NTV Telugu Site icon

Mechanic Rocky Review: విశ్వక్ సేన్ ‘మెకానిక్ రాకీ’ రివ్యూ!

Mechanic Rocky Review

Mechanic Rocky Review

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటించిన తాజా చిత్రం ‘మెకానిక్ రాకీ’. డెబ్యుటెంట్ డైరెక్టర్ రవితేజ ముళ్లపూడి దర్శకత్వం వహిస్తున్న చిత్రంలో మీనాక్షి చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్స్ గా నటించారు. ఈ మూవీని ఎస్‌ఆర్‌టి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రామ్ తాళ్లూరి నిర్మించగా సినిమా ఫస్ట్ గేర్, ట్రైలర్స్, సాంగ్స్ తో సినిమా హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది. దానికి తోడు విశ్వక్ చేసిన భిన్నమైన ప్రమోషన్స్ ఈ సినిమా మీద ప్రేక్షకులలో అంచనాలు పెంచాయి. ఆ అంచనాలతో ఈ సినిమా నవంబర్ 22న విడుదల అయింది. అలా ప్రేక్షకుల ముందుకు వచ్చేసిన ఈ సినిమా ఎలా ఉంది? ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది? అనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం పదండి.

కథ:
రాయలసీమ నుంచి వలస వచ్చిన నాగిరెడ్డి(విశ్వక్ సేన్) స్థాపించిన గ్యారేజ్ ను మలక్ పేటలో నగుమోము రామకృష్ణ (నరేష్) నడుపుతూ ఉంటాడు. కొడుకు రాకేష్ అలియాస్ రాకీ( విశ్వక్)కి చదువు అబ్బక పోవడంతో ఆర్.కె గ్యారేజ్ మరియు డ్రైవింగ్ స్కూల్ బాధ్యతలు అప్ప చెప్పి పక్కనే ఉండి వేలు పట్టుకుని నడిపిస్తూ ఉంటాడు రామకృష్ణ. తండ్రి ఉండడంతో ఎలాంటి బాధ్యతలు పట్టక లైఫ్ ఎంజాయ్ చేస్తుంటాడు మెకానిక్ రాకీ. అతడి జీవితంలోకి అనుకోకుండా ఎంట్రీ ఇస్తాడు రంకిరెడ్డి (సునీల్), ఆ కారణంగా ఎన్నో సమస్యలు కూడా ఎదురవుతాయి. అయితే ఆ సమస్యల నుండి గట్టెక్కించడానికే అన్నట్టు అతని లైఫ్ లోకి ఎంట్రీ ఇస్తుంది మాయ (శ్రద్ధ శ్రీనాధ్). డ్రైవింగ్ నేర్చుకోవడానికి వచ్చిన ఆమె ఇచ్చిన కొన్ని సలహాలతో ముందుకు వెళ్లిన రాకీకి ఏమైంది అసలు రాకీకి రంకి రెడ్డి వలన వచ్చిన సమస్య ఏమిటి? ఆ సమస్య నుంచి బయటపడదానికి మాయ ఎలా, ఎందుకు సహాయపడింది? అసలు ఈ మాయ ఎవరు? రాకీ లవ్ ఇంట్రెస్ట్ ప్రియ(మీనాక్షి చౌదరి)కి ఈ సినిమాలో ఉన్న ప్రాధాన్యత ఏమిటి? అనే విషయాలు తెలియాలంటే “మెకానిక్ రాకీ”ను బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే.

విశ్లేషణ:
ఈ సినిమా కథ ప్రకారంగా చూస్తే కొత్త కథ అని చెప్పలేము. కానీ ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా తెరకెక్కించే విషయంలో మాత్రం దర్శకుడు దాదాపు సఫలమయ్యారు. ఫస్ట్ హాఫ్ లో సినిమా కధ మొత్తాన్ని ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేశాడు దర్శకుడు. అయితే అక్కడే కాస్త తడబడిన ఫీలింగ్ కలుగుతుంది. ఎందుకంటే సినిమా మొత్తాన్ని కామెడీ ఎంటర్టైనర్ గా ప్రేక్షకులు ముందు తీసుకొస్తున్నాడేమో అని అనుమానం కలిగించేలా ఉంది. ఫస్ట్ హాఫ్ మొత్తం ఇలాగే కామెడీగా సాగిపోతూ ఉంటుంది. తర్వాత సెకండ్ హాఫ్ మొదలైన తర్వాత ప్రేక్షకులు ఊహించని విధంగా వచ్చే ట్విస్టులు ఆకట్టుకుంటాయి. అయితే రెగ్యులర్ సినిమా లవర్స్ మాత్రం ఈజీగా గుర్తుపట్టేలా ఈ ట్విస్టులు ఉండడం కొంత మైనస్ అయ్యే అంశం. నిజానికి దర్శకుడు రవితేజ ముళ్ళపూడి ఎంచుకున్న కథలో మంచి డెప్త్ ఉండడమే కాదు జనానికి కనెక్ట్ అయ్యే మంచి పాయింట్ ఉంది. ఈ క్రమంలో కథలో కామెడీని ఇరికించకుండా మంచి థ్రిల్లర్ లా తెరకెక్కించి ఉంటే మరో రేంజ్ లో ఉండేదేమో. నిజానికి ఈ సినిమా కథ ప్రేక్షకులను ఎంగేజ్ చేయడానికి మంచి స్కోప్ ఉన్న కథ. ఫస్టాఫ్ కథను ఎస్టాబ్లిష్ చేయడానికి వదిలేసినా సెకండాఫ్ మాత్రం బాగుంది. ఇన్సూరెన్స్ ఫ్రాడ్స్, ఆన్లైన్ సైబర్ మోసాలు వంటి అంశాలను చర్చిస్తూనే ప్రేక్షకులను ఒకపక్క ఎంటర్టైన్ చేసే ప్రయత్నం చేస్తూ మరోపక్క ఆలోచింపచేసే విధంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం అభినందనీయం.

ఇక నటీనటుల విషయానికి వచ్చేసరికి:
విశ్వక్ సేన్ కి ఈ తరహా పాత్రలు అలవాటే ఈ సినిమాలో కూడా రాకీ పాత్రను చాలా ఈజ్ తో చేసేశాడు. నటన విషయంలో కష్టపడినట్లు కనిపించలేదు. కామెడీ సీన్స్ తో పాటు రొమాన్స్ విషయంలో కూడా ఆకట్టుకున్నాడు. ఇక శ్రద్ధ శ్రీనాధ్ ఈ సినిమా ఎందుకు ఓప్పుకుంది అనేది “మెకానిక్ రాకీ” చూశాక కానీ మీకు అర్థం కాదు. ఫస్టాఫ్ లో ఇదేంట్రా అనిపించే ఆమె పాత్ర ట్విస్ట్ తో ఆకట్టుకుంటుంది. మీనాక్షి చౌదరికి కూడా మంచి డెప్త్ ఉన్న పాత్ర దొరికింది. ఇక నరేష్, వైవాహర్ష, హర్షవర్ధన్, రోడిస్ రఘు వంటి వాళ్లు తమ పాత్రల పరిధి మేరకు నటించారు. టెక్నికల్ టీం విషయానికి వస్తే ఈ సినిమాకి ప్రధానమైన ఆదర్శన బ్యాగ్రౌండ్ స్కోర్. జేక్స్ బిజాయ్ ఈ సినిమాకి కూడా ఒక రేంజ్ ఎలివేషన్స్ ఇచ్చేలా బ్యాగ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు. కొన్ని పాటలు కూడా వినడానికి బాగున్నాయి. సినిమాటోగ్రఫీ సినిమా మొత్తాన్ని వేరే రేంజికి తీసుకువెళ్ళింది. ఎడిటింగ్ విషయంలో ఇంకొంచెం కేర్ తీసుకుంటే బాగుండేది. డైలాగ్స్ విషయంలో కూడా పెద్దగా బుర్రకు పదులు పెట్టే అవకాశం లేకుండా ప్రేక్షకులను ఎంగేజ్ చేసేలా రాసుకున్నారు. ఇక రవితేజ కూడా ఫస్ట్ టైమ్ డైరెక్షన్ అని ఎక్కడ అనుమానం వచ్చే విధంగా చేయలేదు. అయితే ఫస్టాఫ్ విషయంలో ఇంకాస్త జాగ్రత్త తీసుకొని ఉంటే సినిమా కచ్చితంగా వేరే స్థాయిలో ఉండేది అనడంలో ఎలాంటి సందేహం లేదు. నిర్మాణ విలువలు అత్యద్భుతంగా ఉన్నాయి.

ఫైనల్లీ:
మెకానిక్ రాకీ ఒక పైసా వసూలు ఎంటర్ టైనర్.. కానీ కిండిషన్స్ అప్లై