రవి రాజా పినిశెట్టి కుమారుడు ఆది పినిశెట్టి తెలుగులో కూడా హీరోగా పలు సినిమాలు చేశాడు. ముఖ్యంగా అల్లు అర్జున్ హీరోగా సరైనోడు సినిమాలో విలన్ పాత్రలో నటించి మరింత దగ్గరయ్యాడు. ఇక ఇప్పుడు ఆయన శబ్దం అనే ఒక హారర్ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. తమిళ, తెలుగు భాషలలో ఏకైక కాలంలో ఈ సినిమాని ఒకరోజు ముందుగానే ప్రీమియర్స్ ప్రదర్శించారు. గతంలో వైశాలి అనే సినిమాతో పాటు తమిళ్ రాకర్స్ అనే ఒక వెబ్ సిరీస్ డైరెక్ట్ చేసిన అరివళగన్ దర్శకుడిగా ఈ సినిమా ప్రమోషన్స్ మొదలుపెట్టినప్పటి నుంచి సినిమా మీద ప్రేక్షకులలో ఆసక్తి ఏర్పడింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? ప్రేక్షకుల ఆసక్తిని మరింత పెంచేలా ఉందా? లేదా? అనేది ఇప్పుడు మనం రివ్యూలో చూద్దాం
శబ్దం కథ:
తమిళనాడులో ఓ హిల్ స్టేషన్ లో ఉన్న మెడికల్ కాలేజీలో వరుసగా విద్యార్థులు ఆత్మహత్య చేసుకుని చనిపోతూ ఉంటారు. అయితే అవి ఆత్మహత్యలు కావని దెయ్యాల వల్లే మరణిస్తున్నారని పుకార్లు పుట్టడంతో ఆ మెడికల్ కాలేజీ యాజమాన్యం ఒక పారా నార్మల్ ఇన్స్పెక్టర్ వ్యూమ(ఆది పినిశెట్టి)ను పిలిపిస్తారు. అలా కాలేజీలో ఎంటర్ అయిన వ్యూమ అసలు అవి ఆత్మహత్యలా లేక హత్యలా? అని తెలుసుకునే పనిలో పడతాడు. ఈ క్రమంలో ఎన్నో షాకింగ్ విషయాలు వ్యూమా దృష్టికి వస్తాయి. అసలు ఆ కాలేజీలో జరుగుతున్నవి ఆత్మహత్యలేనా? లేక ఆత్మల హత్యలా ? అనే విషయం తెలియాలంటే సినిమాని బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే.
విశ్లేషణ :
ఇది ఓ హారర్ త్రిల్లర్ అని ప్రమోషనల్ కంటెంట్ చూసినప్పుడే ప్రేక్షకులకు ఓ రేంజ్ క్లారిటీ వచ్చేసింది. ఇక ఓపెనింగ్ లోనే ఓ యువతి ఆత్మహత్య చేసుకోవడం తర్వాత పారానార్మల్ ఇన్స్పెక్టర్గా ఆదిని సీన్లోకి తీసుకురావడం ఆసక్తికరంగానే ఉంటాయి. ఆ తరువాత జరిగే పరిణామాలు చూసి ఈ సినిమా ఎక్కడికో వెళ్ళబోతోంది.. దర్శకుడు ఏదో కొత్తగా ట్రై చేయబోతున్నాడు అని ప్రేక్షకులు ఫీలవుతారు. ఆత్మలు శబ్దం ద్వారా కమ్యూనికేట్ చేయాలనుకోవడం, తద్వారా ఏర్పడే పరిణామాలు సినిమా మీద విపరీతమైన ఆసక్తి ఏర్పరచడమే కాదు సెకండ్ హాఫ్ లో ఏం జరుగుతుందా అని సీట్లకే పరిమితమయ్యేలా చేయడంలో దర్శకుడు సఫలమయ్యాడు. ముఖ్యంగా ఇంటర్వెల్ ముందు వచ్చే భాగం సెకండ్ హాఫ్ మీద మరిన్ని అంచనాలతో పాటు ఆసక్తి పెంచేస్తుంది. అయితే సెకండ్ హాఫ్ మొదలైన తరువాత మాత్రం ఆ ఆసక్తి నెమ్మదిగా సడలుతూ వెళుతుంది. దానికి కారణం అప్పటివరకు ఇంకేదో జరగబోతోంది అని భావించిన ప్రేక్షకులకు అదేమీ లేదు ఇది రొటీన్ కథే అన్నట్లుగా దర్శకుడు ఒక్కొక్క విషయాన్ని రివీల్ చేస్తూ వెళ్లిన విధానం నీరస పరుస్తుంది. ఫస్ట్ ఆఫ్ లో ఏర్పడిన ఎన్నో అనుమానాలకు సెకండ్ హాఫ్ లో సమాధానాలు దొరికినా సరే ఎందుకో ఫస్ట్ ఆఫ్ లో కలిగిన ఎక్సైట్మెంట్ సెకండ్ హాఫ్ లో నీరుగారిన ఫీలింగ్ కలుగుతుంది. అయితే కీలకమైన సన్నివేశాలలో తమన్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కొన్నిచోట్ల భయపెట్టింది, కొన్ని చోట్ల భలే సౌండ్ ఇచ్చాడే అనిపించేలా చేసింది. అయితే సెకండ్ హాఫ్ విషయంలో కూడా మరింత కేర్ తీసుకుని ఉంటే సినిమా రిజల్ట్ తెలుగులో వేరేలా ఉండేదని మాత్రం చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
నటీనటుల విషయానికి వస్తే ఆది పారానార్మల్ ఇన్వెస్టిగేటర్ పాత్రలో ఒదిగిపోయాడు. నిజంగానే పారానార్మల్ ఇన్వెస్టిగేటర్ ఏమో అనేలా నటించాడు. కీలక పాత్రలో నటించిన లక్ష్మీ మీనన్ ఉన్నంతలో పర్వాలేదనిపించింది. ఇక చాలా రోజుల తర్వాత తెరమీద కనిపించిన సిమ్రాన్ ఆకట్టుకుంది. లైలా కొన్నిచోట్ల ఒకలా మరికొన్నిచోట్ల మరోలా ఉండడం కాస్త ఇబ్బందికర అంశమే. అయితే ఈ మధ్యకాలంలో తమిళనాడులో కమెడియన్గా ఆకట్టుకుంటున్న కింగ్స్లే ఈ సినిమాలో క్రింజ్ అనిపించేలా కామెడీ చేశాడు.. మిగతా పాత్రధారులు ఉన్నంతలో తమ పాత్రలకు న్యాయం చేశారు. ఇక టెక్నికల్ అంశాల విషయానికి వస్తే ఈ సినిమా టెక్నికల్లీ పవర్ ప్యాక్ డిజైన్డ్ ఫిలిం. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మొదలుకొని సౌండ్ ఇంజనీరింగ్ వరకు అన్ని విషయాలను చాలా జాగ్రత్తగా తీసుకుని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. సౌండ్ డిజైన్ అయితే ప్రేక్షకులను వణికించేలా ఉంది. కొన్ని షాట్స్ అయితే ప్రేక్షకులను మరింత భయపెట్టేలా చేయడంలో సినిమాటోగ్రాఫర్ సక్సెస్ అయ్యాడు అని చెప్పొచ్చు. అయితే విఎఫ్ఎక్స్ ఇంకాస్త బాగా చేయొచ్చు కానీ తక్కువలో చుట్టేశారేమో అనిపిస్తుంది. నిడివి విషయంలో తీసుకున్న జాగ్రత్త వర్కౌట్ అయింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. తెలుగు డబ్బింగ్ లో కూడా జాగ్రత్తలు తీసుకున్నట్లుగా అనిపించింది.
ఓవరాల్ గా శబ్దం.. హారర్ థ్రిల్లర్ ఫ్యాన్స్ కి ఓ ట్రీట్