క్రేజీ స్టార్ విజయ్ దేవరకొండ పాన్ ఇండియా మూవీ ఆగస్ట్ 25న వరల్డ్ వైడ్ రిలీజ్ కాబోతుంటే… అతని తమ్ముడు ఆనంద్ మూవీ ‘హైవే’ అందుకు ఆరు రోజుల ముందు ఆహాలో స్ట్రీమింగ్ అయ్యింది. ‘దొరసాని’తో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఆనంద్ దేవరకొండ స్లో అండ్ స్టడీ తరహాలో ముందుకు సాగుతున్నాడు. ‘118’తో ఫస్ట్ టైమ్ తెలుగులో డైరెక్టర్ గా మారిన పాపులర్ సినిమాటోగ్రాఫర్ కె.వి. గుహాన్… ‘హైవే’ మూవీని రూపొందించాడు. మలయాళీ ముద్దుగుమ్మ మానసా రాధాకృష్ణన్ తో పాటు, బాలీవుడ్ నటుడు అభిషేక్ బెనర్జీ ఈ సైకో థ్రిల్లర్ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు.
కథగా చెప్పుకోవాలంటే.. చాలా సింపుల్. ఇదో ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మూవీ. హైదరాబాద్ లో అమ్మాయిలను కిడ్నాప్ చేసి చంపేస్తున్న సీరియల్ సైకో కిల్లర్ ఆటను ఎఎస్పీతో పాటు ఓ సాధారణమైన వ్యక్తి ఎలా కట్టించాడన్నదే ఇందులోని మెయిన్ పాయింట్. ఒంటరిగా కనిపించే అందమైన అమ్మాయిలు కిడ్నాప్ చేసి, సిటీ అవుట్ కట్స్ కు తీసుకెళ్ళి చంపేస్తుంటాడు డి ఉరఫ్ దాస్ (అభిషేక్ బెనర్జీ). అతన్ని పట్టుకోవడానికి ఎఎస్పీ ఆశా భరత్ (సైయామీ ఖేర్) తన టీమ్‌తో రంగంలోకి దిగుతుంది. ఇదే సమయంలో విశాఖపట్నం నుండి బెంగళూర్‌కు తన స్నేహితుడితో కలిసి ఈవెంట్ కోసం బయలుదేరతాడు ఫోటోగ్రాఫర్ విష్ణు (ఆనంద్ దేవరకొండ). అతనికి దారిలో… మంగుళూరులోని తన తండ్రి దగ్గరకు బైలుదేరిన తులసి అనే అమాయకురాలు తారసపడుతుంది. ఆమెను మంగుళూరు బస్ ఎక్కించే బాధ్యతను తీసుకుంటాడు విష్ణు. కానీ మధ్యలో ఊహించని కారణాలతో ఆమె సైకో కిల్లర్ చేతికి చిక్కుతుంది. ఇటు ఎఎస్పీ తో పాటు అటు విష్ణు సైకో కిల్లర్‌ను ఛేజ్ చేయడం మొదలు పెడతారు. వాళ్ళు ఎలా అతన్ని పట్టుకున్నారు? ఈ సైకో కిల్లర్ వెనుక ఉన్న కథ ఏమిటనేదే మిగతా సినిమా.
మూవీ పేరుకు తగ్గట్టుగానే ఈ కథంతా ప్రధానంగా హై వే మీదనే సాగుతుంది. సైకోకి సంబంధించిన కథ హైదరాబాద్‌లో మొదలైతే, విష్ణు స్టోరీ వైజాగ్ లో స్టార్ట్ అవుతుంది. ఇక హీరోయిన్ తులసి కథ అమలాపురం దగ్గరుండే చిన్న గ్రామంలో! ఈ ముగ్గురూ హై వే మీద కలుసుకోవడం… విడిపోవడం అనే అంశాలు ఆసక్తికరంగానే ఉన్నాయి. ఈ జర్నీలో విష్ణు, తులసి మధ్య ఏర్పడిన చిన్నపాటి అనుబంధం, ఒకరిని ఒకరు వదులుకోలేని నిస్సహాయస్థితి, అంతలోనే ఊహించని ప్రమాదంలో తులసి ఇరుక్కోవడం… వంటి అంశాలను దర్శకుడు కన్వెన్సింగ్ గానే తీశాడు. కానీ ఇప్పటికే సీరియల్ సైకో కిల్లింగ్స్ నేపథ్యంలో చాలానే సినిమాలు, వెబ్ సీరిస్ లు వచ్చాయి. అందువల్ల కథలో కొత్తదనం ఏమీ ఫీల్ కాలేం. ఇక ఎఎస్పీ చేసే ఇన్వెస్టిగేషన్ కాస్తంత ఆసక్తికరంగానే ఉన్నా… సీట్ ఎడ్జ్‌లో కూర్చోపెట్టెంత గ్రిప్పింగ్‌గా మాత్రం కథనం లేదు. మరీ ముఖ్యంగా సైకో కిల్లర్ మోటివ్ మరీ తేలిపోయింది. అయితే… జనారణ్యంలోని మానవ మృగానికి అడవిలో ఎలాంటి శిక్ష పడిందనే అంశం కాస్తంత థ్రిల్లింగ్ గా అనిపిస్తుంది. ఈ సినిమాలో ఏదైనా కొత్తదనం ఉందంటే అదే!
నటుడిగా ఆనంద్ దేవరకొండలో మూవీ మూవీకీ ఇంప్రూవ్ మెంట్ కనిపిస్తోంది. నేచురల్ యాక్టింగ్ అతనిలోని ప్లస్ పాయింట్. బట్ మరికొంత మెచ్యూరిటీ రావాలి. బాల నటిగా చిత్రసీమలోకి అడుగుపెట్టిన మలయాళీ నటి మానసా రాధాకృష్ణన్ తన పాత్ర పరిధి మేరకు బాగానే నటించింది. సాయిధరమ్ తేజ్ ‘రేయ్’ మూవీతో నటిగా కెరీర్ మొదలు పెట్టిన సైయామీ ఖేర్ గత యేడాది నాగార్జున ‘వైల్డ్ డాగ్’లో కీలక పాత్ర పోషించింది. ఇందులోనూ అదే తరహా పాత్రను చేసింది. ఆశా భరత్‌గా చక్కని నటన కనబరిచింది. టాలీవుడ్ వాళ్ళకు మరో బ్యూటీఫుల్ లేడీ పోలీస్ ఆఫీసర్ దొరికినట్టే. కానీ తమిళ నటుడు జాన్ విజయ్ ను దర్శకుడు పెద్దంతగా ఉపయోగించుకోలేదు. పలు హిందీ సినిమాలతో పాటు ‘మీర్జాపూర్’, ‘పాతాళ్ లోక్’ వంటి వెబ్ సీరిస్ లలో నటించి చక్కని గుర్తింపు తెచ్చుకున్న అభిషేక్ బెనర్జీ ఇందులో సైకో పాత్రను సమర్థవంతంగా పోషించాడు. ఇతర ప్రధాన పాత్రల్లో సత్య, తులసీరామ్, నాగమహేశ్, సురేఖా వాణి, ఆంటోని, మిర్చి కిరణ్, రేష్మ పసుపులేటి, కళ్యాణీ నటరాజన్, ‘రచ్చ’ రవి తదితరులు కనిపిస్తారు. ‘పూలరంగడు’ దర్శకుడు వీరభద్రమ్ చౌదరి ప్రీ క్లయిమాక్స్ లో గెస్ట్ అప్పీయరెన్స్ ఇచ్చారు.
కె.వి. గుహన్ తీసిన గత చిత్రం ‘డబ్ల్యూ డబ్ల్యూ డబ్ల్యూ’ కూడా ఓటీటీలోనే స్ట్రీమింగ్ అయ్యింది. మినిమమ్ బడ్జెట్‌లో, కాంపాక్ట్ క్రూ తో ఆయన సినిమాలు చేస్తున్నారు. ‘హైవే’ అదే కోవకు చెందిన సినిమా. బేసికల్ గా సినిమాటోగ్రాఫర్ అయిన కె.వి. గుహన్ ఆ శాఖను సమర్థవంతంగా నిర్వహించారు. ఆయన సినిమాటోగ్రఫీ ఈ మూవీకి మెయిన్ హైలైట్. అలానే సైమన్ కె కింగ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మరో ప్లస్ పాయింట్. తమ్మిరాజు ఎడిటింగ్; మిర్చి కిరణ్, సాయికిరణ్ రాసిన సంభాషణలు ఓకే. ఇందులో ఉన్న రెండు నేపథ్య గీతాలను అనంత శ్రీరామ్, శ్రీమణి రాశారు. వాటి చిత్రీకరణ బాగుంది. వెంకట్ తాళ్ళూరి పరిమితమైన బడ్జెట్ లో మూవీ తీసినట్టు అర్థమైపోతోంది. ఆర్టిస్టుల పేర్లు టైటిల్స్ లో సరిగా మెన్షన్ చేయకపోవడం దారుణం. హాలీవుడ్ సినిమాలు, ఓటీటీల కారణంగా ఇవాళ థ్రిల్లర్ జానర్ మూవీస్ ను ఇష్టపడే వర్గమూ ఒకటి ప్రత్యేకంగా ఉంది. అలాంటి వారికి మాత్రమే ‘హై వే’ మూవీ నచ్చుతుంది.
ప్లస్ పాయింట్స్
ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ కావడం
సాంకేతిక నిపుణుల పనితనం
మూవీ రన్ టైమ్
క్లయిమాక్స్ ట్విస్ట్
మైనెస్ పాయింట్స్
బలహీనమైన కథ
గ్రిప్పింగ్ గా లేని కథనం
ట్యాగ్ లైన్: హైవే పై సైకో!