Maa Oori Polimera 2 Review: డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో మా ఊరి పొలిమేర సినిమా సూపర్ హిట్ అయింది. చేతబడుల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా అందరికీ నచ్చేయడంతో ఈ సినిమా సీక్వెల్ మీద కూడా ఆసక్తి ఏర్పడింది. “మాఊరి పొలిమేర’ చిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కిన “మా ఊరి పొలిమేర 2”కి కూడా డా.అనిల్ విశ్వనాథ్. దర్శకుడు. సత్యం రాజేష్, కామాక్షి భాస్కర్ల కీలక పాత్రలలో నటిస్తున్న ఈ సినిమాలో బాలాదిత్య, రాకేందు మౌళి, గెటప్ శ్రీను, సాహితీ దాసరి ముఖ్యపాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి గౌరికృష్ణ నిర్మాత కాగా ప్రపంచవ్యాప్తంగా నవంబరు 3న ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ప్రేక్షకులలో భారీ అంచనాలు ఏర్పడిన ఈ సినిమా.ఆ అంచనాలను అందుకుందా? లేదా? అనేది తెలియాలంటే ఈ రివ్యూలో తెలుసుకుందాం.
కథ: సరిగ్గా మొదటి భాగం ఎక్కడ ముగిసిందో అక్కడే ఈ రెండో భాగం మొదలైంది. ఊరిలో చెతబడులు చేస్తూ మరణించాడు అని అందరూ భ్రమ పడిన కొమురయ్య(సత్యం రాజేష్)ను వెతకడంకోసం అతని తమ్ముడు జంగయ్య(బాలాదిత్య) బయలుదేరతాడు. జంగయ్య మిస్ అవడంతో అతన్ని వెతుక్కుంటూ బయలుదేరిన కొత్త ఎస్సై(రాకేందు మౌళి) అనూహ్యంగా కొమురయ్య స్నేహితుడు(గెటప్ శ్రీను) కూడా కేరళ శబరిమల వెళ్లి మిస్ అయినట్టు తెలుసుకుంటాడు. దీంతో అతన్ని వెతుక్కుంటూ వెళ్లగా అక్కడ కొమురయ్య అతని స్నేహితుడికి జరిగిన కథ అంతా చెబుతుంటే వింటాడు. ఇక ఈ క్రమంలో కొమురయ్య తాను ప్రేమించిన కవిత(రమ్య పొందూరి)ని కేరళ ఎలా తీసుకు వెళ్ళాడు? గెటప్ శ్రీను భార్య రాముల(సాహితి దాసరి) ఎందుకు ఇంటి నుంచి వెళ్ళిపోయింది? అసలు కవితను కొమురయ్య ఎందుకు కేరళ తీసుకువెళ్లాడు? కొమురయ్యకి ప్రతిరోజూ నిధి గురించి కలలు ఎందుకు వస్తున్నాయి? అసలు చివరికి కొమురయ్య ఇంటికి చేరాడా? కొమురయ్య గురించి అతని భార్య లక్ష్మి(కామాక్షి భాస్కరాల) తెలుసుకున్న నిజం ఏమిటి? అనే విషయాలు తెలియాలంటే ఈ సినిమాను పెద్ద తెర మీద చూడాల్సిందే.
విశ్లేషణ: ఈ సినిమా మొదటి భాగం అంతా చేతబడి చుట్టూ తిరగడంతో పాటు సినిమా అందరికీ నచ్చడంతో రెండో భాగం మీద జనాల్లో ఇంట్రెస్ట్ పెంచేసింది. ఎందుకంటే జనానికి పెద్దగా తెలియని చేతబడి కాన్సెప్ట్ కావడంతో అందరి ఫోకస్ సినిమా మీదనే ఉంది. అయితే ఆ సినిమా ప్రేక్షలకులను పూర్తి స్థాయిలో మెప్పిస్తుందా ? అంటే ఎవరూ అవునని, అలా అని కాదని చెప్పలేని పరిస్థితి. మొదటి భాగంలో ఒక పల్లెటూరు, ఆ పల్లెట్టూరులో చేతబడుల నెపంతో బలైన ఒక అమాయకుడు కథ చెబుతున్నట్టే చెబుతూ సినిమా చివర్లో అతను తన ప్రేయసితో కలిసి కేరళ వెళ్లినట్టు చూపించి రెండో భాగం మీద ఆసక్తి పెంచగా రెండో భాగంలో అతను ఎలా బతికాడు, కవితను కేరళ వరకు ఎలా తీసుకు వెళ్ళాడు అనే విషయాలు చూపించారు. అయితే ఎక్కువగా ట్విస్టుల మీద ట్విస్టులు ఇస్తూ జనాన్ని షాక్ కి గురి చేసే ప్రయత్నంలో ఎక్కడో దర్శకుడి ఫోకస్ తప్పినట్టు అనిపిస్తుంది. ఒకే కథని వేర్వేరు వ్యక్తుల కోణంలో చూపించే ప్రయత్నం చేసినా అది ఎందుకో అంత కన్విన్సింగ్ అనిపించలేదు, కొన్ని సీన్స్ కి లాజిక్ లేదు. కేవలం ప్రేక్షకులను థ్రిల్ కి గురి చేయాలి అనుకుని ట్విస్టులు రాసుకున్నట్టు అనిపిస్తుంది కానీ అది నిజంగా అవసరమా? లేదా అనే విషయాన్ని గాలికి వదిలేశారు. మొదటి భాగంలో ఏవైతే ఇంట్రెస్టింగ్ ఎలిమియెంట్స్ అనిపించాయో ఈ భాగంలో వాటినే ఉసూరుమనిపించేలా తెరకెక్కించారు. నిజానికి మొదటి భాగం మీద ఏర్పడిన హైప్ రెండో భాగం మీద కూడా క్యారీ అయింది. కానీ దాన్ని వాడుకోవడంలో టీమ్ పూర్తిగా సఫలం కాలేదు. చేతబడులు మాత్రమే అనుకుంటే దానికి గుప్తనిధులు కూడా కలిపి నరబలి యాంగిల్ కూడా మిక్స్ చేసి కలగాపులగం చేసిన ఫీలింగ్ కలుగుతుంది. ఒక్కమాటలో చెప్పాలంటే మొదటి భాగం మీద ఏర్పడిన హైప్ ఈ రెండో భాగానికి మైనస్ అయింది. భారీ అంచనాలతో థియేటర్లకు వచ్చే ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుంది అనే దాన్ని బట్టి రిజల్ట్ ఆధారపడి ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.
నటీనటుల విషయానికి వస్తే ఈ సినిమాలో కొమురయ్య పాత్రలో సత్యం రాజేష్ జీవించాడు. కమెడియన్ ముద్రను మొదటి భాగంతో చెరిపేసుకున్న రాజేష్ ఈ రెండో భాగంలో కూడా రెచ్చిపోయి నటించాడు. ఇక ఆయన తరువాత సాయి కామాక్షి, సాహితి, రమ్య కూడా మంచి పాత్రలు పడడంతో ఒక రేంజ్ లో ప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేశారు. ఇక గెటప్ శ్రీను, చిత్రం శ్రీను, రాకేందుమౌళి, బాలాదిత్య వంటి వారు తమ తమ పాత్రల మేరకు ఆకట్టుకున్నారు. చివర్లో బబ్లూ పృథ్వీరాజ్ కనిపించింది ఒక్క సీన్లోనే అయినా ఎంట్రీతోనే అదరగొట్టేశాడు. ఇక టెక్నీకల్ టీమ్ విషయానికి వస్తే దర్శకుడు అనిల్ విశ్వనాధ్ కథ మీద లానే స్క్రీన్ ప్లే విషయంలో కూడా కేర్ తీసుకుని ఉండాల్సింది. ట్విస్టుల మీద పెట్టే ఫోకస్ కధనం మీద కూడా పెట్టి ఉంటే రిజల్ట్ వేరేలా ఉండేది అనడానికి ఎలాంటి సందేహం లేదు. డైలాగ్స్ కూడా ఫర్వాలేదు అనిపించేలా ఉన్నాయి. సినిమాటోగ్రఫీ సినిమాకు ప్రధాన బలం భయపెట్టాల్సిన చోట భయపెడుతున్నట్టు కనిపిస్తూనే అందాలను కూడా బాగా క్యాప్చర్ చేశారు. ఎడిటింగ్ ఎంత క్రిస్పీగా ఉన్నా నిడివి రెండు గంటలే ఉన్నా సినిమా ఎందుకో తిరుగుతున్న చోటే తిరుగుతూ సాగతీసిన ఫీలింగ్ కలుగుతుంది. ఇక కొన్ని పాటలు వినడానికి బాగున్నాయి, కానీ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం ఆకట్టుకునేలా ఉంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.
ఫైనల్లీ: మా ఊరి పొలిమేర 2 ఎలాంటి అంచనాలు లేకుండా ఒకసారి చూడచ్చు… అది కూడా థ్రిల్లర్, హారర్ ఎలిమెంట్స్ ఆశించకుండా ఉంటే!!