Love Mouli Movie Review: హీరోగా ఒకప్పుడు సినిమాలు చేస్తూ వచ్చిన నవదీప్ ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారిపోయాడు. పెద్ద హీరోల సినిమాలో చిన్న చిన్న క్యారెక్టర్లు చేయడానికి కూడా ఏమాత్రం వెనకాడడం లేదు. అలాంటి ఆయన 2.0 అంటూ ఒక సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు చాలా కాలం నుంచే ప్రయత్నం చేస్తూ వచ్చాడు. పలుసార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా లవ్ మౌళి పేరుతో ఎట్టకేలకు ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. టీజర్, ట్రైలర్ తోనే ఒక్కసారిగా ప్రేక్షకులలో అంచనాలు పెంచేసిన ఈ సినిమాను రాజమౌళి, విజయేంద్ర ప్రసాద్ ల శిష్యుడు అవనీంద్ర డైరెక్ట్ చేశాడు. ప్రమోషన్స్ తో ప్రేక్షకులలో ఈ సినిమా మీద ఆసక్తి ఏర్పడింది. మరి ఆ ఆసక్తిని సినిమా ఎంతవరకు క్యారీ చేసింది? సినిమా ఎలా ఉంది? అనేది ఇప్పుడు మనం రివ్యూలో చూద్దాం.
లవ్ మౌళి కథ ఏమిటంటే
మౌళి(నవదీప్) తల్లిదండ్రులు చిన్నప్పుడే వివాదాల కారణంగా విడిపోతారు. తాతయ్య దగ్గరే ఒక హిల్ స్టేషన్ లో పెరుగుతూ ఉంటాడు. 14 ఏళ్ల వయసులో ఆయన కూడా చనిపోవడంతో తనకు నచ్చినట్టుగా ప్రపంచాన్ని పట్టించుకోకుండా తనదైన లోకంలో బతికేస్తూ ఉంటాడు. స్వతహాగా ఆర్టిస్ట్ కావడంతో ఎప్పటికప్పుడు పెయింటింగ్స్ వేస్తూ వాటిని అమ్ముతూ డబ్బులు సంపాదిస్తూ ఉంటాడు. అయితే ప్రేమ విషయంలో అమ్మాయిలందరూ ఒకటే, మోసగిస్తారు అనే భావంలో బతికేస్తూ ఉంటాడు. అలా అనుకోకుండా ఒక అఘోర(రానా) తారసపడతాడు. ప్రేమ గురించి మౌళికి ఉన్న అభిప్రాయాన్ని మార్చేందుకు తనకున్న శక్తితో ఒక మాయా పెయింటింగ్ బ్రష్ ని క్రియేట్ చేసి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత మౌళి అదే బ్రష్తో తనకి కావాల్సిన గుణగణాలతో ఒక అమ్మాయి పెయింటింగ్ వేస్తే అందులో నుంచి నిజంగానే చిత్ర (పంకూరి గిద్వానీ) అనే అమ్మాయి బయటకు వస్తుంది. అయితే ఆమె కూడా తనకు తగ్గట్టు లేదని భావించి మళ్లీ గుణగణాలు మార్చి మరోసారి గీస్తాడు. అదే అమ్మాయి మరోసారి వేరే గుణగణాలతో వస్తుంది. అయితే అసలు ఇలా ఎందుకు జరుగుతుంది? మౌళి ప్రేమ గురించి చివరికి తెలుసుకున్నాడా? ఎన్నిసార్లు ఆ చిత్రను గుణగణాలు మార్చి బయటికి రప్పించాడు ? చివరికి అసలు ఏమైంది అనేది ఈ సినిమా కథ.
విశ్లేషణ
లవ్ మౌళి గురించి చెప్పాలంటే ఇదేదో ఎక్కడి నుంచో పుట్టుకొచ్చిన కథ కాదు. గతంలో మనం చూసిన ఎన్నో సినిమాల నుంచి దీనిని ప్రేరేపించబడి చేశారేమో అనిపిస్తుంది. ఎందుకంటే ప్రేమ గురించి ఒక్కొక్కరికి ఒక్కొక్క అభిప్రాయం ఉంటుంది. కానీ దర్శకుడు తనకు ఉన్న అభిప్రాయాన్ని ఈ విధంగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు. అసలు ప్రేమ మీద సరైన అభిప్రాయం లేని ఒక వ్యక్తి తాను నమ్మే ప్రేమ కోసం వెతుకులాట మొదలు పెట్టడమే ఈ లవ్ మౌళి సింగిల్ లైన్ ప్లాట్. అయితే దాన్ని కవితాత్మకంగా చెప్పే ప్రయత్నం చేయడంతో ఫస్ట్ హాఫ్ ఈ క్రమంలో కాస్త సాగదీసిన ఫీలింగ్ కలుగుతుంది. కానీ సెకండ్ హాఫ్ మాత్రం ఎంగేజింగ్ గా ఉంటుందనే చెప్పాలి. అయితే సినిమాకి ప్రధానమైన అసెట్ ఏదైనా ఉందంటే, అది లొకేషన్స్ అలాగే బ్యాక్ గ్రౌండ్ స్కోర్. సినిమా మొత్తాన్ని మేఘాలయలోనే షూట్ చేశామని ముందు నుంచి ఈ సినిమా యూనిట్ చెబుతూ వచ్చింది. అది ఎందుకు అనేది సినిమా చూస్తేనే అర్థమవుతుంది. ఇక సీన్స్ పరంగా కూడా ప్రేమ, పెళ్లి ప్రేమలో ఉన్నప్పుడు ప్రేయసితో లేదా ప్రియుడుతో ఉన్న విధానాన్ని చూస్తే కనుక కచ్చితంగా ప్రేమలో ఉన్న వారంతా కనెక్ట్ అయ్యేలానే ఉంటుంది. అయితే యూత్ కి తగ్గట్టుగా కొన్ని బోల్డ్ సీన్స్ అలాగే లిప్ లాక్ లు కూడా ఉన్నాయి. చాలా వరకు అవన్నీ కూడా కథకు అనుగుణంగానే ఉండడం కాస్త సినిమాకి ప్లస్ అయ్యే అంశం. అయితే క్లైమాక్స్ మాత్రం రొటీన్ గానే అనిపిస్తుంది. సో కొత్త సీసాలో పాత సారాయేనా అని ప్రేక్షకులు ఫీలయ్యే అవకాశం ఉంటుంది. కానీ దాన్ని కవితాత్మకంగా కమర్షియల్ హంగులు లేకుండా ప్రేక్షకులు ముందుకు తీసుకువచ్చిన విధానాన్ని అభినందించాల్సిన అవసరం ఉంది.
ఇక నటీనటుల విషయానికి వస్తే ప్రమోషన్స్ లో చెప్పినట్టుగానే నవదీప్ 2.0 ఏంటో చూపించాడు. ఈ సినిమా కోసమే బాడీని రెండుసార్లు పెంచి సీన్స్ కోసం కూడా గట్టిగానే కష్టపడ్డాడనిపించింది. ఈ కథను మరో హీరో చేస్తాడా అనేది సందేహమే. అంతలా ఈ పాత్రలో ఆయన ఒదిగిపోయాడు. ఇక చిత్ర పాత్రలో ఫంకూరి కూడా ఒక రేంజ్ లో నటించింది. ఆమె చాలా సీన్స్ లో నవదీప్ ని డామినేట్ చేసేలా నటించింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక హారిక, ఆర్జే హేమంత్ వంటి వాళ్ళు తమ పాత్రల పరిధి మేరకు నటించారు. రానా దగ్గుబాటి అఘోర స్పెషల్ ఎంట్రీ ఎవరు ఊహించి ఉండరు. ఇక సినిమా టెక్నికల్ అంశాల విషయానికి వస్తే అన్ని క్రాఫ్ట్స్ మీద పట్టు ఉన్న దర్శకుడు సరైన ఔట్పుట్ తెచ్చుకున్నాడు అనిపించింది. దర్శకుడే సినిమాటోగ్రాఫర్ కూడా కావడంతో ఆ విజువల్స్ వేరే లెవల్ లో తీసుకొచ్చాడు. ఇక గోవింద వసంత, కృష్ణ ఇచ్చిన పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకి తగ్గట్టుగా సరిపోయాయి నిర్మాణ విలువలు కూడా సినిమా స్థాయికి తగ్గట్టున్నాయి.
ఫైనల్ గా చెప్పాలంటే లవ్ మౌళి ఒక పెయింటింగ్ లాంటి సినిమా అయితే అర్థమైన వారికి మాత్రమే..