పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ హీరోగా నటించిన ఇస్మార్ట్ శంకర్ సినిమా సూపర్ హిట్టుగా నిలిచింది. అదే సినిమాకి సీక్వెల్ గా డబుల్ ఇస్మార్ట్ అనే సినిమా అనౌన్స్ చేసినప్పటి నుండి సినిమా మీద కొంత అంచనాలు ఏర్పడ్డాయి. కావ్య థాపర్ హీరోయిన్గా నటించిన ఈ సినిమాకి పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహిస్తూనే కథ కూడా అందించారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ సినిమాని ఛార్మీ, పూరీ జగన్నాథ్ కలిసి నిర్మించారు. టీజర్, ట్రైలర్ లతో ప్రేక్షకులకు ఈ సినిమా మీద కొంత ఆసక్తి ఏర్పడింది. ఎట్టకేలకు ఈ సినిమా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో నేడు ప్రేక్షకుల ముందుకి వచ్చింది. అయితే సినిమా ఎలా ఉంది? ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది అనేది రివ్యూలో చూద్దాం.
డబుల్ ఇస్మార్ట్ కథ:
ఈ సినిమా కథ మొదటి భాగానికి కొనసాగింపు కాదు. కేవలం శంకర్ అనే క్యారెక్టర్ ను ఈ సినిమాలో కూడా కొనసాగించారు. ఇస్మార్ట్ శంకర్(రామ్) చిన్నప్పుడే తల్లి పోచమ్మ(ఝాన్సీ)ను కోల్పోతాడు. ఆమె చావుకు కారణమైన మాఫియా డాన్ బిగ్ బుల్(సంజయ్ దత్)ను చంపడానికి అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. మరో పక్క బిగ్ బుల్ కి వచ్చిన ట్యూమర్ కారణంగా తన మెమరీని వేరే వ్యక్తికి ట్రాన్సఫర్ చేయాలని అనుకుంటాడు. అయితే అనేక ప్రయత్నాలు చేసిన అనంతరం అలా ట్రాన్సఫర్ చేయడానికి శంకర్ ఒక్కడే కరెక్ట్ అని భావించి అతనికి ట్రాన్సఫర్ చేస్తారు. అయితే ఆ తరువాత బిగ్ బుల్ ను చంపాలి అనుకున్న శంకర్ పగ ఏమైంది? శంకర్ జీవితంలోకి వచ్చిన జన్నత్ (కావ్య థాపర్) ఎవరు? వారిద్దరూ కలిసి ఏం చేశారు? శంకర్ జీవితంలోకి వచ్చిన మరో పోచమ్మ (ప్రగతి) ఎవరు? అనే వివరాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ:
డబుల్ ఇస్మార్ట్ సినిమా ఇస్మార్ట్ శంకర్ కథకు కొనసాగింపు అనుకుంటే పొరపాటే. కేవలం శంకర్ క్యారెక్టర్ ను మాత్రమే ఈ సినిమాలో రిపీట్ చేశాడు. సినిమా ఓపెనింగ్ లోనే తండ్రి లేని కొడుకుగా రామ్ క్యారెక్టర్ ను ఎస్టాబ్లిష్ చేస్తూ తన తల్లి పోచమ్మ మీద ఎంత ప్రేమ పెంచుకున్నాడు అనేది చూపే ప్రయత్నం చేశారు. అయితే కథగా చెప్పుకుంటే గొప్పగా అనిపించేలా ఉన్నా పూరీ మార్క్ మేకింగ్ మాత్రం కనిపించలేదు. ఇస్మార్ట్ శంకర్ బ్యాక్ స్టోరీతో మొదలుపెట్టి బిగ్ బుల్ అనే ఇంటర్నేషనల్ క్రిమినల్ ను టార్గెట్ చేసేందుకు చేసే పనులు కన్విన్సింగ్ అనిపించేలా లేవు. అంతేకాక హీరోయిన్ ను మొదటి చూపులోనే చూసి ప్రేమలో పడడం కొత్తగా లేకున్నా ఆమెతో హీరో ప్రవర్తించే తీరు చూడడానికే ఎబ్బెట్టుగా అనిపిస్తుంది. నిజ జీవితంలో జరిగే అవకాశం లేని ఎన్నో విషయాలు మనకి ఈ సినిమాలో కనిపిస్తాయి. అయితే ప్రధానంగా మెమరీ ట్రాన్సఫర్ అనే పాయింట్ చుట్టూ అల్లుకున్న కధ ప్రేక్షకులను ఆకట్టుకునేలా లేదు. అలీతో రాసుకున్న బోకా అనే పాత్ర ముందు బాగానే ఉన్నా ఉన్నకొద్దీ క్రింజ్ అనిపించేలా సాగింది. అంతేకాక మెయిన్ కాన్ఫ్లిక్ట్ కూడా కన్విన్సింగ్ అనిపించలేదు. హీరో పాత్ర హీరోయిన్ తో ప్రవర్తించే తీరు ఫ్యామిలీతో కలిసి చూసేలా లేదు. మాస్ ఆడియన్స్ కోసం రాసుకున్న పాటలు, హీరోయిన్ ట్రాక్ , మాస్ ఫైట్లు ఆకట్టుకునేలా ఉన్నాయి .
నటీనటుల విషయానికి వొస్తే రామ్ ఎనర్జిటిక్ పర్ఫామెన్స్ తో మరో సారి ఆకట్టుకున్నాడు. తెలంగాణ యాసలో డైలాగులు కూడా సెట్ అయ్యాయి. హీరోయిన్ తో కెమిస్ట్రీ ఫర్వాలేదు కానీ కొన్ని సీన్స్ లో ఆకట్టుకుంది. ఇక సంజయ్ దత్ అదరగొట్టాడు కానీ ఆయన ఈ పాత్రకు పర్ఫెక్ట్ ఎంపిక కాదు అనిపిస్తుంది. ఇక గెటప్ శ్రీను, బానీ, అలీ వంటివాళ్ళు తమ తమ పాత్రల పరిధి మేరకు నటించారు. అలీ ట్రాక్ క్రీంజ్ అనిపిస్తే అది మీ తప్పు కాదు. టెక్నికల్ అంశాల విషయానికి వొస్తే డైలాగులు కొన్ని చోట్ల బాగానే ఉన్నా చాలా చోట్ల డబుల్ మీనింగ్ అనిపిస్తాయి. ఇక సినిమాటోగ్రఫీ మాత్రం పూరీ స్టైల్ లోనే ఉంది. అయితే సాంగ్స్ విజువల్ గా బాగున్నాయి. మాస్ సెంటర్లో పాటలకు విజిల్స్ పడతాయి అనడంలో అతిశయోక్తి కాదు. నిర్మాణ పరంగా భారీగానే ఖర్చు పెట్టారు . ఎడిటింగ్ టేబుల్ మీద ఇంకా కొంత కటింగ్ చేసి ఉండాల్సింది.
ఫైనల్లీ : డబుల్ ఇస్మార్ట్ మూవీ ఒక మాస్ మసాలా కమర్షియల్ ఫార్మాట్ సినిమా.. జీరో ఎక్స్ పెక్టేషన్స్ తో వెళ్లే మాస్ ఆడియన్స్ కు నచ్చొచ్చు.