కమెడియన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ధనరాజ్ దర్శకుడిగా మారి తెరకెక్కించిన సినిమా ‘రామం రాఘవం’. ధనరాజ్, సముద్రఖని ప్రధాన పాత్రలలో హరీష్ ఉత్తమన్, సత్య, ప్రమోదిని, పృథ్వీరాజ్, సునీల్, మోక్ష లాంటి వారు ఇతర పాత్రల్లో నటించారు. స్లేట్ పెన్సిల్ స్టోరీస్ బ్యానర్ పై పృథ్వి పోలవరపు నిర్మాణంలో ధనరాజ్ దర్శకత్వంలో రామం రాఘవం సినిమాను నిర్మించగా ఫిబ్రవరి 21న తెలుగు, తమిళ్ లో రిలీజ్ కానుంది. సినిమా మీద నమ్మకంతో మీడియాకు ముందే ప్రీమియర్ షో వేశారు. మరి ఈ సినిమా ఎలా ఉంది? ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది? అనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం పడండి.
రామం రాఘవం కథ:
అమలాపురానికి చెందిన దశరథ రామం (సముద్ర ఖని) రిజిస్ట్రార్ ఆఫీస్‌లో ఉద్యోగి. నీతి, నిజాయితీ ఇంటి పేరుగా మార్చుకుని బతుకుతున్న అతనికి ఒకటే లోటు. తన కొడుకు రాఘవ (ధన్ రాజ్) చదువు వంటబట్టక బాధ్యత లేకుండా, తాగుతూ బెట్టింగ్స్ ఆడుకుంటూ తిరుగుతుంటాడు. కొడుకు రాఘవ అంటే దశరథ రామానికి ఎంత ప్రేమ ఉన్నా కోపంతో దారికి తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తుంటాడు. తండ్రి కొడుకుల మధ్య దూరం పెరిగి తండ్రి దశరథ రామాన్ని చంపాలని రాఘవ భావిస్తాడు. అసలు కన్న తండ్రినే రాఘవ ఎందుకు చంపాలనుకున్నాడు? తండ్రిని చంపడానికి తనకు పరిచయస్తుడైన దేవా(హరీష్ ఉత్తమన్)ను ఎలా ఒప్పించాడు. తండ్రిని కొడుకు చంపాలనుకొన్న ప్రయత్నాలు ఎంత వరకు వచ్చాయి? అనేది తెలియాలంటే సినిమాను బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే.
విశ్లేషణ:
రామం రాఘవం అనే టైటిల్ చూడగానే ఇదేదో సంప్రదాయ బద్ధమైన సినిమా అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. రాముడి లాంటి ఓ తండ్రికి రాక్షసుడు లాంటి కొడుకు పుడితే ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి? ఆ కొడుకు కోసం సదరు తండ్రి ఎన్ని తిప్పలు పడ్డాడు? చివరికి ఆ కొడుకు కోసం ఎలాంటి త్యాగానికి సిద్ధమయ్యాడు? అనే లైన్ తో ఈ కథ రాసుకున్నారు. నిజానికి ఇలాంటి ఒక కథను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని అనుకోవడమే ఒక పెద్ద సాహసం. ఎందుకంటే ప్రేక్షకులకు కన్విన్సింగ్ గా చెబితే సరే లేకపోతే కనుక మిస్ వైర్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్న కథ ఇది. అయితే విమానం దర్శకుడు రాసుకున్న కథను ధనరాజ్ దర్శకుడిగా మారి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేసి చాలా వరకు సక్సెస్ అయ్యాడు. నిజానికి ఆస్తికోసం తండ్రిని చంపారు లేదా తల్లిని చంపారు అని మనం వార్తలలో చూస్తూనే ఉంటాం. కానీ అల్లారు ముద్దుగా పెంచిన తండ్రిని ఆస్తి కోసం ఓ కన్న కొడుకు చంపడానికి సిద్ధమైతే? ఆ విషయం సదరు తండ్రికి ముందే తెలిస్తే? అనే పాయింట్ తో రాసుకున్న కథనం ఆసక్తికరంగా ఉంది. ఫస్ట్ ఆఫ్ అంతా రామం రాఘవం అనే క్యారెక్టర్ లను ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నంలోనే సినిమా సాగిపోతూ ఉంటుంది. సరిగ్గా ఇంటర్వెల్ బ్లాక్ తండ్రిని చంపాలని కొడుకు సిద్ధమవడంతో ఒక్కసారిగా అందరికీ చిన్న ఝలక్ ఇచ్చినట్లు అవుతుంది. కోపంలో అన్నాడేమో, ఇంత ప్రేమగా చూసుకునే తండ్రిని ఎవరైనా చంపాలని అనుకుంటారా? అని ప్రేక్షకుడు రాఘవ క్యారెక్టర్ ను ఫీల్ అవుతారు. అయితే సెకండ్ హాఫ్ మొదలయ్యాక కూడా ఎప్పుడైనా తండ్రిని చంపడం తప్పని వెనక్కి తగ్గుతాడేమో అని ఆశతో ఎదురుచూస్తూ ఉంటారు ప్రేక్షకులు. అది జరగదు సరికదా క్లైమాక్స్ రాసుకున్న విధానం అందరినీ కదిలించేలా ఉంది. అయితే ఆ క్లైమాక్స్ ప్రేక్షకులు ఊహించినట్టు కాకుండా మరోలా రాసుకోవడం ఒక రకంగా దర్శకుడు తీసుకున్న డేరింగ్ స్టెప్ అని చెప్పొచ్చు. అయితే దర్శకుడిగా ధనరాజ్ కి ఇది మొదటి ప్రయత్నమే అయినా టెక్నికల్గా ఎక్కడ తగ్గకుండా లైటింగ్ నుంచి ఫ్రేమ్స్ వరకు నటీనటుల నుంచి పర్ఫామెన్స్ రావట్టుకునే విషయం వరకు అన్నిటిలో నూటికి నూరు మార్కులు వేయించుకునే ప్రయత్నం చేశాడు. అయితే తండ్రి కొడుకుల మధ్య ప్రేమను ఎస్టాబ్లిష్ చేసే విషయంతో పాటు వారి మధ్య అంత దూరం ఎందుకు పెరిగింది అనే విషయాన్ని కూడా పూర్తిస్థాయిలో ఎస్టాబ్లిష్ చేసే విషయంలో తడబడ్డాడు. ఆ విషయం మీద కేర్ తీసుకుని ఉంటే సినిమా రిసల్ట్ వేరేలా ఉండేది. నిజానికి రాఘవ అనే పాత్ర మూర్ఖంగా తయారవడం మనం చూస్తూనే ఉంటాం కానీ అతను అంతలా మారిపోవడానికి గల కారణాన్ని ఎస్టాబ్లిష్ చేసే విధానంలో ఎక్కడో పొరపాట్లు దొర్లాయి. అందుకే తండ్రిని చంపాలనే నిర్ణయం తీసుకున్నా సరే ఎందుకో ఆ ఎమోషన్ వర్క్ అవుట్ అయిన ఫీలింగ్ కలగదు. అందుకే క్లైమాక్స్ లో ఒక షాక్ ఎలిమెంట్ ఉన్నా సరే పూర్తిస్థాయిలో దాన్ని ఫీల్ చేయలేని భావన. అయితే ఒక మంచి కథను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడంలో ధనరాజ్ ని మెచ్చుకోవాలి.
నటీనటుల విషయానికి వస్తే సముద్రఖని తండ్రి పాత్రలో నటించలేదు, జీవించాడు. నిజానికి అల్లరి చిల్లరగా తిరిగే కొడుక్కి తండ్రిగా ఒక నటిస్తున్నాడు అంటే ధనుష్ విఐపి సినిమా గుర్తొస్తుందేమో అనుకుంటారు. కానీ ఎక్కడా ఆ ఛాయలు లేకుండా నటించడంలో ఆయన సక్సెస్ అయ్యాడు. ఇక ధనరాజ్ ఎప్పటిలాగే ఒక కామెడీ పాత్రలో కనిపిస్తాడు అనుకున్న వారందరికీ షాక్ ఇస్తూ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో ఒక్కసారిగా అందరిని ఆకట్టుకున్నాడు. ఓసారి జాలి చూపించేలా మరోసారి అసహ్యించుకునేలా తన పాత్రలో ఒదిగిపోయిన తీరు బావుంది. హరీష్ ఉత్తమన్ కి తెలుగులో చాలా కాలం తర్వాత ఒక మంచి పాత్ర పడింది. సత్య అక్కడక్కడ నవ్వించే ప్రయత్నం చేశాడు. హీరోయిన్ పాత్ర ఎందుకు ఉందో అర్థం కాదు. బహుశా ఆమె సీన్స్ ఏమైనా ఎడిటింగ్ లో కట్ చేశారేమో అనిపిస్తుంది. పృధ్వి పాత్ర సినిమాలో కొంత ఇంపాక్ట్ చూపించే ప్రయత్నం చేసింది కానీ సునీల్ పాత్ర కూడా ఎందుకో చాలా పరిమితంగా అనిపిస్తుంది. ఇక టెక్నికల్ టీం విషయానికి వస్తే సినిమాను అందంగా చూపించడంలో సినిమాటోగ్రాఫర్ సక్సెస్ అయ్యాడు. కొన్ని ఫ్రేమ్ సెట్టింగ్స్ చూస్తే ఎక్కడా చిన్న సినిమా చూస్తున్న ఫీలింగ్ కలగకుండా జాగ్రత్తలు తీసుకున్నాడు. అరుణ్ సంగీతం బాగున్న బ్యాక్గ్రౌండ్ స్కోర్ మీద ఇంకా ఫోకస్ పెట్టి ఉంటే బాగుండేది అనిపిస్తుంది. సినిమాకు తగ్గట్టుగా ఆర్ట్ డిపార్ట్మెంట్ పనితీరు కనిపిస్తుంది. నిడివి కూడా సినిమాకి కలిసొచ్చేలా ఉండడంలో ఎడిటర్ సక్సెస్ అయ్యాడు. నిర్మాణ విలువలు బాగున్నాయి.
ఫైనల్లీ రామం రాఘవం ఓ మంచి ప్రయత్నం.. ముఖ్యంగా ఈ జనరేషన్ తల్లిదండ్రులు చూడాల్సిన చిత్రం.