Massoda Movie Review: సక్సెస్ ఫుల్ మూవీస్ ‘మళ్ళీ రావా’, ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’తో నూతన దర్శకులను పరిచయం చేశారు నిర్మాత రాహుల్ యాదవ్ నక్కా. తాజాగా ఆయన తన మూడో చిత్రం ‘మసూద’ దర్శకత్వ బాధ్యతలనూ కొత్త దర్శకుడు సాయికిరణ్ కు అప్పగించారు. శుక్రవారం జనం ముందుకు వచ్చిన ఈ హారర్ మూవీని ప్రముఖ నిర్మాత, పంపిణీ దారుడు ‘దిల్’ రాజు విడుదల చేయడం విశేషం.
ఈ మధ్య కాలంలో తెలుగులో అసలు సిసలైన హారర్ మూవీస్ రాలేదు. ఆ జానర్ లో వచ్చిన వాటిలో చాలా వరకూ హారర్ ఎంటర్ టైనర్సే ఉన్నాయి. ఈ నేపథ్యంలో అవుట్ అండ్ అవుట్ హారర్ మూవీని థియేటర్లలో చూస్తే ఎలా ఉంటుందో ‘మసూద’తో తెలియచేశారు దర్శక నిర్మాతలు సాయికిరణ్, రాహుల్ యాదవ్. నిజానికి కథగా చెప్పుకోవాలంటే… ఇది చాలా సింపుల్ స్టోరీ. సింగిల్ మదర్ నీలమ్ (సంగీత) సైన్స్ టీచర్ గా పని చేస్తుంటుంది. భర్త అబ్దుల్లా (సత్య ప్రకాశ్)తో విడిపోయి, కూతురు నజియా (బాంధవి శ్రీధర్)తో జీవితాన్ని సాగిస్తుంటుంది. ఆమె ఉంటే అపార్ట్ మెంట్ లోనే పక్క ఫ్లాట్ లో ఉండే గోపీ కృష్ణ (తిరువీర్) ఈ తల్లీ కూతుళ్ళకు చేదోడు వాదోడుగా ఉంటాడు. సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అయిన గోపీకి తన కోలిగ్ మిని (కావ్య కళ్యాణ్ రామ్) అంటే ఇష్టం. కానీ ఆ విషయం చెప్పడానికి మొహమాట పడుతుంటాడు. ఇలాంటి సమయంలో నజియాకు దెయ్యం పట్టిందనే విషయాన్ని నీలమ్, గోపీ తెలుసుకుంటారు. నజియాను ఆవహించిన ఆత్మ ఎవరిది? ఎలా అది ఆమెలో ప్రవేశించింది? దాన్ని పారద్రోలటానికి గోపీ సాయంతో నీలమ్ ఏం చేసింది? దుష్ఠశక్తిని వదిలించడానికి అల్లావుద్దీన్ (‘సత్యం’ రాజేశ్), రిజ్వాన్ (‘శుభలేఖ’ సుధాకర్) ఎలాంటి చర్యలు తీసుకున్నారన్నదే మిగతా కథ.
సహజంగా ఇంతవరకూ తెలుగులో వచ్చిన హారర్ థ్రిల్లర్ మూవీస్ అన్నీ కూడా హిందువుల పక్షానే సాగాయి. మనిషి శరీరంలో ప్రవేశించిన దుష్ఠశక్తిని వదలగొట్టడానికి మంత్రగాళ్ళంతా దేవతలను, అమ్మవార్లనే ఆరాధిస్తూ వచ్చేవారు. ఫర్ ఏ ఛేంజ్… ఇది ముస్లిం కమ్యూనిటీకి సంబంధించిన దెయ్యం కథ. ‘మసూద’ అనే మంత్రగత్తె ఓ ముస్లిం కుటుంబాన్ని ఎలా నాశనం చేసింది? ఊరు ఊరంతటినీ ఎలా వల్లకాడు చేసింది? చనిపోయిన తర్వాత కూడా ఆమె ఆత్మ తిరిగి నజియా అనే యువతిని పట్టుకుని ఎలాంటి అరాచకం సృష్టించాలనుకుంది? అనే అంశాలను చాలా ఆసక్తికరంగా దర్శకుడు సాయి కిరణ్ తెరకెక్కించాడు. సినిమా ప్రారంభం నుండి ముగింపు వరకూ ఉత్కంఠభరితంగా ఇది సాగిపోయింది. దానికి నగేశ్ బానెల్ సినిమాటోగ్రఫీతో పాటు ముఖ్యంగా ప్రశాంత్ ఆర్ విహారి నేపథ్య సంగీతం బాగా తోడయ్యింది. జెస్విన్ ప్రభు ఎడిటింగ్ కూడా చాలా బాగుంది. సన్నివేశాలను ప్రెజెంట్ చేసిన తీరు అద్భుతం. అయితే… నిడివి విషయంలో దర్శకుడు కొంత రాజీ పడి ఉండాల్సింది. మరీ ముఖ్యంగా ద్వితీయార్థంలోనూ, పతాక సన్నివేశంలోనూ ఎడిటర్ కు కాస్తంత స్వేచ్చను ఇచ్చి ఉంటే… మూవీ మరింత ఇంట్రస్టింగ్ గా ఉండేది. అలానే ప్రథమార్థంలోనూ కొన్ని సన్నివేశాలను తొలగించి ఉంటే, మూవీ రన్ టైమ్ కొంతలో కొంత తగ్గి ఉండేది. రామ్ కిషన్, స్టంట్ జాషువా సమకూర్చిన యాక్షన్ ఎపిసోడ్స్ థ్రిల్ కు గురిచేశాయి. క్రాంతి ప్రియం కళా దర్శకత్వం చాలా నేచురల్ గా ఉంది. సాంకేతిక నిపుణుల నుండి రాబట్టుకున్న పనితనం, నటీనటులను ఉపయోగించుకున్న తీరు చూస్తే ఇది సాయికిరణ్ కు మొదటి సినిమా అనే భావనే కలగదు.
నటీనటుల విషయానికి వస్తే సంగీత నటన చాలా సహజంగా, చక్కగా ఉంది. సింగిల్ పేరెంట్ గా ఆమె ఆ పాత్రకు చక్కని న్యాయం చేకూర్చింది. ఆమె కూతురు నజియా పాత్రలో బాంధవి శ్రీధర్ ఒదిగిపోయింది. బాలనటిగా పలు చిత్రాలలో నటించిన కావ్య కళ్యాణ్ రామ్ ఇందులో కథానాయిక మిని గా మెప్పించింది. నిజానికి ఆమె పాత్రకు తగిన ప్రాధాన్యం లేదు. ఉన్నంతలో బాగానే చేసింది. ఇక ఇప్పుడిప్పుడే నటుడిగా గుర్తింపు తెచ్చుకుంటున్న తిరువీర్… గోపీకృష్ణగా చక్కని అభినయం ప్రదర్శించాడు. అతనిలోని అమాయకత్వం, అతని నోటి నుండి వచ్చిన సంభాషణలు థియేటర్ లో నవ్వుల పువ్వులు పూయించాయి. హీరో స్నేహితుడిగా కృష్ణతేజ తనదైన బాడీ లాంగ్వేజ్ తో అలరించాడు. ముస్లిం మంత్రగాళ్ళుగా ‘సత్యం’ రాజేశ్, ‘శుభలేఖ’ సుధాకర్ చక్కగా నప్పారు. అయితే వారి సంభాషణలల్లో కాస్తంత ఉర్దూ స్లాంగ్ ను మిక్స్ చేసి ఉండాల్సింది. ఇతర ప్రధాన పాత్రలను సత్యప్రకాశ్, అఖిలా రామ్, సురభి ప్రభావతి, కార్తీక్ అడుసుమిల్లి, సూర్యారావు తదితరులు పోషించారు.
‘మళ్ళీరావా’తో గౌతమ్ తిన్ననూరిని, ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’తో ఆర్.ఎస్.జె. స్వరూప్ ను దర్శకులుగా పరిచయం చేశారు రాహుల్ యాదవ్ నక్కా. వాళ్ళిద్దరూ చక్కని విజయాలనే అందించారు. అయితే ఇది ఆ సినిమాల మాదిరిగా జనరల్ ఆడియెన్ కు నచ్చే సబ్జెక్ట్ కాదు. హారర్ జానర్స్ వారికి మాత్రమే ఇలాంటి సినిమాలు ఎక్కుతాయి. ఇంత ఇంటెన్సిటీ, హ్యూజ్ వయొలెన్స్ ఉన్న సినిమాలను అందరూ పెద్దంతగా ఇష్టపడరు. బట్… హారర్ మూవీస్ ను అభిమానించే వారికి ‘మసూద’ ఓ కొత్త అనుభూతిని కలిగిస్తుంది చెప్పొచ్చు.
రేటింగ్: 3 / 5
ప్లస్ పాయింట్స్
ఎంచుకున్న నేపథ్యం
ఆర్టిస్టుల నటన
ప్రొడక్షన్ వాల్యూస్
మైనెస్ పాయింట్స్
గ్రిప్ కోల్పోయిన ద్వితీయార్థం
లెంగ్తీ క్లయిమాక్స్
ట్యాగ్ లైన్: డిఫరెంట్ ఎక్స్ పీరియన్స్!