NTV Telugu Site icon

Jailer Review: జైలర్ సినిమా రివ్యూ

Jailer Movie Review

Jailer Movie Review

Jailer Movie Review: చాలా కాలం నుంచి రజినీకాంత్ సరైన హిట్టు కోసం ఎదురు చూస్తున్నాడు. చివరిగా అన్నాత్తే అంటే తెలుగులో పెద్దన్న అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయన జైలర్ అనే సినిమాతో ఈ గురువారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. తమిళంలో తెరకెక్కిన సినిమాని తెలుగులో కూడా డబ్బింగ్ చేసి రిలీజ్ చేశారు. కన్నడ స్టార్ హీరో శివ రాజ్ కుమార్, మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్, హిందీలో స్టార్ క్రేజ్ ఉన్న జాకీ ష్రాఫ్ తో పాటు మలయాళం లో విలన్ పాత్రలకు పెట్టింది పేరైన వినాయకన్ కీలక పాత్రలలో నటించిన ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచే అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ సినిమాలో రజనీకాంత్ సరసన రమ్యకృష్ణ నటించగా తమన్నా, సునీల్, యోగి బాబు వంటి వారు ఇతర కీలకపాత్రలో నటించారు. జైలర్ సినిమా నుంచి విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సినిమా మీద ఒక్కసారిగా అంచనాలు అమాంతం పెంచేసింది. మరి సినిమా ఎలా ఉంది అనేది రివ్యూలో చదివి తెలుసుకుందాం.

కథ:
గతంలో తీహార్ జైల్లో జైలర్ గా బాధ్యతలు నిర్వర్తించిన టైగర్ ముత్తు వేలు పాండియన్(రజనీకాంత్) రిటైర్మెంట్ అనంతరం కుమారుడి కుటుంబంతో కలిసి గడుపుతూ ఉంటాడు. కుమారుడు అర్జున్(వసంత్ రవి) ఏసీపీ. నీతి నిజాయితీతో ఉండాలని తండ్రి మాటలే పరమావధిగా పనిచేస్తూ ఉంటాడు. అయితే ఒక విగ్రహాల స్మగ్లింగ్ ముఠా హెడ్ వర్మ(వినాయకన్) తో పెట్టుకున్న అర్జున్ అనూహ్య పరిస్థితిల్లో మిస్ అవుతాడు. పోలీసులు అతను చనిపోయాడని కేసు క్లోజ్ చేస్తారు. తన కుమారుడిని ఇంత నిజాయితీగా పెంచడం వల్లే దూరం చేసుకోవాల్సి వచ్చిందని బాధపడిన ముత్తు అసలు తన కుమారుడి చావుకి కారణమైన వారెవరో తెలుసుకుని వారిని అంతమొందించాలని ప్రయత్నం చేస్తాడు. ఈ క్రమంలో తన పాత స్నేహితులైన శివరాజ్ కుమార్, మోహన్ లాల్ ,జాకీ శ్రాఫ్, మకరంద దేశ్ పాండే వంటి వారు ఎలా సహాయపడ్డారు? చివరికి తన కుమారుడిని కాపాడుకోగలిగాడా? లేదా? అనేది ఈ సినిమా కథ.

విశ్లేషణ:
నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ జైలర్ సినిమా కథ కొత్త కథ ఏమీ కాదు. గతంలో మనం చూసిన సినిమాల్లోని కధలను పోలినట్టు అనిపిస్తుంది కానీ ఈ సినిమాని తెరకెక్కించే విషయంలో మాత్రం నెల్సన్ జాగ్రత్తలు తీసుకున్నట్టు అనిపించింది. చివరిగా బీస్ట్ సినిమా చేసిన నెల్సన్ ఆ తర్వాత ఈ సినిమా మీద ఫోకస్ పెట్టాడు. రజనీకాంత్ లాంటి యాక్టర్ దొరికినప్పుడు ఆయన హీరోయిజాన్ని ఎలివేట్ చేసే విషయంలో శ్రద్ధ పెట్టి చేసినట్లుగా అనిపించినా ఎందుకో కథ విషయంలో ఆ శ్రద్ధ పెట్టలేదేమో అనిపించింది. రిటైర్మెంట్ తర్వాత తన పాత జీవితాన్ని వదిలేసి తన మనవడికి సైతం భయపడే వ్యక్తిగా నటించిన రజనీకాంత్ ఆ తర్వాత పరిస్థితుల నేపథ్యంలో ఒక్కసారిగా ఎలా మారిపోయాడు అనే విషయాన్ని నెల్సన్ చాలా చక్కగా తెరమీదకు తీసుకొచ్చి ప్రేక్షకులను కన్విన్స్ చేసే ప్రయత్నం చేశాడు. ఫస్ట్ ఆఫ్ లో యోగి బాబుతో రజినీకాంత్ కాంబినేషన్ సీన్లు బాగా పండాయి.

సైలెంట్ కామెడీతో పొట్ట చెక్కలయ్యేలా చేశారు. అయితే ప్రీ ఇంటర్వెల్ సీన్ మాత్రం ఒక్కసారిగా సినిమా చూస్తున్న ప్రేక్షకుల అందరిలో ఉత్సాహాన్ని నింపేసింది. ఫస్టాఫ్ కొంచెం సాగతీతగా అనిపించినా సెకండ్ హాఫ్ లోకి అడుగుపెట్టిన తర్వాత కథలో వేగం పెరుగుతుంది. స్టోరీ రొటీన్ అనిపించినా సరే అందులో ట్విస్టుల విషయంలో కొంత సస్పెన్స్ మెయింటైన్ చేసి ఉంటే రిజల్ట్ వేరే లెవెల్ లో ఉండేది. సినిమా మొత్తాన్ని రజినీకాంత్ హీరోయిజం, అనిరుద్ రవిచంద్ర బ్యాక్గ్రౌండ్ స్కోర్, యోగిబాబు కామెడీ సీన్లు నడిపించేశాయి. వీటికి నెల్సన్ దిలీప్ కుమార్ కదా కథ కథనాలు కూడా తోడై ఉంటే జైలర్ ఎవరు ఊహించని లెవల్లో దూసుకుపోయేది. క్లైమాక్స్ మాత్రం ఎవరూ ఊహించని విధంగా హార్డ్ హిట్టింగ్ అనిపించింది. ఒకరకంగా చెప్పాలంటే రజిని అభిమానులకైతే ఇది పంచభక్ష పరమాన్నాలతో సిద్ధం చేసిన విందు భోజనం లాంటిది.

ఎవరు ఎలా చేశారు అంటే?
ముందుగా నటీనటుల విషయానికి వస్తే సినిమా మొత్తాన్ని రజనీకాంత్ తన భుజస్కందాల మీద నడిపించినట్లు అనిపించింది. మామూలుగానే రజినీకాంత్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దానికి తోడు ఆయనకు బాగా ఈజ్ అనిపించేలా వయసుకు తగ్గ పాత్ర పడటంతో ఇక ఆయన రెచ్చిపోయి తనలో ఉన్న నటుడిని సంతృప్తపరచుకునేలా నటించాడు. ముఖ్యంగా ప్రీ ఇంటర్వెల్ సీన్ తో పాటు విలన్ కి వార్నింగ్ ఇచ్చే సీన్ అలాగే మరికొన్ని సీన్లలో రజినీకాంత్ యాక్టింగ్ అయితే అబ్బుర పరుస్తుంది. ఇక ఈ సినిమాలో రజనీకాంత్ కుమారుడు పాత్రలో నటించిన వసంత రవి ఆయన భార్య పాత్రలో నటించిన రమ్యకృష్ణ సెటిల్డ్ పెర్ఫార్మన్స్ ఇచ్చారు. రమ్యకృష్ణ నటనకు పెద్దగా అవకాశం లేకపోయినా తన పరిధి మీద ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. ఇక కన్నడ స్టార్ హీరో శివా రాజకుమార్, మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ హిందీ స్టార్ యాక్టర్ జాకీ ష్రాఫ్ వంటి వారు తెర మీద కనిపించింది తక్కువ సమయం అయినా వారు వచ్చినప్పుడు మాత్రం థియేటర్లు ఊగిపోయేలా బ్యాగ్రౌండ్ స్కోర్ తో పాటు ఎలివేషన్స్ ఇచ్చారు.

మొత్తానికి వారందరికీ ఈ సినిమా మంచి ఒక మెమరీ లా ఉండిపోతుంది అని చెప్పొచ్చు. ఇక తెలుగు యాక్టర్ సునీల్ పాత్రకు పెద్దగా స్కోప్ అయితే లేదుm వాడుకునే అవకాశం ఉన్నా ఎందుకో పక్కన పెట్టినట్టు అనిపించింది. యోగిబాబు ఎప్పటిలాగానే నవ్వించాడు. నాగబాబు కూడా ఒకే ఒక సీన్ లో మెరిసేడు. నెల్సన్ దిలీప్ కుమార్ ఇంతమంది స్టార్ హీరోలను సినిమాలో భాగం చేసినప్పుడు కథను ఇంకొంచెం డెప్త్ ఉండేలా రాసుకుని ఉంటే బాగుండేది సినిమా రిజల్ట్ వేరేలా ఉండేదనిపిస్తుంది. ఇక తెలుగులో డైలాగులు బాగున్నాయి. సినిమా మొత్తాన్ని రజనీకాంత్ తో పాటు అనిరుద్ రవిచంద్రన్ తన భుజాల మీద మోసినట్లు అనిపించింది. అనిరుధ్ రవిచందర్ పాటలతో పాటు బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా దుమ్ము దులిపేశాడు. సినిమాటోగ్రఫీ కూడా సినిమాకి మంచి అసెట్ అని చెప్పొచ్చు. నిడివి విషయంలో ఎడిటర్ కాస్త జాగ్రత్త తీసుకుని ఉంటే బాగుండేది.

ఇక ఫైనల్ గా చెప్పాలంటే
జైలర్ రజనీకాంత్ కి ఒక సాలిడ్ కం బ్యాక్.. థియేటర్లలో ఎక్స్పీరియన్స్ చేయాల్సిన సినిమా ఇది.