NTV Telugu Site icon

Officer on Duty Review: ఆఫీసర్ ఆన్ డ్యూటీ రివ్యూ

Officer On Duty

Officer On Duty

కుంచాకో బోబన్ నటించిన మలయాళ చిత్రం ఆఫీసర్ ఆన్ డ్యూటీ మలయాళంలో ఫిబ్రవరి 20న విడుదలై మంచి అద్భుతమైన రివ్యూస్ తో  బాక్సాఫీస్ వద్ద విజయవంతమైంది. ప్రియా మణి హీరోయిన్ గా నటించగా, జగదీష్, విశాక్ నాయర్ కీలక పాత్రలు పోషించారు. జితు అష్రఫ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను మార్టిన్ ప్రక్కట్, రెంజిత్ నాయర్, సిబి చావర నిర్మించగా తెలుగులో E4 ఎంటర్‌టైన్‌మెంట్ ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ హక్కులను సొంతం చేసుకుంది. మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ మార్చి 14న ఈ సినిమాని గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్న క్రమంలో ఒక రోజు ముందుగానే తెలుగు మీడియాకి స్పెషల్ షో ప్రదర్శించారు. మరి ఈ సినిమా ఎలా ఉంది తెలుగు ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది అనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం పదండి

ఆఫీసర్ అన్ డ్యూటీ కథ:
హరి శంకర్(కుంచాకో బొబన్) ఒక హానెస్ట్ పోలీసు ఆఫీసర్. ఒక కేసు కారణంగా అతను డివైఎస్పీ ర్యాంక్ నుంచి సీఐకి డీమోట్ అవుతాడు. అనుకోకుండా ఒక రోజు ఆర్టీసీ కండక్టర్ చంద్రబాబు (జగదీష్) ఒక నకిలీ బంగారు గొలుసు తాకట్టు పెట్టేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలో పోలీస్ స్టేషన్ కి తీసుకు రాబడతాడు. అదే సమయంలో హరిశంకర్ కంటపడడంతో ఆ కేసుని ఆయన టేకప్ చేస్తాడు. తీగ లాగితే డొంక అంతా కదిలినట్టు ఈ నకిలీ బంగారు గొలుసు మిస్టరీ చాలా పెద్దదే. ఇక ఈ కేసులో హరిశంకర్ ఇన్వాల్వ్ అయిన తర్వాత చంద్రబాబు కుమార్తె ఆత్మహత్య చేసుకుని చనిపోతుంది. దానికి కారణం హరిశంకర్ అని చంద్రబాబు పెద్ద ఉద్యమమే చేస్తాడు. అయితే దీనికి కారణం తెలుసుకునే ప్రయత్నం మొదలుపెట్టిన తర్వాత హరిశంకర్ కి తన కుమార్తె మరణానికి కారణమైన వారే అనేకమంది అమ్మాయిల మరణాలకు, వారి కుటుంబ సభ్యుల మరణాలకు కారణమయ్యారని తెలుస్తుంది. అలా తెలిసిన తర్వాత వారిని ఎలా పట్టుకున్నారు? అసలు అలా ఎలా తెలుసుకోగలిగారు? హరిశంకర్ కుమార్తెకు ఏమైంది? చంద్రబాబు కుమార్తెకు ఏమైంది? చివరికి వారి చావులకు కారణమైన వారిని హరిశంకర్ ఏం చేశాడు? అనేది తెలియాలంటే సినిమాని బిగ్ స్క్రీన్ మీద చూడాల్సింది.

విశ్లేషణ:
ఇది ఒక కాప్ ఇన్వెస్టిగేషన్ డ్రామా.. మనకు తెలుగులో పోలీసు డ్రామా సినిమాలు కొదవ ఏమీ కాదు. అలాగే ఇతర భాషలలో సూపర్ హిట్ అయిన ఎన్నో ఇలాంటి కథలు ఉన్న సినిమాలను కూడా తెలుగులోకి తీసుకొచ్చారు. ఇప్పుడు ఈ సినిమాని కూడా ఒక ఇంట్రెస్టింగ్ కాప్ ఇన్వెస్టిగేషన్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. సినిమా ప్రారంభంలోనే మూర్ఖంగా ప్రవర్తించే ఒక పోలీస్ అధికారికి అనుకోకుండా ఒక ఆసక్తికరమైన కేసు దొరుకుతుంది. దాని తీగ లాగితే తన కుమార్తె ఆత్మహత్య సహా ఎంతో మంది అమాయకులైన అభం శుభం తెలియని అమ్మాయిల ఆత్మహత్యలు వారి కుటుంబ సభ్యుల ఆత్మహత్యల గురించి సంచలన విషయాలు తెలుస్తాయి. అలా తెలిసిన తర్వాత వారిని పట్టుకునేందుకు చేసిన ప్రయత్నం ఆసక్తికరంగా సాగుతుంది. నిజానికి ఈ కథ ఊహకు అందేటట్లుగానే ఉన్న తర్వాత ఏం జరగబోతోంది అనే విషయంలో మాత్రం సస్పెన్స్ మెయింటెన్ చేయడంలో దర్శకుడు సఫలమయ్యాడు. గతంలో కొన్ని చిత్రాలకు అసోసియేట్ గా పనిచేసిన దర్శకుడు ఈ సినిమాతో దర్శకుడిగా మారాడు. అయితే ఎక్కడా మొదటి చిత్రం అనే ఫీలింగ్ రాకుండా కథను నడిపించడంలో సక్సెస్ అయ్యాడు. నిజానికి సినిమాలో ఎంగేజ్ చేసే కొన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. అయితే తెలుగు డబ్బింగ్ విషయంలో ఇంకా కేర్ తీసుకుని ఉంటే బాగుండేది. ఎందుకంటే పేర్ల విషయంలో కన్ఫ్యూజన్ క్రియేట్ చేసేసారు. ఆ విషయంలో కేర్ తీసుకుని ఉంటే బాగుండేది అనిపిస్తుంది. సినిమా సాగినంతసేపు ప్రేక్షకులను తర్వాత ఏం జరగబోతోంది అనే విషయంలో సస్పెన్స్ మెయింటైన్ చేసేలా చేసి తనదైన శైలిలో సినిమా మొత్తాన్ని నడిపించాడు దర్శకుడు. అయితే ఈ సినిమాలో డిజైన్ చేసుకున్న యాక్షన్ సీన్స్ చూస్తున్నప్పుడు మాత్రం గతంలో చూసిన కొన్ని ఇంటెన్స్ యాక్షన్ డ్రామాలు గుర్తుకు రావచ్చు. కానీ డ్రగ్స్ తీసుకున్న వ్యక్తుల వ్యవహారాలు ఇలాగే ఉంటాయి ఏమో అనిపించేలా సీన్ మొత్తాన్ని పండించేలా ప్లాన్ చేశారు. అయితే ఈ పోలీసు డ్రామా చూసినప్పుడు గతంలో కొన్ని పోలీస్ డ్రామాలు చూస్తున్న ఫీలింగ్ కలిగితే అది మీ తప్పు కాదు. ఎందుకంటే పోలీసు ఇన్వెస్టిగేషన్ డ్రామాలు నుంచి ఇంతకన్నా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేం. ఇక స్క్రీన్ ప్లే కనెక్ట్ చేసిన విధానం కూడా ప్రేక్షకులను ఎంగేజ్ చేసేలా ఉంది. ఎక్కడా ట్విస్టులు కానీ వావ్ అనిపించేలాంటి సీన్స్ కానీ లేకపోయినా ప్రేక్షకులు క్లైమాక్స్ లో ఏం జరగబోతున్నదా అని ఎదురుచూసే తీరులో కొంత సస్పెన్స్ మెయింటైన్ చేసినా చివరికి రొటీన్ ఎండింగ్ తోనే ముగించారు. ఫస్ట్ ఆఫ్ ఆసక్తికరంగా సాగుతూనే ఇంటర్వల్ ఏంటి ఇంత త్వరగా వచ్చేసిందనే ఫీలింగ్ కలిగిస్తుంది. ఇక సెకండ్ ఆఫ్ విషయానికి వస్తే టామ్ అండ్ జెర్రీ చేజింగ్ లా ఫాస్ట్ ఫాస్ట్ గా సాగిపోతూ ఉంటుంది. ఒక హ్యాపీ ఎండింగ్ ఇస్తూ కథను నడిపించారు.

ఇక ఈ సినిమాలో నటీనటుల విషయానికి వస్తే కొంచెం పోలీస్ అధికారిగా అది కూడా కుమార్తెను పోగొట్టుకున్న బాధలో ఒక రకమైన ఇబ్బంది పడుతూ జబ్బు పడిన వ్యక్తిగా ఇలా రకరకాల పార్స్యాలు చూపిస్తూ ఆకట్టుకున్నాడు. ప్రియమణి అతని భార్య పాత్రలో ఉన్నంతలో పర్వాలేదు అనిపించింది. జగదీష్ పాత్ర కూడా పరిమితమే కానీ డ్రగ్ పెడలర్స్ గా నటించిన ఐదుగురు మాత్రం అరాచకం సృష్టించారు. వారిని చూస్తేనే అసహ్యం, వెగటు పుట్టించేలా తమ పాత్రలలో ఇమిడిపోయారు. మిగతా పాత్రధారులు అందరూ తమ పాత్రల పరిధి మేర నటించారు. ఈ సినిమాకి హీరో కుంచకో అయితే సెకండ్ హీరో మాత్రం నేపథ్య సంగీతం అందించిన సంగీత దర్శకుడు జేక్స్ బిజాయ్ అనే చెప్పాలి. ఒక సస్పెన్స్ ఫుల్ డ్రామాని నడిపించడానికి నేపథ్య సంగీతం ఎంతో అవసరం. ఆ విషయంలో ఈ సంగీత దర్శకుడిని మెచ్చుకోకుండా ఉండలేము. సినిమాటోగ్రఫీ కూడా సినిమాకి కరెక్ట్ గా సెట్ అయింది. ఇక ఎడిటింగ్ క్రిస్పీగా ఉంది. నిర్మాణ విలువలు బాగున్నాయి కానీ తెలుగు డబ్బింగ్ విషయంలో ఇంకా కేర్ తీసుకుని ఉంటే సినిమా రిజల్ట్ వేరేలా ఉండేదేమో.

ఫైనల్లీ ఆఫీసర్ అన్ డ్యూటీ ఒక ఎంగేజింగ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్..