NTV Telugu Site icon

Tiger 3 Review: టైగర్ 3 రివ్యూ

Tiger 3 Review

Tiger 3 Review

Tiger 3 Review in Telugu:యష్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్ లో ఐదవ చిత్రం ‘టైగర్ 3’ దీపావళి ప్రేక్షకుల ముందుకు వచ్చింది.సల్మాన్, కత్రినా జంటగా నటించిన ఈ సినిమాలో ఇమ్రాన్ హష్మీ విలన్ గా నటించాడు. యష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్‌లో ఇప్పటి వరకు ఏక్ థా టైగర్, టైగర్ జిందా హై, వార్, పఠాన్ వంటి బ్లాక్ బస్టర్స్ సినిమాలతో ఆడియెన్స్‌ అలరించారు. ఇప్పుడు ఈ స్పై యూనివర్స్‌లో భాగంగా టైగర్ 3 కూడా మనీష్ శర్మ దర్శకత్వంలో ఆదిత్య చోప్రా నిర్మాణంలో రూపొండింది. ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని హిందీ, తమిళ, తెలుగు భాషల్లో నవంబర్ 12న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ చేయగా ఈ సినిమాలూ షారుఖ్, హృతిక్, ఎన్టీఆర్ వంటి వారు కనిపిస్తారని ప్రచారం జరగడంతో తెలుగు ఆడియన్స్ కూడా సినిమా మీద ద్రుష్టి పెట్టారు. మరి ఈ సినిమా ఎలా ఉంది? అనేది రివ్యూలో చూద్దాం పదండి.

టైగర్ 3 కథ విషయానికి వస్తే:
2012లో వచ్చిన ‘ఏక్ థా టైగర్’, ఆ తర్వాత వచ్చిన ‘టైగర్ జిందా హై’ సినిమాలో సీక్వెల్ గా ‘టైగర్ 3’ వచ్చింది. సీనియర్ రా ఏజెంట్ అవినాష్ అలియాస్ టైగర్(సల్మాన్ ఖాన్) తన భార్య, మాజీ ఐఎస్ఐ ఏజెంట్ జోయా(కత్రినా)తో కలిసి జీవిస్తున్న క్రమంలో ఒక రా ఏజెంట్ ను పాకిస్తాన్ లో కాపాడాల్సి వస్తుంది. అలా కాపాడిన ఏజెంట్ నుంచి తన భార్య జోయా గురించి ఒక షాకింగ్ విషయం తెలుసుకుంటాడు. తన సర్వస్వం అనుకున్న భార్య తనను మోసం చేసి మళ్ళీ ఐఎస్ఐ కోసం పనిచేస్తున్న విషయం తెలుసుకుని నీరు గారిపోతాడు. అయితే అసలు జోయా భర్తను ఎందుకు మోసం చేసింది? తన ఐఎస్ఐ బాస్ ఆతిష్ రెహమాన్(ఇమ్రాన్ హష్మీ)తో కలిసి జోయా ఏం చేసింది? జైలుకు వెళ్లిన ఆతిష్ రెహమాన్ ఎలా తప్పించుకున్నాడు? ఇక ఈ క్రమంలో రా చీఫ్(రేవతి), పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్(సిమ్రాన్) ఏం చేశారు? చివరికి జోయా టైగర్ కు నిజం చెప్పిందా? అసలు తన భార్య చేసిన మోసం తెలిసి టైగర్ ఏం చేశాడు? అనేదే సినిమా కథ.

విశ్లేషణ:
యశ్ రాజ్ స్పై యూనివర్స్‌ లో వచ్చిన సినిమా ‘టైగర్ 3’ సినిమా కథ విషయంలో కూడా నిర్మాత ఆదిత్య చోప్రా పూర్తి జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేశాడు. శ్రీధర్ రాఘవన్ స్క్రిప్ట్ సినిమాకి సరిగ్గా నప్పలేదు. నిజానికి గతంలోని యశ్ రాజ్ ఫిలింస్ స్పై యూనివర్స్ సినిమాల స్పెషాలిటీ ఏంటంటే.. ప్రేక్షకులకు ఆలోచించే అవకాశం ఇవ్వకపోవడం, ప్రతి క్షణం ఏదో ఒకటి తెర మీద ఊహించని విషయాలు జరుగుతూ ఉండడమే. సినిమా ముగిసే సమయానికి కానీ ఎక్కడ ఏమేం జరిగింది అని ప్రేక్షకులు నెమరువేసుకునే అవకాశం ఇవ్వరు, కానీ ఈ టైగర్ 3 విషయంలో అదేమీ కనిపించలేదు. ఎందుకంటే తరువాత ఏమి జరగబోతుంది అనే విషయం ప్రేక్షకుడు చాలా ఈజీగా గెస్ చేసుకునేలా సినిమా స్క్రిప్ట్ రాసుకున్నారు. ఈ తరహా స్పై సినిమాలు అంటే ప్రేక్షకులను సీట్లకు అతుక్కుని కూర్చుని ఉండేలా చేయగలగాలి, లేదంటే ఈ సోషల్ మీడియా యుగంలో ఆ గ్యాప్ లో కూడా ఫోన్ లలో దూరిపోతారు మన ప్రేక్షకులు. ఈ టైగర్ 3 సినిమాను అంత పకడ్బందీగా తెరకెక్కించే ప్రయత్నం చేయలేదేమో అని అనిపించింది. ఎందుకంటే సినిమా మొత్తం మీద ప్రేక్షకులు ఎగ్జయిట్ అయ్యేలా కొన్ని సీన్లు కూడా ప్లాన్ చేసుకోలేక పోయారు మేకర్స్. రొటీన్ కూడా అనలేని ఒక బిలో యావరేజ్ స్పై డ్రామా. టైగర్ ను కాపాడడం కోసం పఠాన్ రావడం, చివరిలో కబీర్ గా హృతిక్ ఎంట్రీ సీన్లు మినహా పెద్దగా చెప్పుకోవడానికి పెద్దగా హై మూమెంట్స్ లేవు, అదే సినిమాకి మైనస్ అయ్యే అవకాశం ఉంది. మొదటి భాగం, ఇంటెర్వెల్ ప్లాట్ చాలా బలహీనంగా ఉంది. ఇక సెకండ్ హాఫ్ క్లైమాక్స్ కూడా కొంతవరకే ప్రేక్షకులను మెప్పించింది.

నటీనటుల విషయానికి వస్తే సల్మాన్ ఖాన్ ఎప్పటిలానే తన స్టైల్ లో అదరకొట్టాడు. షారుఖ్ కూడా కనిపించింది కొంచెంసేపు అయినా మంచి ముద్ర వేసుకునే ప్రయత్నం చేశాడు. సల్మాన్, కత్రినా వయసు పైబడినట్టు కనిపిస్తున్నా షారుఖ్ మాత్రం సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ తో ఆకట్టుకున్నాడు. ఇక రేవతి, సిమ్రాన్ తమ పరిధి మేరకు నటించారు. ఇమ్రాన్ హష్మీ విలన్ గా ఎందుకో సూట్ అవ్వలేదు కానీ ఉన్నంతలో బాగానే నటించాడు. హృతిక్ కూడా కనిపించి తరువాతి భాగం మీద అంచనాలు పెంచాడు. టెక్నీకల్ టీమ్ విషయానికి వస్తే మనీష్ శర్మ కాకుండా మరెవరైనా ఈ సినిమాకి దర్శకత్వం వహించి ఉంటే గొప్ప చిత్రం అయ్యేది, ఇప్పుడు ఆయన డైరెక్షన్ యావరేజ్‌గా మిగిలిపోయింది..సల్మాన్, కత్రినా, షారుక్, ఇమ్రాన్ లాంటి స్టార్లు ఉన్నపుడు సినిమాను ఇంకా బాగా తీయచ్చు కానీ మనీష్ సరిగ్గా వారిని ఉపయోగించుకోలేకపోయాడు. ఇక ఈ సినిమా సంగీతం బాగానే ఉంది కానీ ప్రీతమ్ సంగీతానికి ప్రత్యేకత అంటూ ఏమీ లేదు, థియేటర్ నుంచి హమ్మింగ్ చేసుకుంటూ బయటకు వచ్చే పాట ఒక్కటీ లేదు. సినిమాటోగ్రపీ ఫర్వాలేదు, ఎడిటింగ్ కూడా క్రిస్పీగా ఉంది. నిర్మాణ విలువలు అయితే హై లెవల్ అంతే.

ఓవరాల్‌గా దీపావళి రోజున సల్మాన్‌, షారుఖ్‌లను కలసి చూడాలనుకుంటే ఎలాంటి అంచనాలు లేకుండా సినిమాకి వెళ్ళాలి, స్పై సినిమాల లవర్స్ అయితే నిరుత్సాహపడడం ఖాయం.