గతంలో “మ్యాడ్” సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ సినిమాకి సీక్వెల్‌గా “మ్యాడ్ స్క్వేర్” అనే సినిమాను రూపొందించారు. కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో నార్నే నితిన్, రామ్ నితిన్, సంగీత్ శోభన్ హీరోలుగా ఈ సెకండ్ పార్ట్ తెరకెక్కింది. సూర్యదేవర హారిక నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమాను నాగవంశీ సమర్పించారు. ప్రమోషన్స్‌తో ప్రేక్షకులలో అంచనాలు ఏర్పడేలా చేసిన ఈ సినిమా, ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది, సినిమా ఎలా ఉంది అనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం.
“మ్యాడ్ స్క్వేర్” కథ:
కాలేజీ చదువులు పూర్తయిన తర్వాత అశోక్ (నార్నే నితిన్), డిడి (సంగీత్ శోభన్), మనోజ్ (రామ్ నితిన్) మూడేళ్ల తర్వాత లడ్డు (విష్ణు) పెళ్లిలో కలుసుకుంటారు. అంతా బాగుంది, పెళ్లికి సిద్ధం అనుకుంటున్న సమయంలో విష్ణు పెళ్లి చేసుకోవాల్సిన అమ్మాయి లేచిపోతుంది. దీంతో అతని మనసు తేలిక పరచడం కోసం ఈ ముగ్గురు అతన్ని గోవాకు తీసుకువెళ్తారు. గోవాకు తీసుకువెళ్లిన తర్వాత బ్యాచిలర్స్‌లా ఎంజాయ్ చేస్తూ గడిపేస్తూ ఉంటారు. ఇలాంటి సమయంలో అనుకోకుండా ఒక ఖరీదైన నెక్లెస్ దొంగతనానికి గురవుతుంది. ఆ దొంగతనం చేసింది ఈ “మ్యాడ్ గ్యాంగ్” అని పోలీసులు భావిస్తారు. అయితే, అసలు ఆ దొంగతనం చేసింది ఎవరు? భాయ్ (సునీల్) అండ్ గ్యాంగ్‌కి ఈ దొంగతనంతో లింక్ ఏంటి? ఈ “మ్యాడ్ గ్యాంగ్” దొంగతనం అపవాదు నుంచి ఎలా బయటపడింది? ఇలాంటి విషయాలు తెలియాలంటే సినిమాను బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే.
విశ్లేషణ:
“మ్యాడ్ స్క్వేర్” ఒకరకంగా “మ్యాడ్” సినిమాకి సీక్వెల్ అయినా సరే, ఆ సినిమాకి ఈ సినిమాకి పాత్రల కంటిన్యూషన్ తప్ప పెద్దగా సంబంధం లేదు. నిజానికి స్టార్టింగ్ ఒక డీసెంట్ స్టార్ట్ అనిపిస్తుంది. ఒక్కొక్క క్యారెక్టర్ ఇంట్రడక్షన్‌తో పాటు వెడ్డింగ్ సీక్వెన్స్ మొత్తం ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుంది. ఫస్ట్ హాఫ్‌లో వచ్చే వెడ్డింగ్ సీక్వెన్స్, పెళ్లి క్యాన్సిల్ అవ్వడం వంటివి ఆకట్టుకుంటాయి, ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తాయి. అయితే, ఎప్పుడైతే సినిమా గోవాకు షిఫ్ట్ అవుతుందో, అప్పుడు కామెడీ నుంచి కథ పక్కదారి పట్టిన ఫీలింగ్ కలుగుతుంది. నవ్విస్తూనే ఉన్నా, అది బలవంతంగా నవ్విస్తున్న ఫీలింగ్ కలిగించడం కాస్త మైనస్ అయ్యే అంశం. అయితే, కొన్ని సీన్స్ మాత్రం విపరీతంగా ఎంగేజ్ చేసేలా ఉన్నాయి. ఫస్ట్ హాఫ్ చాలా వరకు నవ్విస్తూ సాగినా, సెకండ్ హాఫ్ మాత్రం కాస్త సహనానికి పరీక్ష అన్నట్టుగా సాగుతుంది. నిజానికి ఈ సినిమా మొత్తం కామెడీని బేస్ చేసుకుని తీసిన సినిమా. కామెడీ ఫస్ట్ హాఫ్ వరకు వర్క్ అవుట్ అయినా, సెకండ్ హాఫ్‌లో ఫస్ట్ హాఫ్‌కి వర్కౌట్ అయినంతగా వర్కౌట్ కాలేదు. నాగవంశీ ముందు నుంచి చెబుతున్నట్టుగానే, ఈ సినిమాలో కథ ఆశించకూడదు, అలాగే కొత్తదనం ఆశించకూడదు. లాజిక్స్ పక్కన పెట్టి చూస్తే ఈ సినిమా నవ్విస్తుంది. నిజానికి సీక్వెల్ అంటే కచ్చితంగా మొదటి సినిమాతో కంపారిజన్ వస్తుంది. అలా కంపారిజన్ వచ్చినప్పుడు ఈ సినిమా కంటే ఫస్ట్ పార్ట్ బావుంది అని ప్రేక్షకులకు ఫీలింగ్ కలిగిస్తుంది. అయితే, కేవలం ప్రేక్షకులను నవ్వించడమే లక్ష్యంగా రూపొందించిన ఈ సినిమా అందులో దాదాపుగా సఫలం అయిందని చెప్పొచ్చు.
నటీనటులు:
నటీనటుల విషయానికి వస్తే, ఈ సినిమాలో మెయిన్ హీరోగా నార్నే నితిన్ ముందు నుంచి ప్రొజెక్ట్ అవుతున్నాడు. కానీ, సంగీత్ శోభన్ మరోసారి ఈ సినిమాను తన భుజాల మీద నడిపించిన ఫీలింగ్ కలుగుతుంది. అలా అని నార్నే నితిన్ నటనకు వంకలు పెట్టే అవకాశం లేదు, ఎందుకంటే నితిన్ కూడా తన పాత్రకు తగ్గట్టుగా నటించాడు. కానీ, సంగీత్ శోభన్ పాత్రకు రాసుకున్న డైలాగ్స్ బట్టి కథ సంగీత్ చుట్టూ తిరిగిన ఫీలింగ్ కలుగుతుంది. ఇక రామ్ నితిన్, మిగతా ఇద్దరంత గొప్పగా కాకపోయినా, ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యాడు. లడ్డు పాత్రలో మెరిసిన విష్ణు ఎప్పటిలాగే తనదైన సర్ప్రైజింగ్ పర్ఫామెన్స్‌తో ఆకట్టుకున్నాడు. ఆయన తండ్రి పాత్రలో నటించిన మురళీధర్ గౌడ్ కూడా ఎప్పటిలాగే ఆకట్టుకున్నాడు. మిగతా పాత్రధారులు అందరూ తమ పరిధి మేరకు నటించారు.
టెక్నికల్ టీం:
ఇక ఈ సినిమా టెక్నికల్ టీం విషయానికి వస్తే, సంగీతం అందించిన భీమ్స్ సినిమాకి ప్రత్యేకమైన అసెట్ అందించాడని చెప్పొచ్చు. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ తమన్ ఇచ్చింది ఇండియన్ వర్షన్‌కి అందించారో లేక భీమ్స్ ఇచ్చిందే వాడారో తెలియదు, కానీ అది కూడా అదిరిపోయింది. సినిమాటోగ్రఫీ సినిమాకి రిచ్ ఫీల్ తీసుకొచ్చింది. ఎడిటింగ్ టేబుల్ మీద చాలా క్రిస్పీగా కట్ చేసుకున్నారు. డైలాగ్స్ విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకున్న ఫీలింగ్ కలుగుతుంది. సితార నిర్మాణ విలువల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిందేముంది?
ఓవరాల్‌గా ఈ “మ్యాడ్ స్క్వేర్” లాజిక్స్ లేకుండా చూస్తే కడుపుబ్బా నవ్విస్తుంది.