నటుడు నందు హీరోగా నటించిన తాజా చిత్రం ‘సైక్ సిద్ధార్థ’ జనవరి 1న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా జరిగిన ప్రచార కార్యక్రమాల్లో నందు తన గత చేదు జ్ఞాపకాలను గుర్తు చేసుకుని భావోద్వేగానికి గురయ్యారు. తను చేయని తప్పుకు తన పేరును వివాదాల్లోకి లాగడం, ఆ సమయంలో అనుభవించిన మానసిక వేదనను ఆయన పంచుకున్నారు. ముఖ్యంగా ఆ క్లిష్ట పరిస్థితుల్లో తన భార్య, ప్రముఖ సింగర్ గీతా మాధురి ఇచ్చిన మద్దతు గురించి చెబుతూ.. “మనకు బ్యాక్‌గ్రౌండ్ లేకపోతే ఇలాంటి ఇబ్బందులు వస్తాయని, అన్నీ వదిలేసి వేరే దేశానికి వెళ్లిపోయి హోటల్‌లో అయినా పని చేసుకుని బతుకుదాం” అని ఆమె అన్న మాటలు తనను ఇప్పటికీ కన్నీరు పెట్టిస్తాయని నందు ఆవేదన వ్యక్తం చేశారు.
Also Read : Varanasi : 3000 ఏళ్ల నాటి యుద్ధ విద్యతో మహేష్ బాబు విశ్వరూపం.. రాజమౌళి మాస్టర్ ప్లాన్ ఇదే!
ఇండస్ట్రీలో నెపోటిజం మరియు తన కెరీర్ ప్లానింగ్ గురించి కూడా నందు స్పష్టత ఇచ్చారు. గతంలో కేవలం డబ్బు కోసమే కొన్ని తప్పుడు కథలను ఎంచుకున్నానని, ఆ ప్రభావం తన కెరీర్‌పై పడిందని ఆయన నిజాయితీగా ఒప్పుకున్నారు. అందుకే మూడేళ్ల విరామం తీసుకుని, ఈసారి మంచి కంటెంట్‌తో ‘సైక్ సిద్ధార్థ’ సినిమా చేశానని తెలిపారు. నెపోటిజం వల్ల అవకాశాలు రావచ్చు కానీ, ప్రతిభ ఉంటేనే ప్రేక్షకులు ఆదరిస్తారని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ కొత్త సినిమాతో తప్పకుండా తనకంటూ ఒక మంచి గుర్తింపు వస్తుందని నందు ధీమా వ్యక్తం చేశారు