Miss Shetty Mr Polishetty Movie Review: అనుష్క నిశ్శబ్ధం తర్వాత నవీన్ పోలిశెట్టి హీరోగా మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమా చేస్తుందని వార్త బయటకు వచ్చినప్పుడు అందరూ షాక్ అయ్యారు. అనుష్క లాంటి పాన్ ఇండియా హీరోయిన్ నవీన్ పోలిశెట్టి లాంటి కుర్ర హీరో పక్కన సినిమా చేయడం ఏంటి? అని అందరూ అనుకున్నారు. అయితే సినిమా అనౌన్స్ చేసి చాన్నాళ్ళయింది, అయినా చడీ చప్పుడు లేకుండా ఉండడంతో ఒకానొక దశలో సినిమా నిలిపివేశారు అనుకున్నారు. అయితే ఎట్టకేలకు ఈ సినిమాకి రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడం, నవీన్ పోలిశెట్టి పిచ్చ పిచ్చగా రెండు రాష్ట్రాలు కలియ తిరగడం సినిమా మీద అంచనాలు ఏర్పడేలా చేసింది. దానికి తోడు ట్రైలర్ కట్ కూడా బాగుండటం తో ఒక వర్గం ప్రేక్షకులు సినిమా కోసం ఎదురు చూశారు. మరి అలాంటి వారందరి నిరీక్షణ ఫలిస్తూ సినిమాను ఈరోజు రిలీజ్ చేశారు. అయితే మరి సినిమా ఎలా ఉందనేది రివ్యూలో చూద్దాం.
మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి కథ:
అన్విత రవళి శెట్టి(అనుష్క శెట్టి) లండన్‌లో ఒక పేరుమోసిన చెఫ్. కెరీర్ పరంగా దూసుకుపోతున్నా పెళ్లి అంటే ఆమడ దూరం వెళ్ళిపోతూ ఉంటుంది. క్యానర్ తో బాధ పడుతున్న ఆమె తల్లి(జయసుధ) తాను పోయేలోపు పెళ్లి చేయాలని ఎన్ని పెళ్లి సంబంధాలు చూసినా అన్విత ససేమిరా అంటుంది. పెళ్లి చేసుకునే ఆలోచనే లేదని తల్లితో తెగేసి చెబితే చనిపోయే ముందు నాకు నువ్వు తోడుగా ఉన్నావు? నీకు తోడు ఎవరు ఉన్నారు? అని అడిగడంతో తనకు ఓ తోడు కావాలనే ఆలోచన అన్వితలో మొదలవుతుంది. తన తోడు కోసం ఓ బిడ్డను పెళ్లి చేసుకోకుండా ఐయూఐ పద్దతిలో కనాలనుకుంటుంది, ఈ మేరకు ఓ డాక్టర్‌ని సంప్రదించగా అందుకు ఓకే అంటాడు.
అయితే అన్విత తనకు నచ్చిన లక్షణాలు ఉన్న యువకుడిని స్పెర్మ్ డోనర్‌ని తనే వెతుకుతానని చెప్పి ఇండియా వస్తుంది. అయితే అలా వెతికే క్రమంలో స్టాండప్ కమెడియన్ గా మెరవాలని చూస్తున్న సిద్ధు (నవీన్ పోలిశెట్టి) పరిచయం అవుతాడు. అతని గురించి తెలుసుకునే క్రమంలో సిద్ధూ అన్వితతో ప్రేమలో పడతాడు. ప్రేమను ప్రపోజ్ చేసే సమయానికి అన్విత అసలు విషయం చెబుతుంది. అయితే అన్వితతో ప్రేమలో పడిన సిద్దు దాన్ని జీర్ణించుకోలేక షాక్ అవుతాడు. ఆ తరువాత అన్వితకి సహాయం చేశాడా? లేదా? అసలు అన్విత పెళ్లి చేసుకోకూడదని ఎందుకు ఫిక్స్ అయింది? చివరకు సిద్ధూ-అన్విత కలిశారా? లేదా? అన్విత ప్రెగ్నెంట్ అయిందా? అనేదే మిగతా కథ.
విశ్లేషణ:
ఒక్కమాటలో చెప్పాలంటే పెళ్లి కాకుండా తల్లి కావాలనుకుని ఒక యువకుడిని వెతికి పట్టుకునే ఓ బ్రాడ్ మైండ్ ఉన్న ఎన్నారై యువతి కథే ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’. నిజానికి ఈ మాట వింటే ఇదేంట్రా బాబు సమాజం ఎటు పోతుందో? ఎలాంటి సినిమాలు చేస్తున్నారో? అనుకుంటారు కానీ మీరు ఊహించింది కరెక్ట్ కాదు. మీరు విన్నట్టుగా కాకుండా ఈ సినిమాను ఆలోచింపచేసేలా, కుటుంబాలు అన్నీ కలిసి కూర్చుని చూసేలా తెరకెక్కించాడు డైరెక్టర్ మహేష్ బాబు. నిజానికి కొన్ని సీన్స్ లో డబుల్ మీనింగ్ జోక్స్ ఉన్నా, అవి పెద్దగా ఇబ్బంది పెట్టవు. పెళ్లి అనే ఒక అంశాన్ని ఎంచుకుని దాని చుట్టూనే కథ రాసుకుని ఒక సెన్సిటివ్ విషయాన్ని కూడా కామెడీ, ఎమోషన్స్‌తో చూపించే ప్రయత్నం చేశాడు.
ప్రేమించి పెళ్లి చేసుకుని, ఆ తరువాత నాలుగేళ్ల పాటు నరకం లాంటి రిలేషన్లో ఉన్న అమ్మానాన్నలను చూసిన ఒక కూతురు ఆ నరకం తనకు వద్దని అసలు పెళ్లి మీదే అసహ్యం పెంచేసుకుంటుంది. అయితే తల్లి తనను పెంచింది కాబట్టి ఆమె చివరి వరకు తాను ఉన్నాను, తన చివరి రోజుల్లో ఎవరో ఒకరు కావాలని బయలు దేరి అన్ని రిలేషన్స్ ఒకేలా ఉండవు, ముగియవు ని తెలుసుకుని రిలేషన్ లో అడుగుపెట్టేలా చూపించాడు డైరెక్టర్. నిజానికి ఒక మంచి మెసేజ్ ఇస్తూనే దానికి కామెడీ టచ్ ఇచ్చి, ఎమోషనల్ టచ్ ఇచ్చాడు. అయితే ముందు డోనర్ కోసం వెతుకుతూ వెళ్లిన అన్వితను డోనర్ కావలసిన సిద్దూ ప్రేమించడం, ఆ తరువాతి రాసుకున్న కొన్ని సీన్స్ బోర్ కొట్టించినా కామెడీతో కప్పేశారు. అన్వితను సిద్దూ ప్రేమించిన తర్వాత ఏం జరుగుతుందో ఈజీగా అర్థమైపోయేలా ఉన్న స్క్రీన్ ప్లే సినిమాకి మైనస్. నిజానికి సెకండాఫ్ కొంత లాగ్ అనిపించినా స్క్రీన్‌ప్లే విషయంలో ఇంకాస్త జాగ్రత్త వహిస్తే రిజల్ట్ వేరే లెవల్లో ఉండేది.
ఎవరెలా చేశారంటే..
ముందుగా నటీనటుల విషయానికి వస్తే టైటిల్ రోల్స్ లో ఉన్న అనుష్క, నవీన్ పోలిశెట్టి ఇద్దరూ అదర గొట్టేశారు. నవీన్ పోలిశెట్టి ఎలా అయితే ప్రమోషన్స్ ను భుజాన వేసుకుని నడిపించాడో సినిమాను కూడా వన్ మేన్ షోలా నడిపించాడు. చెఫ్ అన్విత రవళి శెట్టి అనే ఒక కంఫ్యూజ్డ్ మైండ్ ఉన్న అమ్మాయి పాత్రలో అనుష్క జీవించింది. తెరపై నటన విషయంలో ఆమెకు వంక పెట్టలేం, ఎమోషనల్ సీన్స్ లో అదరకొట్టింది కానీ ఎందుకో ఆమె కొన్ని సీన్స్ లో కొంచెం సన్నగా మరికొన్ని సీన్స్ లో కొంచెం బొద్దుగా అనిపించింది. ఆ విషయంలో కేర్ తీసుకుని ఉంటే బాగుండేది. హీరోయిన్ తల్లిగా జయసుధ ఎప్పటిలాగే తనకు బాగా అలవాటైన పాత్రలో నటించింది.
హీరో తల్లిదండ్రులుగా తులసి, మురళీ శర్మలు రొటీన్ పాత్రలు పోషించినా నవ్వించారు. హీరో స్నేహితుడిగా అభినవ్ గోమఠం, హీరోయిన్ స్నేహితురాలిగా సోనియాతో పాటు మిగిలిన నటీనటులు తమ తమ పాత్రల పరిధి మేర నటించారు. టెక్నికల్ అంశాల విషయానికొస్తే రధన్ పాటలు బాగున్నా, ఇంకా మంచి మ్యూజిక్ కి స్కోప్ ఉంది. గోపీ సుందర్ నేపథ్య సంగీతం సినిమాకు అదనపు అందాన్ని తెచ్చింది. నీరవ్ షా సినిమాటోగ్రఫీ కలర్ ఫుల్ గా అనిపించింది. స్క్రీన్ ప్లే విషయంలో డైరెక్టర్, నిడివి విషయంలో ఎడిటర్ కలిసి వర్కౌట్ చేసి ఉంటే సినిమా వేరే లెవల్లో ఉండేది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్
అనుష్క శెట్టి
నవీన్ పోలిశెట్టి
కొత్తగా ఉన్న స్టోరీ లైన్
సాంగ్స్
మైనస్ పాయింట్స్
స్క్రీన్ ప్లే
నిడివి
ఫైనల్ గా:
మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి ఔట్ అండ్ ఔట్ కామెడీ ఎంటర్టైనర్. యూత్, ఫామిలీస్ కి బాగా నచ్చుతుంది. మాస్ ఆడియన్స్ కి కూడా ఎక్కితే మరో జాతి రత్నాలు ఖాయం.