NTV Telugu Site icon

Neru Movie Review: ‘నెరు రివ్యూ’.. లాగిపెట్టి కొట్టాలనిపించేలా ప్రియమణి యాక్టింగ్

Neru

Neru

Mohan Lal-Jeethu Joseph’s Neru Movie Review: ఈ మధ్యకాలంలో మలయాళ సినిమాల మీద తెలుగు ప్రేక్షకులకు ఆసక్తి కనబరుస్తున్నారు. వారి ఆసక్తి చూసి చేస్తున్నారో ఏమో తెలియదు కానీ చాలా సినిమాలను మలయాళ సినిమాలకు రీమేక్స్ గా తెరకెక్కిస్తున్నారు మన తెలుగు ఫిలిం మేకర్స్. మనవాళ్లకు అంత కష్టం ఎందుకు అనుకున్నాయో ఏమో తెలియదు కానీ ఓటీటీ సంస్థలు మలయాళ సినిమాలను కొనుక్కొని ఐదు భాషల్లో డబ్బు చేసి రిలీజ్ చేస్తున్నాయి. అదే విధంగా ఈ మధ్యకాలంలో మలయాళం లో రిలీజ్ అయి సూపర్ హిట్గా నిలిచిన నెరు సినిమాని తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేసింది డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సంస్థ. ఓటీటీలో ప్రస్తుతం తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో స్ట్రీమ్ అవుతున్న ఈ సినిమా ఎలా ఉంది అనేది రివ్యూలో చూద్దాం.

నెరు కథ విషయానికి వస్తే
సినిమా ఓపెనింగ్ లోనే అంధురాలు అయిన సారా మహమ్మద్ (అనస్వరరాజన్) అత్యాచారానికి గురవుతుంది. కళ్ళు కనపడకపోవడంతో ఎవరు అత్యాచారం చేశారో కూడా తెలియని పరిస్థితుల్లో ఆమె ఉంటుంది. అయితే బంకమట్టితో శిల్పాలు చేసే కళ తన తండ్రి దగ్గర నేర్చుకున్న ఆమె తన మీద అత్యాచారం చేసిన వ్యక్తి శిల్పాన్ని సిద్ధం చేస్తుంది. ఆ శిల్పానికి దగ్గర పోలికలు ఉన్న ఒక వ్యక్తి నిన్న తన పక్కింటి అడ్రస్ అడుగుతూ వచ్చాడని ఆమె తండ్రి పోలీసులకు చెప్పడంతో పోలీసులు అనుమానంతో అతనిని అరెస్ట్ చేస్తారు. అతను ముంబైకి చెందిన ఒక ప్రముఖ పారిశ్రామికవేత్త ఏకైక కుమారుడు కావడం, త్వరలోనే కేంద్ర మంత్రి కుమార్తెను వివాహం చేసుకోవాల్సిన వ్యక్తి కావడంతో ఆ కేసు సంచలనంగా మారుతుంది. దీంతో క్లిష్టమైన కేసులను కూడా గెలిపించే సత్తా ఉన్న సుప్రీంకోర్టు లాయర్ రాజశేఖర్(సిద్ధిక్)ను మైకేల్ తండ్రి రంగంలోకి దించుతాడు. రాజశేఖర్ రంగంలోకి దిగిన వెంటనే చట్టంలో ఉన్న లోసుగులను ఉపయోగించి మైకేల్ కి బెయిల్ వచ్చేలా చేస్తాడు. ఈలోపు ఆమె కుటుంబం మీద ప్రలోభాల పర్వం కొనసాగిస్తారు కానీ ఆమె కేసు ఓడిపోయిన తాను వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదని తేల్చేస్తుంది. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ సలహా మేరకు అందురాలు తండ్రి ఒకప్పుడు రాజశేఖర్ దగ్గర పనిచేసి ఇప్పుడు పూర్తిగా లాయర్ ప్రాక్టీస్ మానేసిన విజయ మోహన్(మోహన్ లాల్) దగ్గరికి వెళ్తాడు. ముందు తానే కేసు తీసుకోను అని బలంగా చెప్పిన విజయ్ మోహన్ ఎందుకు ఈ కేసు వాదించేందుకు ఒప్పుకున్నాడు? ఒప్పుకున్న తర్వాత ఈ కేసును గెలిపించేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేశాడు? ఈ క్రమంలో విజయ మోహన్ రాజశేఖర్ కుమార్తె పూర్ణిమ మధ్య ఉన్న సంబంధం ఏమిటి? చివరికి అత్యాచారం చేసిన వ్యక్తికి శిక్ష పడుతుందా? అత్యాచారం చేసినట్లు ఎలా కోర్టు నమ్మింది? లాంటి విషయాలన్నీ తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ: మోహన్ లాల్- జీతూ జోసెఫ్ కాంబినేషన్ అనగానే కచ్చితంగా సినిమాలు ఫాలో అయ్యే అందరికీ దృశ్యం సినిమాలు గుర్తొస్తాయి. దృశ్యంలో ఇప్పటికి రెండు సినిమాలు వచ్చాయి. రెండు భాగాలు సూపర్ హిట్ గా నిలవడమే కాక మిగతా అన్ని భాషల్లో కూడా బాగా ఆడాయి ఈ నేపథ్యంలో వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా అనగానే అందరిలోనూ ఆసక్తి ఏర్పడింది. ఇక ఆ ఆసక్తిని ఏమాత్రం తగ్గకుండా సినిమాని డైరెక్ట్ చేయడంలో దర్శకుడు పూర్తిస్థాయిలో సఫలమయ్యాడు. అసలు ముందుగా క్యారెక్టర్లు కూడా ఎస్టాబ్లిష్ చేసే అవసరమే లేకుండా జరిగిన నేరం ఏమిటి? ఎలాంటి పరిస్థితిలు అక్కడ ఏర్పడ్డాయి అనే విషయాన్ని సూటిగా చెప్పగలిగే ప్రయత్నం చేసి అందులో సక్సెస్ అయ్యాడు. సినిమాటిక్ టచ్ కోసం ఏవేవో చేయకుండా కథకు సంబంధించిన అన్ని విషయాలు ప్రేక్షకుల ముందే పెట్టేసి ఈ కేసు ఎలా సాల్వ్ అవుతుందా అనే అనుమానాలు కలగజేసిన క్రమం బాగుంది. కంటి చూపు లేని ఒక యువతి తన మీద అత్యాచారం చేసిన వ్యక్తిని ఎలా కోర్టు దృష్టికి తీసుకువచ్చి అతని శిక్ష పడేలా చేసింది అనేది ఒక సరికొత్త పాయింట్. నిజానికి ఇలాంటి విషయం బయట జరిగితే నిజంగా దారుణానికి పాల్పడిన వ్యక్తికి శిక్ష పడుతుందా? అంటే ఎవరు అవునని చెప్పలేని పరిస్థితి. కానీ ఇక్కడ సినిమాలో మాత్రం శిల్పాలు చేయగల నైపుణ్యం ఉన్న యువతి అనే ఒక కొత్త పాయింట్ యాడ్ చేసి సినిమా మొత్తాన్ని నడిపిన తీరు ఆసక్తికరంగా ఉంటుంది. సినిమా మొత్తం మీద మోహన్ లాల్ ఎంట్రీ ఇచ్చే వరకు కాస్త సాగదీసిన ఫీలింగ్ కలుగుతుంది కానీ తర్వాత కాస్త వేగం పెరిగిన అనుభూతి వస్తుంది. ఇక ఆ తర్వాత కోర్టు రూమ్ డ్రామాగా సినిమానే నడిపించిన తీరు ఆకట్టుకునేలా ఉంది. అయితే తెలుగువారికి ఈ సినిమా అంత ఈజీగా కనెక్ట్ అవ్వడం కష్టమే. ఎందుకంటే ఇది ఓటీటీలో అందుబాటులో ఉంది కాబట్టి అందరూ చూడటానికి ఆసక్తి చూపించవచ్చు కానీ ఇదే సినిమా ధియేటర్లలో రిలీజ్ అయితే మాత్రం ఎంతవరకు ఆదరిస్తారనే విషయం మీద ఎవరూ క్లారిటీగా చెప్పలేని పరిస్థితి. కోర్ట్ రూమ్ డ్రామా మొదలైన తర్వాత వాది ప్రతివాదుల మధ్య జరిగిన వాదోపవాదాలు, చర్చలు మధ్యలో ఎదురయ్యే రోడ్డు బ్లాక్స్ వంటి వాటిని అవతలి పక్షం వారు పరిష్కరిస్తూ తీసుకొచ్చి సబ్మిట్ చేసే క్లూస్ ఆసక్తికరంగా అనిపిస్తాయి. అయితే ఎగ్జిక్యూషన్ లో ఎందుకో అంత ఆసక్తి కలిగించలేదు. సాధారణ ప్రేక్షకులు కాస్త తికమక గురయ్యే విధంగా సెక్షన్లు, కోర్టు వాదనలు ఒక సందర్భంలో అనిపిస్తాయి. మరీ ముఖ్యంగా మన తెలుగులో వచ్చిన వకీల్ సాబ్ సినిమా జ్ఞాపకం వచ్చినా ఆశ్చర్యం లేదు. అయితే మొత్తంగా చూసుకుంటే మాత్రం ఈ సినిమా ఒక మంచి కోర్టు రూమ్ డ్రామా అనిపించేలా సాగింది.

ఇక నటీనటుల విషయానికి వస్తే లాయర్ విజయ్ మోహన్ అనే పాత్రలో మోహన్ లాల్ ఒదిగిపోయాడు. మోసానికి గురై లాయర్ వృత్తికి దూరమైపోయి నిస్తేజంతో బతుకుతున్న వ్యక్తిగా మోహన్ లాల్ తనకు కొట్టిన పిండి లాంటి పాత్రలో ఈజ్ తో నటించాడు. ఇక ఆ తర్వాత నటనలో అంత స్కోప్ దొరికిన పాత్ర ప్రియమణిది. ఆమె కనిపించింది కొన్ని సీన్స్ లోనే అయినా బయట కనిపిస్తే కొట్టాలి అనిపించే అంతలా ఆమె నటన ఉంది. అంతలా ఆమె నటనతో ఆ పాత్ర మీద అసహ్యం కలిగించే ప్రయత్నం చేశారు. ఇక అనస్వర రాజన్ నటన చూస్తే తెలుగు వారు తీసుకొచ్చి మంచి మంచి హీరోయిన్ పాత్రలు ఇవ్వగలిగేలా ఆమె యాక్టింగ్ ఉంది. సిద్ధిక్, దినేష్ ప్రభాకర్ వంటి వారు తమ తమ పాత్రల పరిధి మీద ఆకట్టుకునేలా నటించారు. టెక్నికల్ విషయానికి వస్తే సినిమాటోగ్రఫీ ఆకట్టుకునేలా ఉంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా సినిమాకి సరిపడా ఉన్నట్టుంది. ఇక సినిమా నిర్మాణ విలువలు బాగున్నాయి. అనవసరమైన పాటలు లాంటివి లేవు.

ఫైనల్లీ: నెరు ఒక ఇంట్రెస్టింగ్ కోర్టు రూమ్ డ్రామా

Show comments