ప్రేమలు హీరోయిన్ మమిత బైజు ప్రధాన పాత్రలో అక్షయ్ హీరోగా ఐశ్వర్య హీరోయిన్ గా నటించిన సినిమా డియర్ కృష్ణ. పిఎన్బి సినిమాస్ బ్యానర్ పై రూపొందిన ఈ మలయాళ సినిమాను తెలుగులో జనవరి 24న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు.
కథ:
హీరో అక్షయ్(అక్షయ్) కాలేజ్ లో చదువుతూ ఉంటాడు. తండ్రి బాలకృష్ణ(అవినాష్) రియల్ ఎస్టేట్ వ్యాపారి కాగా ఇద్దరిదీ స్నేహితుల్లాంటి బంధం. అయితే అక్షయ్ జీవితంలోకి హీరోయిన్ రాధిక(ఐశ్వర్య) వస్తుంది. వీరి ప్రేమకు హీరో తండ్రి సలహాలు ఇస్తూ సపోర్ట్ చేస్తుంటాడు కానీ రాధిక తల్లిదండ్రులకు ఇది నచ్చదు. అయితే ఇదిలా సాగుతూ ఉండగా హీరోకి ఒక అనారోగ్య సమస్య బయటపడుతుంది. మొదట్లో ఇది చిన్న సమస్యనే అనుకున్నప్పటికీ కొన్ని టెస్టులు రిపోర్టుల తర్వాత ఇది ప్రాణాంతకమైన జబ్బని డాక్టర్స్ చెప్తారు. అయితే ఆ జబ్బు ఏంటి? ఆ జబ్బు నుంచి అక్షయ్ ఎలా బయటపడ్డారు.? డాక్టర్ చేతులెత్తేసిన అక్షయ్ జబ్బు ఎలా పరిష్కరించబడింది.? ఇక అక్షయ్ ప్రేమను దక్కించుకున్నాడా? లేదా ? అనేది తెలియాలంటే డియర్ కృష్ణ సినిమా బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే.
విశ్లేషణ:
ఇది రీల్ స్టోరీ కాదు, రాయల్ స్టోరీ. హీరో అక్షయ్ జీవితంలో 2015లో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కించారు. వైద్య చరిత్రలోనే ఇది ఒక అరుదైన కేసుగా.. ఇలాంటి సమస్యకు వైద్యులు మాత్రమే కాకుండా దైవ శక్తి కూడా తోడైందనే పాయింట్ ను నమ్మి.. అదే పాయింట్ తో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తెచ్చారు. ఇక ఫస్ట్ హాఫ్ అక్షయ్ లైఫ్ స్టైల్, వాళ్ళ అమ్మానాన్నల మధ్య ఉన్న రిలేషన్ షిప్, ఫ్రెండ్షిప్, కాలేజీ లైఫ్, స్టైల్లను పరిచయం చేశారు. అలాగే హీరోయిన్ ఐశ్వర్య, అక్షయ్ ల మధ్య లవ్ ట్రాక్ చూపించారు. ఇక అక్షయ్ కున్న ఆరోగ్య సమస్య బయటపడిన తర్వాత అసలైన కథ మొదలవుతుంది. హీరో హీరోయిన్ల మధ్య వచ్చే లవ్ ట్రాక్ యూత్ ను ఆకట్టుకునేలా రాసుకోవడమే కాదు సమస్యలను కూడా చాలా ప్రాక్టికల్ గా చూపించారు. అక్షయ్ ఆరోగ్య సమస్యతో ఇంటర్వెల్ బ్యాంగ్ కట్ చేసి సెకండాఫ్ అంతా మెడికల్ బ్యాక్ డ్రాప్ లో ఎమోషనల్ పాయింట్స్ ను టచ్ చేస్తూ.. దైవభక్తి ప్రధానంగా నడిపించారు. సెకండాఫ్ చాలా వరకు ఆసుపత్రిలోనే ఉంటుంది. బోర్ కొట్టకుండా లోతైన భావోద్వేగాలను పండించడానికి ప్రయత్నించారు కానీ అది పూర్తి స్థాయిలో పండ లేదు. సినిమా చూస్తున్నంత సేపు హీరో అక్షయ్ కి ఏమవుతుందో అన్న ఒక టెన్షన్ ను క్రియేట్ చేయడంలో తడబాటు కనిపించింది. ఇక సెకండాఫ్ లో భావోద్వేగాలను ఇంకా బలంగా రాసుకుని ఉంటే బాగుండేది.
నటీనటులు:
హీరోగా నటించిన అక్షయ్ సిల్వర్ స్క్రీన్ కు కొత్తయినా అనుభవం ఉన్న నటుడిలా ఆకట్టుకున్నాడు. ఈ సంఘటన ఆయన నిజ జీవితంలోనే జరిగింది కాబట్టి ఆ సంఘటన తాలూకు సంఘర్షణను కనబరచడంతో సక్సెస్ అయ్యాడు. తండ్రిగా నటించిన అవినాష్ ప్రేక్షకుడిని కంటతడి పెట్టేలా చేశారు. తల్లి పాత్రలో నటించిన శాంతి కృష్ణ అద్భుతమైన ఎమోషన్స్ తో ఆకట్టుకుంది. మమిత బైజు గురించి చెప్పేది ఏముంది? చెప్పండి. హీరోయిన్ గా ఐశ్వర్య అభినయం అందం నటన సినిమాకు అదనపు ఆకర్షణ. సాంకేతిక నిపుణుల విషయానికి వస్తే కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, డైరెక్టర్ దినేష్ బాబు యదార్థ సంఘటనను సినిమాటిక్ లిబర్టీ తీసుకోకుండా డైరెక్ట్ చేసిన విధానం పర్లేదు అనిపించింది. ఇక హరి ప్రసాద్ అందించిన సంగీతం నేపథ్య సంగీతం ఆకట్టుకుంది, పాటలు కూడా బాగున్నాయి. ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ సినిమాకి తగ్గట్టుగా ఉంది. సినిమా నిర్మాణ విలువలు బాగున్నాయి.
ఫైనల్లీ డియర్ కృష్ణ, కృష్ణ తత్త్వాన్ని చెప్పే ఓ మంచి ప్రయత్నం