర్రాడి వైపు మొగ్గు చూపుతే, అమెరికా వెళ్ళిపోయిన రిషి కెరీర్ మీద దృష్టి పెడతాడు. ఈ రెండు కుటుంబాల మధ్య కోర్టు కేసు ఎలా సాల్వ్ అయ్యింది? అందుకోసం రిషి ఏం చేశాడు? తనకంటే ఆర్య బెటర్ అనే ఆత్మన్యూనతా భావంతో ఉన్న రిషి… ఆమెను చివరకు పెళ్ళి చేసుకున్నాడా? లేదా? అనేదే మిగతా కథ.
వైజయంతి మూవీస్, స్వప్న సినిమా బ్యానర్ నుండి ఈ మధ్య కాలంలో మంచి సినిమాలు వచ్చాయి. ‘మహానటి’, ‘సీతారామం’ వంటివి జాతీయ స్థాయిలో మంచి గుర్తింపును, గౌరవాన్ని పొందాయి. ‘జాతిరత్నాలు’ సినిమా బాక్సాఫీస్ బరిలో భారీ కలెక్షన్లు వసూలు చేసింది. అయితే వాటితో ‘అన్ని మంచి శకునములే’ చిత్రాన్ని పోల్చలేం. ఇది నందినీరెడ్డి మార్క్ సినిమా. ఆమె తన చిత్రాలలో ప్రేమలు, పెళ్ళిళ్ళు, భావోద్వేగాలకు పెద్దపీట వేస్తుంటారు. ఇందులోనూ అవన్నీ ఉన్నాయి. కానీ అవేవీ కూడా ప్రేక్షకుల మనసుల్ని కట్టిపడేయ లేకపోయాయి. ‘వావ్ మూమెంట్’ అనేది లేకుండా… సినిమా ప్రారంభం నుండి ముగింపు వరకూ ఏదో అలా సాగిపోయిందంతే! ఏ పాత్ర ఎప్పుడు, ఎందుకు ఎంట్రీ ఇస్తుందో… ఎప్పుడు, ఎందుకు ఎగ్జిట్ అవుతుందో అర్థం కాదు. ఇక టూ మెనీ క్యారెక్టర్స్ ను క్రియేట్ చేయడంతో వాళ్ళ మధ్య రిలేషన్ కూడా పెద్ద క్వశ్చన్ మార్క్ అయిపోయింది. అప్రధానమైన పాత్రలు అనేకం ఈ కథలోకి చొరబడిపోయాయి. వాటిని కాస్తంత గుర్తింపు ఉన్న నటీనటులు చేయడంతో… వారి నుండి ఆడియెన్స్ ఏదో ఒకటి ఎక్స్ పెక్ట్ చేస్తారు. కానీ అవేవీ డెలివరీ చేయకుండా ఆ క్యారెక్టర్స్ మాయమైపోతుంటాయి. బలహీనమైన కథాకథనాల కారణంగా భారీ తారాగణంతో రూపుదిద్దుకున్న ఈ సినిమా ఏ స్థాయిలోనూ ప్రేక్షకుల మనసుల్ని మెప్పించలేకపోయింది. బహుశా రెండు మూడేళ్ళ పాటు ఈ ప్రాజెక్ట్ సెట్స్ లో ఉండిపోవడం వల్ల లూజ్ ఎండ్స్ ఎక్కువైపోయాయి అనిపిస్తోంది.
నటీనటుల విషయానికి వస్తే… సంతోష్ శోభన్ కు ఇది కేక్ వాక్ లాంటి క్యారెక్టర్. కానీ ఎందుకో చాలా భారంగా దాన్ని లాగినట్టుగా అనిపించింది. బట్… మాళవిక నాయర్ తన క్యారెక్టర్ ను సమర్థవంతంగా పోషించింది. రాజేంద్ర ప్రసాద్, రావు రమేశ్, నరేశ్, గౌతమి, అశ్విన్ కుమార్ లక్ష్మీకాంతన్ తమ పాత్రలకు న్యాయం చేకూర్చారు. మాళవిక నాయర్ తల్లి అంజు హీరోయిన్ మదర్ గా నటించడం విశేషం. వెన్నెల కిశోర్, రాజ్ మాదిరాజు, తాగుబోతు రమేశ్, ఝాన్సీ, ఆర్జే హేమంత్, జెమినీ సురేశ్, సమీర్, రమ్యా సుబ్రమణ్యన్ తదితరులు ఇతర పాత్రలు పోషించారు. ‘అల వైకుంఠపురములో’ ఈశ్వరీరావు పోషించిన నర్స్ తరహా పాత్రను ఇందులో ఊర్వశి చేసింది. అలనాటి మేటి నటీమణి షావుకారు జానకీ ఇంతకాలం తర్వాత పెద్దంత ప్రాధాన్యం లేని పాత్రలో కనిపించడం బాధగా అనిపిస్తుంది. అలానే సీనియర్ నటుడు గిరిబాబును ఏదో అలా చూపించారంతే! ‘తొలిప్రేమ’ ఫేమ్ వాసుకి పాతికేళ్ళ తర్వాత రీ-ఎంట్రీ ఇచ్చేంత గొప్ప పాత్రేమీ కాదు ఇది.
ఈ సినిమాకు మూల కథను శ్రీహరి నాను అందించారు. బట్ అందులో చెప్పుకోదగ్గ గొప్ప పాయింట్స్ కానీ ఉత్సుకత కలిగించే అంశాలు గానీ లేవు. లక్ష్మీ భూపాల రాసిన మాటలు సహజంగా ఉండి ఆకట్టుకున్నాయి. మిక్కీ జె మేయర్ స్వరపరిచిన టైటిల్ సాంగ్ బాగుంది. మిగిలిన పాటలు సో..సో!! క్లయిమాక్స్ లో మిక్కీ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో సన్నివేశాలను ఎలివేట్ చేసే ప్రయత్నం చేశారు. నిర్మాణపరంగా స్వప్న, ప్రియాంక దత్ ఎక్కడా రాజీ పడలేదు. మండు వేసవిలో చల్లని చిరుగాలి లాంటి అనుభూతిని ‘అన్ని మంచి శకునములే’ ఇస్తుందని భావించి థియేటర్ కు వెళ్ళిన వారు నిరాశకు గురి కాకతప్పదు.
రేటింగ్: 2.25/5
ప్లస్ పాయింట్స్
పేరున్న ఆర్టిస్టులు నటించడం
సినిమాటోగ్రఫీ
నేపథ్య సంగీతం
నిర్మాణ విలువలు
మైనస్ పాయింట్స్
బలహీనమైన కథ
ఆకట్టుకోని కథనం
టూ మెనీ క్యారెక్టర్స్
ట్యాగ్ లైన్: సమ్మర్ శకునం బాలేదు!