NTV Telugu Site icon

Pindam Movie Review : పిండం రివ్యూ

New Project 2023 12 15t103757.879

New Project 2023 12 15t103757.879

చాన్నాళ్ళ నుంచి తెలుగు ప్రేక్షకులకు పరిచయం ఉన్న శ్రీరామ్ హీరోగా పిండం అనే సినిమా తెరకెక్కింది. పూర్తిస్థాయి హారర్ థ్రిల్లర్ గా ముందు నుంచి ప్రచారం చేస్తూ వచ్చిన ఈ సినిమా మీద ప్రేక్షకులలో ఆసక్తి ఏర్పడింది. ఆ ఆసక్తిని మరింత పెంచే విధంగా సినిమా టీజర్, ట్రైలర్ ఉండడంతో కచ్చితంగా సినిమాలో ఏదో ఉంది అని అందరూ భావించారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ఈ శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. కొత్త దర్శకుడు, కొత్త నిర్మాత నిర్మించిన ఈ సినిమా ఎలా ఉంది అనేది ఇప్పుడు మనం రివ్యూలో చూసి తెలుసుకుందాం.

పిండం కథ:
ఆత్మలు పట్టిపీడిస్తున్న వారి నుంచి ఆత్మలను తరిమేసే వ్యక్తిగా అన్నమ్మ (ఈశ్వరి రావు)ది అందె వేసిన చేయి. ఓపెనింగ్ లోనే ఒక కుక్క ఆమె కారు డోరు దిగకుండా తన తల అదే కారు డోర్ కి కొట్టుకుని చనిపోతుంది. ఇంతలో లోకనాథ్ (అవసరాల శ్రీనివాస్) తాను ఒక రీసెర్చ్ పేపర్ కోసం అన్నమ్మతో కొన్ని రోజులు ట్రావెల్ చేయాలనుకుంటున్నానని చెప్పి ఆమెతో పాటు పలు కేస్ స్టడీ లకు వెళుతూ ఉంటాడు. ఒకరోజు ఆమె జీవితంలో అసలు చేయలేనేమో అని భావించిన ఒక కేసు గురించి చెప్పమంటే అదే శుక్లాపేటలో జరిగిన ఆంటోనీ(శ్రీ రామ్) కుటుంబం కథ చెబుతుంది అన్నమ్మ. అదే ఊరిలో రైస్ మిల్ అకౌంటెంట్గా ఉద్యోగంలో చేరిన ఆంటోనీ తన భార్య మేరీ(ఖుషీ రవి), తల్లి సూరముతో పాటుగా తన ఇద్దరు కుమార్తెలు సోఫియా, తారతో కలిసి ఒక పాత భవంతిని కొనుగోలు చేస్తాడు. అయితే ఆ భవంతిలో కొన్ని దుష్టశక్తులు ఉండడంతో సూరమ్మ మరణిస్తుంది. దీంతో ఆంటోనీ కుటుంబం అన్నమ్మను ఆశ్రయిస్తారు. మరి ఆంటోనీ కుటుంబాన్ని అన్నమ్మ దుష్టశక్తుల నుంచి కాపాడిందా? లేదా ఆ దుష్ట శక్తులు ఎందుకు ఆంటోనీ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టాయి? చివరికి ఏం జరిగింది? అసలు లోకనాథ్ అన్నమ్మను వెతుక్కుంటూ ఎందుకు వచ్చాడు? లాంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ
సాధారణంగా తెలుగు ప్రేక్షకులకు ఈ హారర్ అనేది చాలా ఇష్టమైన జానర్. అందులో భాగంగా వచ్చిన ఎన్నో సినిమాలు హిట్లుగా నిలిచాయి, కొన్నింటిని సూపర్ హిట్లుగా కూడా చేశారు మనవాళ్లు. ఇప్పుడు అలాంటి జానర్లోనే ఈ పిండం సినిమా వచ్చింది. వాస్తవానికి ఈ సినిమా మొదలైనప్పటి నుంచి వేరే లోకానికి తీసుకువెళ్లే ప్రయత్నం చేశాడు దర్శకుడు. దర్శకుడికి ఇది మొదటి సినిమా అని ఏ మాత్రం అనుమానం రాకుండా కథ చెప్పే విధానం ఆకట్టుకుంది. స్క్రీన్ ప్లే విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు కానీ కథలో బలం మిస్ అయిన క్రమంలో అది తేలిపోయినట్టు అనిపించింది. నిజానికి ఏడాది మొత్తానికి ఇదే భయంకరమైన తెలుగు సినిమా అన్నట్టుగా ముందు నుంచి ప్రచారం చేస్తూ వచ్చింది సినిమా యూనిట్. అంతేకాక పిల్లలు, గర్భిణీ స్త్రీలు ఈ సినిమాకి రావద్దని ప్రచారం చేయడంతో భయంకరమైన సినిమా ఏమో అనే భావన అందరికీ కలుగుతుంది. అయితే సినిమా చూసిన తర్వాత ఎందుకో కాస్త ఓవర్ హైప్ ఇచ్చారేమో అనిపిస్తుంది. ఆ హైప్ లేకుండా థియేటర్ కి వచ్చి ఉంటే కనుక కచ్చితంగా సినిమా దాదాపుగా అందరికీ నచ్చి ఉండేది. కథగా చూసుకుంటే ఇది కొత్త కథ ఏమీ కాదు, ఆత్మతో పీడించబడుతున్న ఒక కుటుంబాన్ని ఒక మంత్రగాడు లేదా మంత్రగత్తే వచ్చి ఎలా కాపాడుతుంది? అనే విషయం మనం ఎన్నో సినిమాలలో చూసాం, ఈ సినిమాలో కూడా అదే విషయాన్ని రిపీట్ చేశారు మేకర్లు. అయితే ఇక్కడ ఆత్మలను వదిలించడానికి మనం గతంలో చూసిన సినిమాల్లో విధానాల కంటే కాస్త భిన్నంగా చూపించే ప్రయత్నం చేశారు. పుట్టకుండానే చనిపోయిన పిండం ఆత్మగా మారినట్టు గతంలో కొన్ని సినిమాల్లో చూపించారు. ఈ సినిమాలో కూడా అదే విషయాన్ని టచ్ చేశారు కానీ క్లైమాక్స్ విషయంలో కాస్త కేర్ తీసుకుని ఉంటే బాగుండేది. ప్రేక్షకుడు ఇంకేదో అద్భుతం జరుగుతుందని భావిస్తూ ఉన్న సమయంలో సడన్గా ఆత్మ వదిలేసినట్టు అంతా సెట్ అయిపోయినట్లు చూపించి, అప్పటివరకు మైంటైన్ చేసిన సస్పెన్స్ మొత్తాన్ని నీరు కార్చేసిన ఫీలింగ్ కలిగింది. సినిమా ఫస్ట్ ఆఫ్ అంతా భయం భయంగా సినిమా మీద ఆసక్తి పెంచే ప్రయత్నం చేయగా ఎప్పుడైతే ఫ్లాష్ బ్యాక్ రివీల్ చేస్తూ రావాల్సి వచ్చిందో అప్పుడు సినిమా మీద ఆసక్తి తగ్గుతూ వస్తుంది. అంతేగాక సెకండ్ హాఫ్ ఎందుకో లాగ్ చేసిన ఫీలింగ్ కూడా కలుగుతుంది. సెకండ్ హాఫ్ ఫ్లాష్ బ్యాక్ మీద మరింత వర్క్ చేసి సినిమా కనుక ప్రేక్షకల ముందుకు తీసుకొచ్చి ఉంటే రిజల్ట్ వేరే లెవెల్ లో ఉండేది అనడంలో ఎలాంటి సందేహం లేదు.

ఇక నటీనటుల విషయానికి వస్తే ప్రధాన పాత్రలో నటించిన శ్రీరామ్ ఎందుకో తేలిపోయినట్లు అనిపించింది. బహుశా ఆయన్ని మనం చాలా ఏళ్లుగా చూస్తున్న ప్రభావమో ఏమో తెలియదు కానీ హారర్ సీన్స్ లో కూడా ఆయన భయపడినట్లు అనిపించలేదు. ఇక హీరోయిన్గా నటించిన ఖుషీ రవి ఆకట్టుకుంది. వారి పిల్లలుగా నటించిన ఇద్దరు చిన్నారులు నటన విషయంలో తల్లిదండ్రుల పాత్రధారులు ఇద్దరినీ డామినేట్ చేశారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ఈశ్వరి రావు తన అనుభవాన్ని చూపించింది, కానీ ఆమె ఆహార్యం విషయంలో ప్రస్తుతానికి గతానికి కొంచెం తేడా చూపించే క్రమంలో కేర్ తీసుకుని ఉంటే బాగుండేది. లోకనాథ్ అనే పాత్రలో నటించిన అవసరాల శ్రీనివాస్ కనిపించేది కొన్ని సీన్స్ లోనే అయినా పర్వాలేదనిపించాడు. ఇక మిగతా పాత్రధారులు అందరూ తమ తమ పాత్రల పరిధి మేరకు ఆకట్టుకునేలా నటించారు. టెక్నికల్ విషయానికి వస్తే సినిమా పీరియాడిక్ సినిమా కాబట్టి ఆర్ట్ డిపార్ట్మెంట్ ఇంకా జాగ్రత్తలు తీసుకుని ఉంటే బాగుండేది. దర్శకుడికి ఇది కొత్త సినిమా అని అనిపించలేదు ఎందుకంటే ఎంతో అనుభవం ఉన్న వ్యక్తి లాగా సినిమాని డీల్ చేశాడు. అయితే కథనం విషయంలో మరింత కేర్ తీసుకుని కాస్టింగ్ లో కూడా స్టార్స్ ని పెట్టుకుని ఉంటే సినిమా రిజల్ట్ కచ్చితంగా వేరేలా ఉండేది. ఇక బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమా మొత్తానికి ప్రధానమైన ఆకర్షణ, సినిమాటోగ్రఫీ సినిమాని మరో స్థాయికి తీసుకువెళ్ళింది. ఎడిటింగ్ పరవాలేదు కానీ స్క్రీన్ ప్లే విషయంలోనే కొంచెం సామాన్యుడు అర్థం చేసుకునే విధంగా కట్ చేసి ఉంటే బాగుండేది.

ఫైనల్లీ: చిన్న చిన్న లోపాలు ఉన్నా ఖచ్చితంగా ధియేటర్ లోనే ఎక్స్పీరియన్స్ చేయాల్సిన మూవీ పిండం.