ఈటీవీ విన్ ఒరిజినల్ సినిమాలను నిర్మిస్తూ తమ ఓటీటీలో రిలీజ్ చేయడమే కాదు, అంతకుముందే థియేటర్లలో కూడా రిలీజ్ చేస్తూ వస్తున్నారు. గతంలో అలా చేసిన లిటిల్ హార్ట్స్ బాగా వర్కౌట్ అయింది. ఈ నేపధ్యంలోనే రాజు వెడ్స్ రాంబాయి అనే ఒక సినిమాని కూడా థియేటర్‌లో రిలీజ్ చేశారు. వేణు ఊడుగుల దర్శకుడిగా ‘విరాట పర్వం’, ‘నీది నాది ఒకే కథ’ లాంటి సినిమాలు చేసి మంచి పేరు సంపాదించాడు. ఆయన ఈ సినిమాని నిర్మించడంతో ఈ సినిమా మీద ఒక్కసారిగా అందరి దృష్టి పడింది. దానికి తోడు వంశీ నందిపాటి సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తూ ఉండడంతో పాటు సినిమా ప్రమోషనల్ కంటెంట్ కాస్త ఇంట్రెస్టింగ్ గా ఉండడంతో సినిమా మీద ఒక్కసారిగా ఫోకస్ పడింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? అందరి ఫోకస్ పడిన ఈ సినిమా అందరి అంచనాలను అందుకునేలా ఉందా లేదా అనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం.
కథ:
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని తెలంగాణ ప్రాంతంలో జరిగిన నిజమైన కథ ఇది. రాజు (అఖిల్ రాజ్) తన ఊరిలో డప్పు మేస్త్రీగా పనిచేస్తూ ఉంటాడు. ఊరిలో శుభకార్యమైనా, అశుభకార్యమైనా రాజు డప్పు లేనిదే అక్కడ పని నడవదు. అలాంటి రాజు అదే ఊరికి చెందిన కాంపౌండర్ వెంకన్న (చైతన్య జొన్నలగడ్డ) కూతురైన రాంబాయి (తేజస్వి రావు) ను చిన్ననాటి నుంచే ప్రేమిస్తూ ఉంటాడు. కొన్నాళ్ళకు రాంబాయి కూడా రాజుని ఇష్టపడుతుంది. వీరిద్దరి ప్రేమ గురించి తెలిసిన వెంకన్న, గవర్నమెంట్ ఉద్యోగస్తుడైన తాను తన కుమార్తెను గవర్నమెంట్ ఉద్యోగస్తుడికి ఇస్తాను తప్ప గతిలేక డప్పు కొట్టుకునే వాడికి ఇవ్వనని తేల్చి చెబుతాడు. అయితే, ఒకరంటే ఒకరు ప్రాణంగా ప్రేమించుకున్న రాజు, రాంబాయి ఏం చేశారు? వారి ప్రేమ నిలబడిందా లేదా? అసలు రాజు అంటే అసహ్యించుకునే వెంకన్న చివరికి ఏం చేశాడు? రాజు, రాంబాయిల కథ చివరికి ఏమైంది? అనేది ఈ సినిమా కథ.
విశ్లేషణ:
పరువు హత్యలకు కులం లేదు, మతం లేదు, ప్రాంతం అంతకన్నా లేదు. ఇక్కడ కులమతాలు లేదా ఇతర విషయాల కన్నా మనుషుల ఇగోనే ఈ పరువు హత్యకు ప్రధానమైన కారణం అవుతుంది. ఈ నేపథ్యంలోని తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో జరిగిన ఒక నిజమైన కథను సినిమాగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు దర్శకుడు. నిజానికి, సినిమా ప్రారంభమైన తర్వాత ఒక మంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీ చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. చూడ ముచ్చటైన జంట, ఒక ఫ్రెండ్స్ గ్యాంగ్, సరదా సరదాగా సాగిపోయే ప్రేమ సన్నివేశాలు, అక్కడక్కడ మనసుకు హత్తుకునే పాటలతో సినిమా సాగిపోతూ ఉంటుంది.
ఎప్పుడైతే అమ్మాయి ఇంట్లో ప్రేమ గురించి తెలుస్తుందో, ఎప్పటిలాగే రొటీన్ సినిమాల లాగానే ఆ తండ్రి హీరోయిన్ మీద చేయి చేసుకోవడం, ప్రేమ కథకు విలన్‌గా నిలవడం లాంటివి రొటీన్ అనిపిస్తాయి. అయితే, సినిమా ఇంటర్వెల్ బ్లాక్ తర్వాత వేగం మరింత తగ్గుతుంది. ఏంటో సినిమా సాగదీస్తున్న ఫీలింగ్ కూడా కలుగుతుంది. కానీ, సినిమా మొత్తానికి ప్రధానమైన ఆయువు సినిమా క్లైమాక్స్. ఈ విషయాన్ని ముందు నుంచి ప్రమోషనల్ ఇంటర్వ్యూలలో సినిమా టీమ్ చెబుతూనే వచ్చింది. ఈ నేపథ్యంలో సినిమా క్లైమాక్స్ కోసమే సెకండ్ హాఫ్ కాస్త లైట్ రాసుకున్నాడు దర్శకుడు.
ఇక క్లైమాక్స్‌లోకి ఎంటర్ అయిన తర్వాత, ఒక షాకింగ్ క్లైమాక్స్‌తో ప్రేక్షకులు షాక్ అయ్యేలా దర్శకుడు రాసుకున్నాడు. నిజానికి ఇలాంటివి వింటేనే ఒళ్ళు జలదరిస్తుంది. అలాంటిది నిజంగా చూసిన వారందరూ ఎలాంటి షాక్‌కి గురై ఉంటారో ఇప్పుడు అర్థం చేసుకోవచ్చు. నిజానికి సొంత పిల్లలను పరువు హత్య పేరుతో చంపుకుంటున్న తల్లిదండ్రులను చూశాను, కానీ ఈ సినిమాలో చూపించినంత దారుణం నిజంగా ఏ తండ్రి చేయడేమో అనిపిస్తుంది. నిజానికి ఒక ఫీల్ గుడ్ లవ్ స్టోరీకి, షాకింగ్ క్లైమాక్స్‌తో రాసుకున్న షాక్ ఫ్యాక్టర్తో షాక్ కలిగించాడు దర్శకుడు. నిజానికి ఇలాంటి సినిమాని ఒక క్రైమ్ స్టోరీగా కూడా తీయవచ్చు, కానీ హృదయానికి హత్తుకునేలా ఒక మంచి ప్రేమ కథతో చెప్పడం దర్శకుడికే చెల్లింది. నిజానికి దీన్ని ఒక గొప్ప ప్రేమ కథగా చూపించాడు దర్శకుడు. కానీ, ఏ ప్రేమికులకు అంతవరకు వస్తే, మనం శత్రువులుగా భావించే వారికి కూడా ఇలాంటి పరిస్థితి రావద్దు అని సినిమా చూసిన ప్రేక్షకులు ఫీలయ్యేలా తెరమీదకు తీసుకురావడంలో దర్శకుడు చాలావరకు సక్సెస్ అయ్యాడు.
నటీనటులు, సాంకేతిక అంశాలు:
నటీనటుల విషయానికి వస్తే, అఖిల్ రాజ్ రాజు అనే పాత్రలో నటించాడు అనడం కంటే జీవించాడు అని చెప్పొచ్చు. ఒక పల్లెటూరి కుర్రాడిగా, ప్రేమించిన అమ్మాయి కోసం ప్రాణమిచ్చే వాడిగా, ఎక్కడ వంక పెట్టలేని విధంగా ఆకట్టుకున్నాడు. రాంబాయి పాత్రలో తేజస్వి రావు ఒదిగిపోయింది. మేకప్ లేకుండా ఆ పాత్రకు తగ్గట్టుగా ఆమె నటించిన తీరు ప్రశంసనీయం. ఇక ఈ సినిమాలో సర్ప్రైజ్ ఫ్యాక్టర్ ఏదైనా ఉందంటే అది సిద్దు జొన్నలగడ్డ సోదరుడు చైతన్య జొన్నలగడ్డ. ఇప్పటికే నటుడుగా కొన్ని సినిమాల్లో ఆకట్టుకున్న ఆయన, ఈ సినిమాలో మాత్రం టెర్రిఫిక్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. హీరోయిన్ తండ్రి పాత్రలో చూడగానే అసహ్యం కలిగించేలాంటి నటనతో మంచి మార్కులు వేయించుకునే ప్రయత్నం చేశాడు. ఇక శివాజీ రాజా, అనితా చౌదరి వంటి వాళ్లు తమ పాత్రల పరిధి మేరకు ఆకట్టుకున్నారు.
టెక్నికల్ టీమ్ విషయానికి వస్తే, ఈ సినిమాకి దర్శకుడు ఎంతలా ప్రాణం పెట్టి కథ రాసుకున్నాడో, అదేవిధంగా డైలాగ్స్ కూడా ప్రేక్షకులకు దగ్గరగా ఆకట్టుకునేలా రాయడంలో సక్సెస్ అయ్యాడు. ఇక ఈ సినిమాకి కథ హీరో అయితే, టెక్నికల్ టీమ్ విషయానికి వస్తే సంగీత దర్శకుడు. “హీరో, రాంబాయి నీ మీద నాకు మనసయ్యేనే” అంటూ సాగిన ఒక సాంగ్ అయితే ఆబాల గోపాలం హమ్ చేసేలా ఉంది. మిగిలిన సాంగ్స్ పెద్దగా గుర్తుంచుకునేలా లేకపోయినా, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మాత్రం బాగుంది. సినిమాటోగ్రఫీ మాత్రం చాలా కొత్తగా అనిపించింది. పల్లె లొకేషన్స్‌లో చాలా తక్కువ లొకేషన్స్ అయినా సరే, ఏదో మనం అక్కడ ఉండి చూస్తున్న ఫీల్ కలిగించేలా సినిమాటోగ్రఫీ వర్క్ ఉంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.
ఫైనల్లీ:
రాజు వెడ్స్ రాంబాయి – ఫీల్ గుడ్ లవ్ స్టోరీ విత్ షాకింగ్ క్లైమాక్స్.