Prema Desapu Yuvarani Movie Review: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వీరాభిమాని అయిన సాయి సునీల్ నిమ్మల దర్శకత్వంలో ఆనంద్ వేమూరి, హరిప్రసాద్ సిహెచ్ నిర్మించిన ‘ప్రేమదేశపు యువరాణి’ సినిమా పవన్ కళ్యాణ్ పుట్టిన రోజునే రిలీజ్ అయింది. పవన్ కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 2న యామిన్ రాజ్, విరాట్ కార్తిక్, ప్రియాంక రేవ్రి కీలక పాత్రధారులుగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.
ప్రేమదేశపు యువరాణి కథ:
కథ అంతా అమలాపురంలోనే సాగుతుంది. అక్కడ వీరయ్య(సందీప్) అనే రౌడీ షీటర్ ప్రజలను ఇబ్బంది పెడుతూ మర్డర్లు, మానభంగాలు చేస్తూ అడ్డే లేదు అన్నట్టుగా రెచ్చిపోతూ ఉంటాడు. అదే ఊర్లో బి.టెక్ పూర్తి చేయలేక బ్యాక్ లాగ్స్ తో తిరుగుతున్న చెర్రీ(యామిన్ రాజ్) శ్రావణి(ప్రియాంక రేవ్రి)ని చూసిన మొదటి చూపులోనే ప్రేమలో పడతాడు. ఆమే ప్రేమదేశపు యువరాణి అని ఫిక్స్ అవుతాడు. ఉద్యోగ రీత్యా శ్రావణి కుటుంబం అమలాపురం వచ్చిందని, తమ తండ్రులు ఇద్దరూ చిన్ననాటి ఫ్రెండ్స్ అని తెలుస్తుంది. ఆ తరువాత శ్రావణితో మాటలు కలుపడంతో ఆ పరిచయం ప్రేమగా మారుతుంది. పెళ్లి చేసుకోమని బలవంతం చేస్తే రవి (విరాట్ కార్తిక్)ను ఇష్టపడ్డానని చెప్పడంతో షాక్ అయి ఆమె ప్రేమను దక్కించు కోవడానికి ఒక కీలక నిర్ణయం తీసుకున్నాడు. మరోపక్క వీరయ్య మనుషులు వరుసగా చనిపోతూ ఉంటారు. వీరయ్య మనుషులు చావడానికి ఒక భద్రకాళిగా మారిన ఒక అమ్మాయి కారణమని తెలిసి అందరూ షాక్ అవుతారు. ఈ క్రమంలో వీరయ్య, కొడుకు భైరవ్ లు కూడా హత్యకి గురవుతారు. ఈ హత్యలు అన్నీ ఎవరు చేశారు? ఎందుకు చేశారు? శ్రావణి ప్రేమించిన రవి ఎవరు? చెర్రీతో ప్రేమలో పడ్డా శ్రావణి ఎందుకు దూరంగా ఉంది? సివిల్స్ కు ప్రిపేర్ అవుతున్న శ్రావణి కలెక్టర్ అయిందా? శ్రావణి చెర్రీని పెళ్లాడిందా? లేక రవిని పెళ్లాడిందా? అనే వివరాలు తెలియాలంటే “ప్రేమదేశపు యువరాణి” సినిమాను తెరపై చూడాల్సిందే…
విశ్లేషణ:
ట్రయాంగిల్ లవ్ స్టోరీలు మన తెలుగు సినీ పరిశ్రమకు కొత్త ఏమీ కాదు.. ఇప్పటికే మనం అనేక రకాల ట్రయాంగిల్ లవ్ స్టోరీ సినిమాలు చూశాను కానీ ఈ ప్రేమ దేశపు యువరాణి అనే సినిమాతో ఒక కొత్త ట్రయాంగిల్ లవ్ స్టోరీని తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసే ప్రయత్నం చేశాడు సాయి సునీల్ నిమ్మల. ఎమోషనల్‌గా బాండింగ్ ఉన్న సబ్జెక్ ను ఫీల్‌గుడ్ లవ్‌స్టోరీలా ఆసక్తికర సన్నివేశాలతో చక్కని కథను రాసుకొని ఎటువంటి డబుల్ మీనింగ్ జోకులు, అనవసరపు కామెడీ లేకుండా సహజంగా ఆకట్టుకునే విధంగా తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేశాడు. కొన్నిచోట్ల తడబడినట్లు అనిపించినా పూర్తిస్థాయిలో తెలుగు ప్రేక్షకులకు ఒక కొత్త అనుభూతి అందించే ప్రయత్నం చేసి కొంత వరకు సక్సెస్ అయ్యాడు కూడా. కథగా చూస్తే చిన్న చిన్న లోపాలు ఉంటాయి కానీ ఓవరాల్ గా చూస్తే మాత్రం ఆకట్టుకునే విధంగా సస్పెన్స్ తో కూడిన లవ్ స్టోరీని తెలుగు ప్రేక్షకులను అలరించే విధంగా తెరకెక్కించే ప్రయత్నం చేశాడు.
ఎవరెలా చేశారంటే?
చెర్రీ పాత్రలో నటించిన యామిన్ రాజ్ కి నటనకు స్కోప్ దక్కింది..సూపర్ ఎక్స్ ప్రేషన్స్ తో పాటు, మాటలు,పాటలు, ఫైట్స్, ఎమోషన్స్ తో తనను తాము మంచి నటుడుగా ప్రూవ్ చేసుకున్నాడు. హీరోయిన్ ప్రియాంక రేవ్రి తన పాత్రలో ఒదిగి పోయింది. రవి పాత్రలో విరాట్ కార్తిక్ కూడా ఆకట్టుకున్నాడు. పోలీస్ ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ పాత్రలో శంకర్ గా నటించిన రాజారెడ్డి నటన ఈ సినిమాకి హైలెట, క్రైమ్‌ను సాల్వ్ చేసే విషయంలో పోలీసుల ఇన్వేస్టిగేషన్, వారి ఆలోచన తీరు, వారు వేసే ఎత్తులు, ఎలా ఉంటాయనే సన్నివేశాల్లో సహజమైన నటనతో ఆకట్టుకుని ఆ పాత్రలో ఒదిగిపోయాడు. వీరయ్య పాత్రలో సందీప్ క్రూరమైన విలన్ గా టెరిఫిక్ పెర్ఫార్మన్స్ ఇవ్వడం గమనార్హం. విలన్ వీరయ్యగా సందీప్, పోలీస్ ఆఫీసర్ శంకర్ గా రాజారెడ్డిలకు ఇది మొదటి సినిమా అయినా ఎక్కడా అలా అనిపించకుండా ఎంతో అనుభవం ఉన్న యాక్టర్స్ లా కథను తన బుజాలపై వేసుకొని చాలా చక్కగా నడిపించారు. హీరో ఫ్రెండ్స్ గా నటించిన మెహబూబ్ బాషా, బండ సాయి, బక్క సాయి నటన, కామెడీ బాగా వర్కౌట్ అయింది. వీరయ్య పాత్రలో క్రూరమైన విలన్ గా ఒదిగిపోయాడు. భైరవ్ పాత్రలో పవన్, హీరో తల్లి తండ్రులుగా హరికృష్ణ, సునీత మనోహర్, యోగి కద్రి, రఘు, ముత్యాల, స్రవంతి, ప్రత్యూష, గోపీ నాయుడు వంటివారు తమ పారిధి మేరకు నటించి ప్రేక్షకులను మెప్పించారు. సాంకేతిక నిపుణుల పనితీరు విషయానికి వస్తే డైరెక్టర్ సాయి సునీల్ నిమ్మల డైరెక్ట్ చేసిన మొదటి సినిమా అయినప్పటికీ ఆద్యంతం ప్రేక్షకులు సస్పెన్స్ కు గురయ్యేలా కథ, స్క్రీన్ ప్లేతో ఆకట్టుకునేలా తెరకెక్కించే ప్రయత్నం చేసి దాదాపుగా సఫలం అయ్యాడు. అదే విధంగా కథకు తగ్గ నటీనటులను ఎంపిక చేసుకోవడంలో కూడా దర్శకుడు సాయి సునీల్ నిమ్మల సక్సెస్ అయ్యాడు. అజయ్ పట్నాయక్ సంగీతం బాగుంది. పాటలు కొన్ని క్యాచీగా ఉన్నాయి బాగున్నాయి. ముఖ్యంగా ఆర్పీ పట్నాయక్, సునీతలు పాడిన సాంగ్ సూపర్ గా ఉంది. అదే సమయంలో శివకుమార్ దేవరకొండ సినిమాటోగ్రఫీ సినిమాకి బాగా ప్లస్ అయ్యింది. ఎం.ఆర్. వర్మ ఎడిటింగ్ క్రిస్పీగా ఉంది. నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి.
ఫైనల్గా చెప్పాలంటే ‘ప్రేమదేశపు యువరాణి’ ఒక ఇంట్రెస్టింగ్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ.