నవీన్ చంద్ర హీరోగా “ఎలెవన్” అనే సినిమా ప్రకటించినప్పటి నుంచే సినిమా మీద ప్రేక్షకులలో ఒక రకమైన ఆసక్తి ఏర్పడింది. దానికి తోడు ప్రచార కంటెంట్ కూడా ఆసక్తికరంగా ఉండడంతో సినిమా మీద అంచనాలు కూడా ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో నిన్న ఈ సినిమా ఒక రోజు ముందుగానే మీడియాకి షో వేసింది సినిమా యూనిట్. మరియు సినిమా ఎలా ఉంది, ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది అనేది ఇప్పుడు మనం రివ్యూలో చూద్దాం.
కథ:
విశాఖపట్నంలో వరుస హత్యలు కలకలం రేపుతుంటాయి. చంపింది ఎవరో అనేది పక్కనపెడితే, అసలు చనిపోయింది ఎవరు అనేది కూడా పోలీసులు గుర్తించలేని పరిస్థితిలో పడతారు. ఈ నేపథ్యంలో ఆ కేసును డీల్ చేస్తున్న పోలీస్ ఆఫీసర్ శశాంక్‌కి యాక్సిడెంట్ జరగడంతో, ఆ కేసు కోసం ఏసీపీ అరవింద్ (నవీన్ చంద్ర)ను రంగంలోకి దింపుతాడు సిటీ పోలీస్ కమిషనర్ ఆదు కాలం నరేన్. కేసును టేకప్ చేసిన తర్వాత ఒక్కో విషయాన్ని పరిష్కరిస్తూ, ఈ హత్యలు చేస్తోంది బెంజిమిన్ అని అరవింద్ తెలుసుకుంటాడు. ఆ బెంజిమిన్‌ను గుర్తించేందుకు అరవింద్ ఏం చేశాడు? దానికి ఎవరెవరు సహాయపడ్డారు? అసలు బెంజిమిన్ ఈ హత్యలు చేయడానికి గల కారణమేంటి? లాంటి విషయాలు తెలియాలంటే సినిమాను బిగ్ స్క్రీన్‌పై చూడాల్సిందే.
విశ్లేషణ:
సాధారణంగా ఇలాంటి సినిమాలు కేవలం థ్రిల్లర్ లేదా ఇన్వెస్టిగేటివ్ డ్రామా సినిమాలు ఇష్టపడే వారికి మాత్రమే నచ్చుతాయి. ఒక ప్రేక్షకుడిగా నేను కూడా సినిమా థియేటర్‌లో అడుగుపెట్టినప్పుడు ఇది ఒక రొటీన్ ఇన్వెస్టిగేటివ్ డ్రామా అని అనుకున్నాను. ఫస్ట్ హాఫ్ అంతా అదే పంథాలో నడుస్తుంది. ఇంకేముంది, రొటీన్ సినిమానే కదా, ఇందులో కొత్తదనం ఏముంది అని అనుకుంటూ ఉండగానే ఇంటర్వెల్ వచ్చేసింది. ఎప్పుడైతే ఇంటర్వెల్ దాటి సెకండ్ హాఫ్ మొదలైందో, అక్కడితో కథ పరుగులు పెడుతుంది. ఫస్ట్ హాఫ్ అంతా మనం ఊహించినట్టే జరుగుతూ ఉంటుంది. తర్వాత ఇది జరగబోతోంది అని మనం ఏదైతే అనుకుంటామో, తెరపై అదే కనిపిస్తూ ఉంటుంది. ఇందులో కొత్తదనం ఏమీ లేదు కదా అని మనం కూడా అందుకే ఫిక్స్ అయిపోతాం. కానీ సెకండ్ హాఫ్‌లో మాత్రం మనం ఊహించిన దానికి భిన్నంగా తెరపైకి తీసుకురావడంలో దర్శకుడు సఫలమయ్యాడు. నిజానికి ఇది కొత్త కథ ఏమీ కాదు, కానీ ఈ కథతో ప్రేక్షకులను ఆకర్షించే ప్రయత్నం చేయడం అభినందనీయం. ఎందుకంటే ఇప్పటివరకు రివెంజ్ స్టోరీలు మనం చాలా చూసుంటాం, కానీ ఇందులో ప్రస్తావించిన అంశం కాస్త లాజికల్‌గా ఉంది. ఒక పోలీస్ ఆఫీసర్ ఒక కేసుతో మొదలై, ఆరు సీరియల్ హత్యలను పరిష్కరించే క్రమంలో ఎదుర్కొన్న సవాళ్లు, ఆ తర్వాత కథలో జరిగిన మార్పులు, వచ్చే ట్విస్ట్‌లు అన్నీ కూడా ప్రేక్షకులను అలరించేలా రాసుకోవడంలో డైరెక్టర్ సఫలమయ్యాడు. అయితే, సినిమాలో ఇంకా కాస్త తెలిసిన ముఖాలను తీసుకుని, తెలుగు ప్రేక్షకులకు పరిచయం ఉన్న నటీనటులతో చేసుంటే సినిమా నెక్స్ట్ లెవెల్‌లో ఉండేదని చెప్పక తప్పదు.
నటీనటులు:
నటీనటుల విషయానికి వస్తే, నవీన్ చంద్ర ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించాడు. ఎవరూ ఊహించని విధంగా తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా కొన్ని ఎక్స్‌ప్రెషన్స్ అయితే నెక్స్ట్ లెవెల్‌లో ఉన్నాయని చెప్పక తప్పదు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ లేదు. హీరోయిన్‌గా కనిపించిన అమ్మాయి పాత్ర చాలా పరిమితమే. స్వయంగా ఆమె నిర్మాత కూడా కావడం గమనార్హం. ఇక మిగతా పాత్రల్లో నటించిన శశాంక్, కిరీటి వంటి వారు తమ పాత్రలకు పూర్తిస్థాయిలో న్యాయం చేశారు.
టెక్నికల్ టీమ్:
ఈ సినిమా టెక్నికల్ టీమ్ విషయానికి వస్తే, సినిమాటోగ్రఫీ సినిమాకి మంచి ప్లస్ పాయింట్. అలాగే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాను వేరే లెవెల్‌కి తీసుకెళ్లింది. సాంగ్స్ అంతగా గుర్తుంచుకోదగ్గవి లేవు, కానీ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకుంది. సినిమా నిడివి కూడా సినిమాకి మంచి ప్లస్ పాయింట్ అయ్యేలా కట్ చేసుకున్నారు. అలాగే, ఎమోషనల్ యాంగిల్ వర్కౌట్ అయ్యేలా కొన్ని సీన్స్ రాసుకుని ఉంటే బాగుండేదేమో అనిపిస్తుంది. నిర్మాణ విలువలు సినిమాకి తగ్గట్టు బాగున్నాయి.
ఫైనల్‌గా:”ఎలెవన్” ఆసక్తికరమైన ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ విత్ షాకింగ్ ట్విస్ట్.