NTV Telugu Site icon

Bagheera Movie Review: బఘీర రివ్యూ ..ప్రశాంత్ నీల్ కథ ఎలా ఉంది?

Bagheera Review

Bagheera Review

ప్రశాంత్ నీల్ తొలి సినిమా ఉగ్రం సినిమా హీరో శ్రీ మురళి హీరోగా తాజాగా ఒక సినిమా తెరకెక్కింది. భఘీర పేరుతో ఈ సినిమాని కన్నడతో పాటు తెలుగులో కూడా రిలీజ్ చేశారు. ఈ సినిమాకి ప్రశాంత్ నీల్ కథ అందించగా గతంలో ఆయన వద్ద సహాయకుడిగా పనిచేసిన డాక్టర్ సూరి ఈ సినిమాతో డైరెక్టర్ గా పరిచయం అవుతున్నారు. టీజర్, ట్రైలర్ కట్స్ బాగుండడంతో సినిమా మీద అంచనాలు ఏర్పడ్డాయి. దానికి తోడు ప్రశాంత్ నీల్ బ్రాండింగ్ ఉండడంతో సినిమా ఎలా ఉండబోతుంది? అని అందరిలోనూ ఒక రకమైన ఆసక్తి ఏర్పడింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంది? అనేది రివ్యూలో చూద్దాం.

భఘీర కథ: వేదాంత్ (శ్రీ మురళి)కి చిన్నప్పటి నుంచి సూపర్ హీరోలు అంటే మంచి క్రేజ్ ఉండేది. సూపర్ హీరోలకు పవర్ ఉంది కాబట్టి వాళ్లు జనాన్ని కాపాడుతున్నారు కానీ ఏ పవర్ లేకపోయినా పోలీసులు కూడా జనాన్ని కాపాడుతున్నారని తల్లి చెప్పడంతో వేదాంత కష్టపడి చదివి ఐపీఎస్ ఆఫీసర్ అవుతాడు. సొంత ఊరిలోనే పోస్టింగ్ వస్తుంది, ఆ పోస్టింగ్ వచ్చాక కొన్నాళ్లపాటు నిజాయితీగల అధికారిగా తాను చేయాలనుకున్నది చేస్తే పైనుంచి ప్రజర్ వస్తుంది. దీంతో లంచగొండి అధికారిగా అవతారం ఎత్తి తాను పోలీసుగా చేయలేని పనిని భఘీర మాస్క్ వేసుకుని వెళ్లి చేసి వస్తూ ఉంటాడు. అలా భఘీరకి జనాల్లో మంచి క్రేజ్ వస్తుంది. ఆ ఏరియా మొత్తాన్ని పట్టిపీడిస్తున్న రానా( గరుడ రామ్) అన్ని వ్యాపారాలకు భఘీర అడ్డొస్తాడు. దీంతో భఘీరని అడ్డు తొలగించేందుకు రానా చేయని ప్రయత్నం అంటూ ఉండదు. మరొక పక్క ఒక ఉన్నతాధికారి కుమారుడైన పోలీస్ ఆఫీసర్ చనిపోవడంతో ఆ ఉన్నతాధికారి ఒత్తిడి మేరకు సీబీఐ(ప్రకాష్ రాజ్) రంగంలోకి దిగుతుంది. చివరికి సిబిఐ వేదాంత్, భఘీర అని కనిపెట్టిందా? చివరికి భఘీరను సీబీఐ పట్టుకోగలిగిందా? అసలు ఏమైంది? లాంటి విషయాలు బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే.

విశ్లేషణ 

ఒక నిజాయితీ గల పోలీసు అధికారి ముందు నిజాయితీగా పనిచేస్తూ సిస్టం చేత మొట్టికాయలు తిని లంచగొండి అవతారం ఎత్తడం, ఆ లంచగొండిగా కనిపిస్తూనే చేయాల్సిన పనులు లంచగొండి ముసుగులో చేసేయడం ఎన్నో సినిమాల్లో చూశాం. ఈ సినిమా కూడా దాదాపుగా అదే టెంప్లేట్లో తెరకెక్కింది. సినిమా మొదట్లోనే చిన్నారి శ్రీమురళికి తాను సూపర్ మేన్ అవ్వాలని కోరిక కలిగితే సూపర్ మాన్ లేదా ఇతర మ్యాన్స్ అసలు ఉద్దేశం ఆపదలో ఉన్న వాళ్ళని రక్షించడమే అలా రక్షించే వారిలో పోలీసులు కూడా ముందు వరసలో ఉంటారని తల్లి చెప్పడంతో పోలీసు అధికార అవుతాడు. పోలీసు అధికారి అయిన తర్వాత కూడా జనాన్ని రక్షించలేకపోయిన నేపథ్యంలో పోలీసుగా చేయలేని పని సూపర్ హీరోగా చేయవచ్చని భావిస్తాడు. అలా సూపర్ హీరో అవతారమెత్తి ఒక్కొక్కరికి కష్టం తీరుస్తూ ఒక్కొక్కరి ఇబ్బంది క్లియర్ చేస్తూ వాళ్ళని ఇబ్బంది పెట్టిన వాళ్లను పైకి పంపిస్తూ సాగుతాడు. అయితే సిబిఐ ఆఫీసర్గా ప్రకాష్ రాజ్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత కథలో వేగం పెరుగుతుంది. అసలు ఈ భఘీర ఎవరు అని తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ప్రకాష్ రాజ్ పడే తిప్పలు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసేలా ఉన్నాయి. అయితే కథ రొటీన్ అయినా కథనంతో మెస్మరైజ్ చేసే ప్రయత్నం చేశారు. కానీ అది ఏమాత్రం సఫలం కాలేదు కాబట్టి గతంలో చూసిన ఎన్నో సినిమాలనే మరోసారి శ్రీ మురళి హీరోగా చూస్తున్నట్లు ఫీలింగ్ కలిగితే అది మీ పొరపాటు కాదు. అయితే సినిమాలో చెప్పుకోదగ్గవి యాక్షన్ బ్లాక్ అలాగే టెక్నికల్ వాల్యూస్. ముఖ్యంగా నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. కానీ కంప్యూటర్ గ్రాఫిక్స్ విషయంలో శ్రద్ధ తీసుకుని ఉండాల్సింది.

నటీనటుల విషయానికి వస్తే వేదాంత్ అనే ఒక ఐపీఎస్ అధికారి పాత్రలో శ్రీ మురళి ఒదిగిపోయాడు. నిజానికి కన్నడలో శ్రీ మురళి ఒకరకంగా స్టార్ హీరో. ఎన్నో కమర్షియల్ హిట్లు ఆయన ఖాతాలో ఉన్నాయి. ఇక ఈ సినిమాలో వేదాంత్ పాత్రతో పాటు భగీర అనే పాత్రలో ఒకరకంగా రెండు షేడ్స్ లో నటిస్తూ ఆకట్టుకున్నాడు. నిజానికి యాక్షన్ బ్లాక్స్ లో అలాగే ఎలివేషన్స్ షాట్స్ లో ఆయన ప్రజన్స్ భలే ఉంది. ఆయన అభిమానులను మాత్రం ఒక రేంజ్ లో ఆకట్టుకుంటుంది. రుక్మిణి వసంత్ పాత్ర చాలా పరిమితమే కానీ ఉన్నంతలో మెప్పించింది. ఇక ప్రకాష్ రాజ్, అచ్యుత్ కుమార్, గరుడ రామ్, రంగనాయనా వంటివాళ్లు స్క్రీన్ మీద చేసిన మ్యాజిక్ బలే అనిపిస్తుంది. ఇక టెక్నికల్ వాల్యూస్ విషయానికి వస్తే కథ రొటీన్ కావడంతో సినిమాని ఎలివేట్ చేసే విషయంలో పెద్దగా ఉపయోగపడలేదు. సినిమా మొత్తం మీద ఎక్కడా కొత్తదనం ఫీలింగ్ రాలేదు. ఎందుకంటే ఏ సీన్ చూసిన ఎక్కడో చూసానే అనే ఫీలింగ్ కలుగుతుంది. అయితే యాక్షన్ సీక్వెన్స్ విషయంలో మాత్రం స్పెషల్ కేర్ తీసుకున్నట్టు ఉన్నారు. ఇక సంగీతం అందించిన అజనీష్ లోకనాథ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకి తగ్గట్టుగా ఉంది. సినిమాటోగ్రఫీ మాత్రం కరెక్ట్ గా సెట్ అయింది. యాక్షన్ సీక్వెన్స్లను భలే స్టైలిష్ గా తెరకెక్కించారు. అయితే ఎడిటింగ్ ఫార్మాట్ చూస్తే అది ఎందుకు కేజీఎఫ్ లాగానే అనిపిస్తుంది. సినిమా ప్రొడక్షన్ వాల్యూస్ మాత్రం బాగా ఖర్చుపెట్టినట్టే కనిపిస్తోంది.

ఫైనల్ గా భగీర యాక్షన్ లవర్స్ కు మాత్రమే.. మిగతా వాళ్లకు కండిషన్స్ అప్లై.