Repeat Movie Review:నవీన్ చంద్ర, మధుబాల కీలక పాత్రలు పోషించిన సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ‘రిపీట్’. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఇది స్ట్రీమింగ్ అవుతోంది. చిత్రం ఏమంటే.. ఇదే సినిమా ‘డెజావు’ పేరుతో అమెజాన్ ప్రైమ్ లోనూ ఉంది. కాకపోతే… అందులో హీరో అరుల్ నిథి చేసిన పాత్రను తెలుగులో నవీన్ చంద్ర చేశాడు. మిగిలినదంతా పేరుకు తగ్గట్టు ‘రిపీట్’ అయ్యింది.
కథ విషయానికి వస్తే.. పాపులర్ రైటర్ సుబ్రహ్మణ్యం (అచ్చుత్ కుమార్) రాసే కథలోని పాత్రలు, నిజ జీవితంలో అతన్ని ఫోన్ లో బెదిరిస్తుంటాయి. ఆ విషయమై సుబ్రహ్మణ్యం పోలీస్ కంప్లైంట్ ఇస్తాడు. ఇదే సమయంలో డీజీపీ ఆశా ప్రమోద్ (మధుబాల) కూతురు పూజా (స్మృతీ వెంకట్) కిడ్నాప్ కు గురౌతుంది. ఆమె ఈ విషయాన్ని పోలీసులకు ఫోన్ చేసి చెబుతూ రైటర్ సుబ్రహ్మణ్యం పేరు ప్రస్తావిస్తుంది. డీజీపీ కూతురుకు ఈ రైటర్ వల్ల ప్రమాదం ఉందని భావించిన పోలీసులు అతన్ని అరెస్ట్ చేయబోతారు. కానీ ఇంటి చుట్టుపక్కల వాళ్ళ అభ్యంతరాల కారణంగానూ, మీడియాకూ భయపడి వదిలేస్తారు. కిడ్నాప్ అయిన కూతుర్ని కాపాడటం కోసం డీజీపీ ఆశా తప్పనిసరి పరిస్థితుల్లో అండర్ కవర్ పోలీస్ ఆఫీసర్ విక్రమ్ కుమార్ (నవీన్ చంద్ర)ను రంగంలోకి దించుతుంది. రైటర్ సుబ్రహ్మణ్యం కాగితంపై రాసిన సంఘటనలే కళ్ల ముందు ఎలా జరుగుతున్నాయి? డీజీపీ కూతురు కిడ్నాప్ వెనుక సూత్రధారులు ఎవరు? ఈ మొత్తం వ్యవహారాన్ని ఎవరు? ఎలా కంట్రోల్ చేస్తున్నారు? అనేదే క్లయిమాక్స్.
సినిమా ప్రారంభం నుండి ముగింపు వరకూ ఊహించని ట్విస్టులతో సాగింది. కిడ్నాప్ కు కారకులు ఎవరై ఉంటారనే విషయంలోనూ ఆడియెన్స్ గెస్ చేయలేని విధంగా దర్శకుడు కథను నడిపాడు. ఇది రొటీన్ రివేంజ్ స్టోరీనే అయినా, పాత్రల మధ్య అనుబంధాన్ని దర్శకుడు రివీల్ చేసిన పద్థతి ఆసక్తికరంగా ఉంది. కీలక పాత్రల్లోని గ్రే షేడ్స్ ను కూడా చాలా కన్వెన్సింగ్ గా చెప్పడం బాగుంది. సినిమా ఆసాంతం ఏదో ఒక పాత్ర స్మోక్ చేయడమో, డ్రింక్ చేయడమో చేస్తుంటుంది. దాంతో స్టాట్యూటరీ వార్నింగ్ సినిమా అంతా డిస్ ప్లే అవుతూనే ఉంది. కథానుగుణంగా అత్యధిక భాగం రాత్రి సమయాల్లో చిత్రీకరించారు. దానికి తగ్గ మూడ్ ను నిర్మాతల్లో ఒకడైన, సినిమాటోగ్రాఫర్ పి.జి. ముత్తయ్య బాగా క్రియేట్ చేశాడు. జిబ్రాన్ నేపథ్య సంగీతం ఈ సినిమాకు మరో హైలైట్ గా నిలిచింది. దర్శకుడు అరవింద్ శ్రీనివాసన్ కు ఇది ఫస్ట్ మూవీనే అయినా గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో ఆకట్టుకున్నాడు.
ఇది బేసికల్ గా తమిళ్ మూవీ. ‘డెజావు’ పేరుతో అక్కడ జూలై నెలలో థియేటర్లలో రిలీజ్ అయ్యింది. తమిళంతో పాటు తెలుగు డబ్బింగ్ వర్షన్ కూడా అమెజాన్ ప్రైమ్ లోనూ ఉంది. అయితే దర్శకుడు హీరో పాత్రతో పాటు మరికొన్ని పాత్రలకు తెలుగువారిని తీసుకుని, కొన్ని సన్నివేశాలు రీ-షూట్ చేశాడు. దాంతో దీన్ని తెలుగు సినిమాగానే ప్రెజెంట్ చేసి, సెన్సార్ చేసి, ఇప్పుడు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ కు ఇచ్చారు. ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ విక్రమ్ గా నవీన్ చంద్ర ఎంట్రీ కాస్తంత ఆలస్యంగానే జరిగింది. కానీ అతను ఎంటర్ అయిన దగ్గర నుండి మూవీ స్పీడ్ అందుకుంది. అతన్ని చైన్ స్మోకర్ గా చూపించాల్సిన అవసరం ఏమిటో అర్థం కాదు. అలానే రైటర్ ను పచ్చి తాగుబోతుగా ప్రెజెంట్ చేయడంలోనూ ఔచిత్యం కనిపించదు. ‘కాంతార’తో తెలుగువారి దృష్టిలో పడిన కన్నడ నటుడు అచ్యుత్ కుమార్ ఇందులో రైటర్ గా సహజ నటన కనబరిచాడు. డీఐజీగా మధుబాల బాగా యాక్ట్ చేసింది. తెలుగు వర్షన్ లో నవీన్ చంద్ర సహాయకులుగా ‘సత్యం’ రాజేశ్, పూజా రామచంద్రన్ నటించారు. అలానే మరో కీలక పాత్రను సుదర్శన్ పోషించాడు. మైమ్ గోపీ, కాళీ వెంకట్, రాఘవ విజయ్, చేతన వంటి వారు రెండు వర్షన్స్ లోనూ ఉన్నారు. ఫిల్మ్ మేకింగ్ వెనుక కథ ఎలా ఉన్నా.. ఓటీటీలో ఈ సినిమా చూస్తున్నప్పుడు వ్యూవర్ థ్రిల్ కు గురవుతాడు. మేకింగ్ వాల్యూస్ పెద్దంత లేకపోయినా, కథనం ఆసక్తికరంగా ఉండి ఆకట్టుకుంటుంది. థ్రిల్లర్ జానర్ మూవీస్ ను ఇష్టపడేవానికి ‘రిపీట్’ నచ్చుతుంది.
రేటింగ్: 2. 75 / 5
ప్లస్ పాయింట్స్
ఎంచుకున్న థీమ్
రివేంజ్ డ్రామా కావడం
సినిమాటోగ్రఫీ, మ్యూజిక్
మైనెస్ పాయింట్స్
డబ్బింగ్ వాసనలు
లాజిక్ లేని సన్నివేశాలు
ఊహకందే క్లయిమాక్స్ ట్విస్ట్
ట్యాగ్ లైన్: ‘రిపీట్’ చేశారు!