Abraham Ozler Review: ఈ మధ్య థ్రిల్లర్ మూవీస్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. సస్పెన్స్.. చివరి వరకు విలన్ ఎవరు తెలియకుండా.. మూడు గంటలు థియేటర్ లో కూర్చోపెట్టగలిగే సినిమాలు చాలా తక్కువ వస్తున్నాయి. అయితే ఆ తక్కువ సినిమాల్లో అబ్రహాం ఓజ్లర్ ఒకటి. మలయాళ సినిమాలు ఈ మధ్య మంచి కంటెంట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ అందుకుంటున్నాయి. ఇక ఓజ్లర్ కూడా ఆ కేటగిరిలోకే వస్తుంది. తెలుగులో అల వైకుంఠపురం, గుంటూరు కారం లాంటి సినిమాల్లో హీరోలకు తండ్రిగా నటిస్తూ మెప్పిస్తున్న జయరాం ఈ సినిమాలో టైటిల్ రోల్ లో నటించాడు. మమ్ముట్టి ఒక కీలక పాత్రలో నటించడంతో సినిమాపై మరింత ఆసక్తి కలిగింది. రణధీర్ కృష్ణన్ కథ అందించగా మిథున్ థామస్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా జనవరి 11 న ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకుంది. ఇక దాదాపు రెండు నెలల తరువాత ఓటిటీ బాట పట్టిన ఈ చిత్రం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో అన్ని భాషల్లో స్ట్రీమింగ్ అవుతుంది. క్రైమ్ థ్రిల్లర్ నచ్చేవారికి పర్ఫెక్ట్ ఛాయిస్ అని చెప్పొచ్చు.
అబ్రహం ఓజ్లర్ కథ : అబ్రహం ఓజ్లర్(జయరాం) ఒక పోలీసాఫీసర్. రెండు రోజులు ఆఫీస్ కు లీవ్ పెట్టి భార్యాపిల్లలతో వెకేషన్ కు వెళ్తాడు. అక్కడ అతనికి ఒక ఫోన్ కాల్ వస్తుంది. అర్జెంట్ కేసు అని చెప్పడంతో అర్ధరాత్రి భార్యాపిల్లలను ఒంటరిగా వదిలేసి బయల్దేరతాడు ఓజ్లర్. కానీ, సగం దూరం వెళ్లేసరికి అతనికి వచ్చింది ఫేక్ కాల్ అని తెలుస్తోంది. వెంటనే వెనక్కి వెళ్లగా.. అక్కడ భార్య, కూతురు కనిపించరు. ఓజ్లర్.. వినీత్( అర్జున్ అశోకన్) అనే కుర్రాడిని అన్యాయంగా అరెస్ట్ చేసి జైలుకు పంపించడంతో.. రివెంజ్ తీర్చుకోవడానికి ఓజ్లర్ భార్య, కూతురును కిడ్నాప్ చేసి చంపేసినట్లు చెప్తాడు. కానీ, వారి శవాలు ఎక్కడ ఉన్నాయి అనేది మాత్రం చెప్పడు. కట్ చేస్తే ఏళ్ళు గడిచిపోతాయి. భార్య, కూతురు చనిపోయారు అన్న బాధతో ఓజ్లర్ నిద్రపోకపోవడంతో అతడికి కొన్ని సమస్యలు వస్తాయి. ఇక ఇలా ఉండగా.. ఒక ఐటీ ఉద్యోగి హత్యకేసును ఓజ్లర్ ఛేదించడానికి పూనుకుంటాడు. ఈ ఉద్యోగి చనిపోయినట్టే మరో ముగ్గురు కూడా చనిపోతారు. దీంతో ఈ కేసును సీరియస్ గా తీసుకున్న ఓజ్లర్ ఎలా ఈ కేసును ఛేదించాడు. అసలు ఆ హత్యలు ఎవరు చేస్తున్నారు.. ? అలెగ్జాండర్ జోసెఫ్(మమ్ముట్టి) ఎవరు.. ? అతని గతం ఏంటి.. ? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.
విశ్లేషణ: సినిమా మొత్తం చాలా సస్పెన్స్ గా అనిపిస్తుంది. అసలు విలన్ ఎవరు.. ? ఎందుకు వీళ్లందరినీ చంపుతున్నాడు.. ? అని ఎవరు ఊహించలేరు. ఎన్నో ప్రశ్నలు .. వాటిని ఒక్కొక్కటిగా డైరెక్టర్ విప్పుతూ వచ్చిన తీరు ఆకట్టుకుంటుంది. సినిమా మొత్తంలో హంతకుడు దొరికాడు అనుకొనేలోపు.. అతడు కాదు అని తెలిసిపోతుంది. స్నేహితుల మధ్య ఉండే గొడవలు, ఈగో, డబ్బు వలన పేదవారి జీవితాలు ఎలా మారతాయి.. ? ప్రేమించినవాడు ఇక తిరిగిరాడు అని తెలిసి ఆ ప్రేమికురాలు తీసుకున్న కఠిన నిర్ణయం, ఇలా ఎన్నో ప్లాట్స్ ను డైరెక్టర్ ఇందులో చూపించాడు.
ఇక నటీనటుల విషయానికి వస్తే అబ్రహం ఓజ్లర్ గా జయరామ్ ప్రాణం పెట్టేశాడు. భార్యాబిడ్డలను కాపాడుకోలేని ఒక పోలీస్ గా, ఒంటరి జీవితాన్ని గడుపుతున్నా కూడా.. తన కర్తవ్యాన్ని నిర్వరిస్తూ హంతకుడును పట్టుకున్న తీరు ఆకట్టుకుంటుంది. అలెగ్జాండర్ గా మమ్ముట్టి గెస్ట్ రోల్ అని చెప్పాలి. ఇక ఉన్నంతసేపు అదరగొట్టేశాడు. అసలు మమ్ముట్టి ఎంట్రీ సీన్ అయితే గూస్ బంప్స్ అని చెప్పాలి. ఈ రెండు క్యారెక్టర్స్ తరువాత బలమైన క్యారెక్టర్ అంటే..వినీత్ అని చెప్పాలి. అర్జున్ అశోకన్.. రోమాంచమ్, భ్రమయుగం సినిమాలతో మంచి హిట్స్ అందుకున్న ఈ కుర్ర నటుడు ఇందులో కూడా అదరగొట్టేశాడు. ఇక కాలేజ్ టైమ్ లో ఉన్న యువకులు కూడా అదరగొట్టేశారు. చివర్లో తన భార్యాబిడ్డలు బతికే ఉన్నారు అని తెలుసుకున్న ఓజ్లర్.. వారిని కనిపెడతానని వినీత్ కు ఛాలెంజ్ చేయడంతో సినిమా ముగుస్తుంది. మొదటి నుంచి కూడా అందరూ.. ఓజ్లర్ భార్య, కూతురు చనిపోయారనే అనుకుంటారు.. కానీ, వారు బతికి ఉన్నారని చెప్పి సెకండ్ పార్ట్ కు లీడ్ ఇచ్చారు. ఇక డైరెక్టర్ కథను మలిచిన విధానం ఎంతో ఆకట్టుకుంటుంది. ఎక్కడా.. విలన్ ను రివీల్ చేయకుండా.. ప్రేక్షకులు కన్విన్స్ అయ్యే గతంతో.. ఎలాంటి చెత్త యాడ్ చేయకుండా ఎంతో అద్భుతంగా తెరకెక్కించాడు. త్రిసూర్, పాలక్కాడ్, కోయంబత్తూర్ మరియు వాయనాడ్‌లలో ఈ సినిమాను తెరకెక్కించారు. ఆ లొకేషన్స్ కూడా ఎంతో అద్భుతంగా చూపించారు.
ఫైనల్లీ ఆలస్యం చేయకుండా వీకెండ్ లో ఈ క్రైమ్ థ్రిల్లర్ ను అస్సలు మిస్ అవ్వకుండా చూసేయండి.