Mothevari Love Story Review : ఒకప్పుడు తెలంగాణ కంటెంట్‌కి పెద్దగా ప్రాధాన్యత ఇచ్చే వాళ్లు కాదు ప్రేక్షకులు. అయితే నెమ్మదిగా ఆ అపోహ తొలగిపోయింది. తెలుగు ప్రేక్షకులు కంటెంట్ బాగుంటే భాషతో, యాసతో సంబంధం లేకుండా ఆదరిస్తారని అందరూ గుర్తించారు. అలా తెలంగాణ ప్రాంతం నుంచి మొట్టమొదటిగా పుట్టుకొచ్చిన యూట్యూబ్ ఛానల్ మై విలేజ్ షో. ఇందులో గంగవ్వకు ఎంత పేరు వచ్చిందో, అనిల్ గీలా అనే వ్యక్తికి కూడా అంతే పేరు వచ్చింది. అయితే మనోడు మై విలేజ్ షోలో క్లిక్ అయినంతగా బయటకు వచ్చాక ఎందులో కానీ క్లిక్ కాలేదు? అయితే అదే అనిల్ ప్రధాన పాత్రలో మోతెవరి లవ్ స్టోరీ అంటూ జీ ఫైవ్ సంస్థ ఒక సిరీస్ చేసింది. ఆ సిరీస్ ట్రైలర్ చూశాక సిరీస్ మీద ఆసక్తి ఏర్పడింది. మరి సిరీస్ ఎలా ఉంది? ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది అనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం.
Read Also : Mega Heros : ముగ్గురు మెగా హీరోలు ఒకే ఫ్రేమ్ లో..!
మోతెవరి లవ్ స్టోరీ కథ: తెలంగాణలోని ఆరెపల్లి అనే గ్రామంలో సత్తయ్య, నర్సింగ్ అని ఇద్దరు అన్నదమ్ములు ఉంటారు. వారే ఆ ఊరికి గ్రామ పెద్దలు. వారి నాన్న మోతే వారి. అయితే, వాళ్ల తండ్రి చనిపోయే ముందు అనుమవ్వకు ఐదు ఎకరాల భూమి రాసిస్తాడు. అయితే రహస్యంగా ప్రేమించుకుంటున్న సత్తయ్య కుమార్తె అనిత (వర్షిణి రెడ్డి), అనుమవ్వ మనవడు పార్షి (అనిల్ గీలా) లేచిపోయి పెళ్లి చేసుకోవాలని ప్లాన్ వేసుకోగా అనుకోని అవాంతరాలు ఎదురవుతాయి. అసలు వీరి ప్రేమకు గ్రామంలో ఏర్పడ్డ భూ తగాదాలకు సంబంధం ఏంటి? పార్షి అమ్మమ్మకు మోతే వారికి మధ్య ఉన్న సంబంధం ఏంటి? వారసత్వంగా వచ్చిన భూమి కోసం అన్నదమ్ములు ఏం చేశారు? చివరికి పార్షి, అనిత ప్రేమ సక్సెస్ అయిందా? లేదా? అని తెలియాలంటే సిరీస్ చూడాల్సిందే.
విశ్లేషణ: తెలంగాణ ప్రాంతం నుంచి వచ్చి ఎమోషన్స్‌తో సూపర్ హిట్ అయిన సినిమా బలగం. ఈ సిరీస్ దర్శకుడు కూడా దాన్నే ఆదర్శంగా చేసుకుని కథ రాసుకున్నాడేమో అనిపిస్తుంది. మానవ బంధాలన్నీ డబ్బుతో ఎలా ప్రభావితం అవుతున్నాయి అనే అంశంతో ఈ కథ రాసుకున్నాడు దర్శకుడు. అయితే ఆ విషయాన్ని ఏడు ఎపిసోడ్‌ల సిరీస్‌లో చివరి ఎపిసోడ్‌లో మాత్రమే ప్రస్తావించడం కాస్త ఇబ్బందికర అంశం. అలాగని మిగతా ఆరు ఎపిసోడ్‌లు బాగోలేదా అంటే అలా కాదు. ఆ ఆరు ఎపిసోడ్‌లు కామెడీతో నడిపించి, ఏడవ ఎపిసోడ్ అంతా ఎమోషన్‌తో ప్లాన్ చేసుకున్నాడు. ఇక సిరీస్‌లో లవ్, ఎమోషన్, ఫ్యామిలీ డ్రామా, సెంటిమెంట్ అన్నీ కలగలిపి తెరకెక్కించిన విధానం బాగుంది. కథా వస్తువు చిన్నదే కానీ ఎంగేజింగ్ స్క్రీన్ ప్లేతో చివరి ఎపిసోడ్ వరకు చూసేలా తెరకెక్కించారు. నవ్విస్తూనే అందరినీ ఆలోచింపజేస్తుంది ఈ సిరీస్. ముఖ్యంగా, లీడ్ పెయిర్ ప్రేమకు వచ్చిన అడ్డంకుల నేపథ్యంలో వచ్చే సీన్స్‌కి ఆడియన్స్ ఎంగేజింగ్‌గా ఫీల్ అవుతారనడంలో సందేహం లేదు.
నటీనటుల విషయానికి వస్తే అనిల్ గీలా ఇలాంటి పాత్రలు గతంలోనే మై విలేజ్ షోలో చాలా చేశాడు. ఇక్కడ కూడా చాలా ఈజీగా నటించాడని చెప్పక తప్పదు. ఒక రకంగా ఆయన్ని షో రన్నర్ అని కూడా చెప్పొచ్చు. తర్వాత వర్షిణి కూడా అమాయకమైన పల్లెటూరి ఆడపిల్ల పాత్రలో ఒదిగిపోయింది. మురళీధర్ గౌడ్, సదన్న కూడా ఇలాంటి పాత్రలు చాలా చేశారు, ఇద్దరూ అదరగొట్టారు. ఈ సిరీస్ టెక్నికల్‌గా చాలా బాగుంది.
ఇక టెక్నికల్ టీం విషయానికి వస్తే ఎడిటింగ్ ఎక్కడా బోర్ కొట్టనివ్వదు. శ్రీకాంత్ అరుపుల సినిమాటోగ్రఫీతో పల్లె అందాలను చక్కగా చూపించారు. చరణ్ అర్జున్ ఇచ్చిన సాంగ్స్, బీజీఎం సినిమాకు ప్రధాన బలం. నిర్మాణ విలువలు బాగున్నాయి.
ఫైనల్లీ, మోతెవరి లవ్ స్టోరీ ఎంగేజింగ్ ఎంటర్‌టైనర్ విత్ మెసేజ్.
Read Also : Vadde Naveen : వడ్డే నవీన్ రీ ఎంట్రీ.. ఫస్ట్ లుక్ రిలీజ్..