గత సంవత్సరం ‘ఆరడగుల బుల్లెట్’ తో చివరిసారి ప్రేక్షకుల ముందు నిలచిన హీరో గోపీచంద్ ఈ సారి ‘పక్కా కమర్షియల్’ అంటూ వచ్చాడు. జిల్, ఆక్సిజన్ చిత్రాలలో గోపీతో జోడీగా నటించిన రాశీ ఖన్నా ముచ్చటగా మూడోసారి అతని సరసన నటించింది. కుటుంబ కథా చిత్రాలకు హాస్యాన్ని రంగరించి తెరకెక్కించడంలో పేరొందిన మారుతి ‘పక్కా కమర్షియల్’కు దర్శకత్వం వహించారు. చాలా రోజుల తరువాత వచ్చిన గోపీచంద్ చిత్రం, అందునా గీతా ఆర్ట్స్ బ్యానర్ పై రూపొందటంతో మొదటి నుంచి ‘పక్కా కమర్షియల్’పై అంచనాలు బాగా ఉన్నాయి. మరి ఆ అంచనాలను ఈ సినిమా ఎంత వరకూ అందుకుందో చూద్దాం.
‘పక్కా కమర్షియల్’ కథ విషయానికి వస్తే- రావు రమేష్ ఓ అమ్మాయిని హెరాజ్మెంట్ చేస్తాడు. ఆ అమ్మాయి కోర్టుకు వెళ్తుంది. సాక్ష్యాలు మాత్రమే నమ్మే కోర్టులో ఆమెకు వ్యతిరేకంగా తీర్పు వస్తుంది. జడ్జి సత్యరాజ్ కు న్యాయం ఏమిటో తెలిసినా, సాక్ష్యాలను బట్టి ఆమెకు వ్యతిరేకంగా తీర్పు నిస్తాడు. ఆపై ఓ మనిషిగా వెళ్ళి ఆమెకు న్యాయం చేయాలనుకున్నా కోర్టులో న్యాయం చేయలేపుడు నల్లకోటును వదియండి అదే తనకు న్యాయం చేసినట్టు అని ఆత్మహత్య చేసుకుంటుంది. దాంతో సత్యరాజ్ జడ్జి వృత్తిని వదిలేసి కిరాణా కొట్టు పెట్టుకుంటాడు. అతని కొడుకు గోపీచంద్. తండ్రిలా తను కాకూడదని లాయర్ వృత్తినే ఎంచుకుని పక్కా కమర్షియల్ గా మారతాడు. ఇక అటువైపు రావు రమేశ్ పెద్ద బిల్డర్ గా మారి కోటీశ్వరుడైపోతాడు. గోపీచంద్ డబ్బు కోసం తిమ్మిని బమ్మి చేస్తూ అన్యాయాన్ని గెలిపిస్తూ ‘పక్కా కమర్షియల్’ లాయర్ అని పేరు తెచ్చుకుంటాడు. ఇదిలా ఉంటే ఓ సీరియల్ లో సుదీర్ఘకాలం న్యాయవాది పాత్ర పోషించి పేరు తెచ్చుకున్న నటి ఝాన్సీ (రాశీ ఖన్నా) క్రేజ్ పెరగడంతో పారితోషికం పెంచుతుంది. దాంతో సీరియల్ దర్శకనిర్మాతలు ఆమె కేరెక్టర్ ను చంపేస్తారు. దీనిపై ఝాన్సీ కోర్టుకు వెళ్ళాలని గోపీచంద్ ను ఆశ్రయిస్తుంది. లాయర్ పాత్రలో జీవించిన ఝాన్సీకి ఐపీసీ లోని సెక్షన్స్ అన్నీ కంఠతా వచ్చి ఉంటాయి. అదిచూసిన గోపీచంద్ తన కేసును తనే వాదించుకోమని సలహా ఇస్తాడు. అదే చేసి ఓడిపోయిన ఝాన్సీకి శిక్షగా ఏ లాయర్ వద్దనైనా అసిస్టెంట్ గా ఉండి అబ్జర్వ్ చేయాలని కోర్టు తీర్పు ఇస్తుంది. దాంతో గోపీచంద్ అసిస్టెంట్ గా చేరాలని వెంటపడుతుంది. రావు రమేశ్ తనకు ఎదురు తిరిగిన వారిని హత్యలు చేస్తూ అణచివేస్తుంటాడు. ఈ విషయంలో తను కోర్టుకు రావలసి వస్తుంది. అతని పక్షాన కేసును గోపీచంద్ వాదిస్తాడు. కొడుకు పక్కా కమర్షియల్ గా మారి రావు రమేశ్ పక్షాన చేరటంతో ఎప్పుడో వదిలేసిన నల్లకోటు ధరించి మళ్ళీ కోర్టు మెట్లెక్కుతాడు సత్యరాజ్. తండ్రీకొడుకుల మధ్య కోర్టు డ్రామా సాగుతుంది. అందులో పక్కా కమర్షియల్ అయిన గోపీచంద్ రమేశ్ కు శిక్ష పడకుండా చేస్తాడు. రావు రమేశ్ కోర్టులో గెలవడం, ఆ తరువాత ఎమ్మెల్సీగా అవకాశం రావడం జరుగుతాయి. అతను ఎమ్మెల్సీగా ప్రమాణం చేస్తున్న సమయంలోనే అతని ఇంటిలో శవం దొరకడంతో కటకటాలు లెక్క పెట్టవలసి వస్తుంది. అప్పుడు గోపీచంద్ పక్కా కమర్షియల్ గా ఎందుకు మారవలసి వస్తుందో సవివరంగా మరో లాయర్ వరలక్ష్మి శరత్ కుమార్ తో చెప్పించటంతో కథ కంచికి మనం ఇంటికి…
ఓ వ్యక్తిపై పగ తీర్చుకోవడానికి హీరో పక్కా కమర్షియల్ గా మారి అన్యాయానికి కొమ్ము కాయడమే ఆశ్చర్యం కలిగిస్తుంది. ఈ నేపథ్యంలో ఎన్నో అనవసరమైన అంశాలలు వచ్చి వెళుతుండటంతో సాగదీసినట్టు అనిపిస్తుంది. గోపీచంద్ తన పాత్రలో కొత్తగా కనిపించారు. గతంలో ముద్దుగా బొద్దుగా కనిపించిన రాశీఖన్నా ఇందులో నాజూగ్గా లాయర్ ఝాన్సీగా ఆకట్టుకుంది. సత్యరాజ్, రావు రమేశ్ కు ఇలాంటి పాత్రలు కొట్టిన పిండే. ఇంతకు ముందు తన ‘ప్రతిరోజూ పండగే’లో సత్యరాజ్ కు మంచి పాత్రను ఇచ్చిన దర్శకుడు మారుతి ఇందులోనూ అదే పని చేశారు. నేపథ్య సంగీతం బాగుంది. పాటల్లో ‘అందాల రాశీ…’ అంటూ సాగే పాట మురిపిస్తుంది. ఇక కెరీర్ ఆరంభంలో తన సినిమాల్లో డబుల్ మీనింగ్ డైలాగ్స్ చొప్పించిన దర్శకుడు మారుతి ఈ సినిమాలోనూ అదే పని చేశారు. అవి కొంత ఇబ్బందికరంగా అనిపిస్తాయి. ఏది ఏమైనా జిఎ2 పిక్చర్స్ లో వచ్చిన అనేక హిట్ సినిమాల స్థాయిలో ‘పక్కా కమర్షియల్’ ఏమాత్రం లేదనే చెప్పాలి.
ప్లస్ పాయింట్స్:
నిర్మాణ విలువలు
రాశీ ఖన్నా పాత్ర
కొన్ని హాస్య సన్నివేశాలు
నేపథ్య సంగీతం
మైనస్ పాయింట్స్:
కథలో సత్తా లేకపోవడం
డబుల్ మీనింగ్ డైలాగులు
బోరు కొట్టే ద్వితీయార్ధం
రేటింగ్: 2.5/5
ట్యాగ్ లైన్: కొంచెం… హిలేరియస్!