ఈ మధ్య కాలంలో టాలీవుడ్‌లో చిన్న సినిమాల హవా నడుస్తోంది. కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ప్రమోషనల్ కంటెంట్‌తో పాజిటివ్ వైబ్ క్రియేట్ చేసుకున్న ‘మిస్టీరియస్’ చిత్రం తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సీనియర్ నటుడు బ్రహ్మానందం వంటి వారు ఈ సినిమా ఈవెంట్‌కు రావడంతో సహజంగానే అంచనాలు పెరిగాయి. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో రివ్యూలో చూద్దాం.
మిస్టీరియస్ కథ:
సినిమా ప్రారంభమే ఒక సీరియస్ ఇన్వెస్టిగేషన్ మోడ్‌లో మొదలవుతుంది. కొండపూర్ ఎస్ఐ రాంఖీ అలియాస్ రామ్ కుమార్ (అబిద్ భూషణ్) అకస్మాత్తుగా అదృశ్యమవుతాడు. ఒక పోలీస్ ఆఫీసర్ మాయమవ్వడంతో డిపార్ట్‌మెంట్ అలర్ట్ అవుతుంది. ఈ కేసును ఛేదించే బాధ్యత ఏసీపీ ఆనంద్ సాయి (బలరాజ్ వాడి) భుజాన పడుతుంది. విచారణ మొదలు పెట్టాక ఆర్కిటెక్ట్ విరాట్ (రోహిత్ సాహ్ని), అతని భార్య శిల్ప (మేఘన రాజ్‌పుత్) చుట్టూ అనుమానాలు రేకెత్తుతాయి. అసలు ఎస్ఐ రాంఖీకి, ఈ దంపతులకు ఉన్న సంబంధం ఏంటి? విరాట్ కొత్తగా కొన్న విల్లాకు, ఈ మిస్సింగ్ కేసుకు లింక్ ఉందా? ఈ కథలోకి మిస్సిరా (రియా కపూర్) అనే పాత్ర ఎందుకు ప్రవేశించింది? చివరికి రాంఖీ ఏమయ్యాడు? అనే ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే ఈ ‘మిస్టీరియస్’ సినిమాని చూడాల్సిందే.
విశ్లేషణ
దర్శకుడు ఎంచుకున్న పాయింట్ రెగ్యులర్ ట్రయాంగిల్ లవ్ స్టోరీలా అనిపించినప్పటికీ, దానికి జోడించిన సస్పెన్స్, హర్రర్ ఎలిమెంట్స్ సినిమాకి బాగా ప్లస్ అయ్యాయి. ఎక్కువ సాగదీయకుండా సినిమా ప్రారంభమైన కొద్దిసేపటికే దర్శకుడు మెయిన్ ప్లాట్‌లోకి తీసుకెళ్లిపోయాడు. పాత్రల పరిచయానికి ఎక్కువ సమయం వృధా చేయకుండా, నేరుగా కేసు ఇన్వెస్టిగేషన్ ప్రారంభించడం ప్రేక్షకుడిని కథలో లీనం చేస్తుంది. ప్రతి ట్విస్ట్ తోనూ ఒక కొత్త సందేహాన్ని లేవనెత్తుతూ, అసలు హంతకుడు ఎవరనే ఉత్కంఠను క్లైమాక్స్ వరకు కొనసాగించడంలో దర్శకుడు సఫలమయ్యాడు. కేవలం క్రైమ్ థ్రిల్లర్‌గా మాత్రమే కాకుండా, సెకండాఫ్‌లో వచ్చే హర్రర్ ఎలిమెంట్స్ సినిమా ఇంటెన్సిటీని రెట్టింపు చేశాయి. ఇంటర్వెల్ బ్యాంగ్ సహా క్లైమాక్స్ ట్విస్ట్ ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురిచేస్తాయి. అయితే కొన్నిచోట్ల కొన్ని సీన్స్ రొటీన్ అనిపించేలా ఉన్నా సినిమాను ప్రేక్షకులను ఎంగేజ్ చేసేలా తెరకెక్కించడంలో దర్శకుడు చాలా వరకు సక్సెస్ అయ్యాడు.
నటీనటుల పనితీరు విషయానికి వస్తే సినిమాలో ప్రధాన పాత్రధారులు కొత్తవారైనప్పటికీ, తమ నటనతో ఆకట్టుకున్నారు. రోహిత్ సాహ్ని – మేఘన రాజ్‌పుత్ దంపతులుగా వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ మరియు సస్పెన్స్ సీన్స్‌లో వీరి నటన మెప్పించింది. మిస్సిరా పాత్రలో రియా కపూర్ ఒదిగిపోయింది. కథను మలుపు తిప్పే కీలక పాత్రలో ఆమె నటన సినిమాకు ప్లస్ అయ్యింది. ఎస్ఐ పాత్రలో అబిద్ తన మార్క్ చూపించాడు. బలరాజ్ వాడి అనుభవజ్ఞుడైన ఏసీపీగా సెటిల్డ్ పర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకున్నారు. జబర్దస్త్ ఫేమ్ రాజమౌళి మరియు గడ్డం నవీన్ తమకు ఉన్నంతలో నవ్వించే ప్రయత్నం చేస్తూనే, కథా గమనంలో భాగమయ్యారు.
సాంకేతిక విభాగం విషయానికి వస్తే ఎం.ఎల్. రాజా అందించిన నేపథ్య సంగీతం థ్రిల్లర్ సినిమాలకు ఉండాల్సిన గంభీరత్వాన్ని ఇచ్చింది. పాటలు కథలో అంతర్భాగంగా రావడం వల్ల ఎక్కడా స్పీడ్ బ్రేకర్లలా అనిపించవు. దేవేంద్ర సూరి విజువల్స్ బాగున్నాయి. ముఖ్యంగా విల్లాలో జరిగే సీక్వెన్స్‌లను కెమెరాలో బంధించిన తీరు హర్రర్ మూడ్‌ని క్రియేట్ చేసింది. ఎడిటింగ్ విషయంలో ఇంకాస్త జాగ్రత్త వహించి ఉంటే బాగుండేది. కొన్ని చోట్ల సాగతీతగా అనిపించే సీన్లను ట్రిమ్ చేయొచ్చు. సినిమా బడ్జెట్ పరిమితులకు లోబడి నిర్మాణ విలువలు బాగున్నాయి.
‘మిస్టీరియస్’ సస్పెన్స్ హర్రర్ సినిమాలను ఇష్టపడే వారికి నచ్చొచ్చు.