NTV Telugu Site icon

Krishna Gadu Ante Oka Range Review: కృష్ణ గాడు అంటే ఒక రేంజ్ రివ్యూ

Krishna Gadu Ante Oka Range Movie Review

Krishna Gadu Ante Oka Range Movie Review

Krishna Gadu Ante Oka Range Review: ఈ మధ్యలో రిలీజ్ కావాల్సిన పెద్ద సినిమాలన్నీ చాలా వరకు రిలీజ్ అయిపోవడంతో కాస్త తక్కువ బడ్జెట్ సినిమాలన్నీ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాయి. ఇక కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న నేపథ్యంలో చిన్న సినిమాలను కూడా పెద్ద ఎత్తున రిలీజ్ చేస్తున్నారు. ఈ శుక్రవారం నాడు డబ్బింగ్ సినిమాలతో కలిపి ఏకంగా ఎనిమిది సినిమాలు థియేటర్లలో రిలీజ్ అవుతున్నాయి. కంటెంట్ ఉంటే కొత్త వాళ్లతో చేసిన సినిమా కూడా ప్రేక్షకులు గుండెల్లో పెట్టేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే కృష్ణ గాడు అంటే ఒక రేంజ్ అనే సినిమా కూడా శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తోంది. రిష్వి తిమ్మరాజు, విస్మయ శ్రీ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాను శ్రీ తేజస్ ప్రొడక్షన్స్ ప్రైలి బ్యానర్ పై పెట్లా కృష్ణమూర్తి, పెట్లా వెంకట సుబ్బమ్మ, పిఎన్‌కే శ్రీలత సంయుక్తంగా నిర్మించారు. రాజేష్‌ దొండపాటి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ శుక్రవారం విడుదల కాగా ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది అనేది సినిమా రివ్యూ లో చూద్దాం

కృష్ణ గాడు అంటే ఒక రేంజ్ సినిమా కథలోకి వెళితే:
కృష్ణ (రిష్వి తిమ్మరాజు) తండ్రి చిన్నప్పుడే చనిపోవడంతో ఇంటి బాధ్యత భుజాన వేసుకుంటాడు. తన మామతో కలిసి మేకలు మేపుతూ జీవనాధారం ఏర్పరచుకుంటాడు. అయితే ఒక ఫంక్షన్ లో సత్య (విస్మయశ్రీ) కృష్ణను చూసి అతని ఎన్నో సెన్స్ కి ఫిదా అయి ప్రేమలో పడుతుంది. తరువాత కృష్ణ కూడా ఆమె ప్రేమలో పడతాడు. మరోపక్క ఊరిలో ప్లే బాయ్ గా తిరుగుతూ ఉండే దయ(రఘు) అమ్మాయిలను, మహిళలను సామ దాన భేద దండోపాయాలు ఉపయోగించి శారీరకంగా లోపరచుకుంటూ ఉంటాడు ఈ క్రమంలో సత్యం లోబరుచుకునేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో కృష్ణతో ప్రేమలో ఉందని విషయం తెలుసుకుని విడదీసే ప్రయత్నం చేస్తాడు. ఈ క్రమంలోనే కృష్ణకు దయకు పెద్ద గొడవ అవుతుంది. ఈ క్రమంలోనే నీకు సరైన ఇల్లు కూడా లేదు నీకెందుకు సత్య? అని అడగడంతో దాన్ని సీరియస్ గా తీసుకున్న కృష్ణ మూడు నెలల్లో ఇల్లు కట్టి సత్యను పెళ్లి చేసుకుంటాను అని సవాల్ విసురుతాడు. మరి ఆ చాలెంజ్ లో కృష్ణ గెలిచాడా? కృష్ణ గెలవకుండా దయ ఎలాంటి ఇబ్బందులు సృష్టించాడు? ఈ క్రమంలో కృష్ణ తల్లికి ఏర్పడిన అపాయం ఏంటి? చివరికి కృష్ణా సత్య ఒకటయ్యారా? లేదా? అనేది ఈ సినిమా కథ.

విశ్లేషణ:
ఈ మధ్యకాలంలో తెలుగు ప్రేక్షకులు ప్రపంచ సినిమాలకు దగ్గర అయిపోయారు. ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో అన్ని భాషల సినిమాలు వివిధ ఓటీటీలతో మన ముంగిట్లో ఉండడంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న కంటెంట్ అంతా చూస్తున్నారు. ఈ నేపథ్యంలో చిన్న సినిమాలు చేసినా పెద్ద సినిమాలు చేసిన కంటెంట్ను నమ్ముకుని చేయాల్సిన అవసరం ఉంది. పెద్ద సినిమాల్లో స్టార్లు ఉంటారు కాబట్టి పెద్దగా ఇబ్బంది ఉండదు కానీ చిన్న సినిమాలు విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. అయితే ఈ సినిమా విషయానికి వస్తే రొటీన్ స్టోరీతో ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేసిన దర్శక నిర్మాతలు అందులో కొంత వరకు సఫలం అయ్యారు. ఈ మధ్య కాలంలో చిన్న సినిమాల్లో హీరోలను కూడా బెంజ్ కార్లలో తిప్పుతుంటే ఈ సినిమాలో మాత్రం హీరోతో మేకలు కాయించడం అలా మేకలు కాసే వ్యక్తిని చూసి హీరోయిన్ ప్రేమలో పడటం లాంటి విషయాలు కొంచెం కొత్తగా అనిపించాయి. అయితే ఈ క్రమంలో హీరో క్యారెక్టర్ తో పాటు హీరోయిన్ క్యారెక్టర్ ని కూడా మలిచిన తీరు ఆసక్తికరంగా ఉంటుంది.. అయితే కట్టే కొట్టే తెచ్చే అనేలా కాకుండా పాత్రలను ప్రేక్షకులకు పరిచయం చేసేందుకు ఎక్కువ సమయం తీసుకున్నాడు డైరెక్టర్.. అయితే కథ రొటీన్ గానే అనిపించినా స్క్రీన్ ప్లే విషయంలో మాత్రం కాస్త కొత్తదనంతో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. ఒక లవ్ స్టోరీని మాత్రమే కాకుండా ఎమోషన్స్, కామెడీ, యాక్షన్ ఇలా అన్ని జానర్లను టచ్ చేసే ప్రయత్నం చేసి కొంతవరకు సక్సెస్ అయ్యాడు. పాత్రల పరిచయం తర్వాత కూడా ఎందుకు కొన్ని సీన్స్ సాగదీసినట్లు అనిపిస్తాయి. ఫస్ట్ హాఫ్ అంతా కామెడీగా లవ్ స్టోరీ తో నడిపించిన దర్శకుడు సెకండ్ హాఫ్ మొత్తం ఎమోషనల్ గా నడిపించే ప్రయత్నం చేశాడు. అయితే ఈ సినిమా కొత్త వారితో కాకుండా పేరు ఉన్న నటీనటులతో తీస్తే రిజల్ట్ వేరేలా ఉండేదేమో!

ఎవరెలా చేశారంటే?

నటీనటుల విషయానికి వస్తే ఈ సినిమా హీరోగా నటించిన రిష్వి అమాయకుడైన మేకల కాపరి పాత్రలో ఇమిడిపోయేలా నటించాడు. అయితే మొదటి సినిమా కావడంతో అనుభవ లేమి కొంత కనిపించింది. ఇక విస్మయ శ్రీ సత్య అనే గడుసు అమ్మాయి పాత్రలో ఆకట్టుకుంది. రఘు, స్వాతి, సుజాత, వినయ్ మహాదేవ వంటి వారు కూడా సినిమాలో తమ తమ పాత్రల పరిధి మీద నటించి ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. సినిమా టెక్నికల్ విషయాలకు వస్తే ఈ సినిమాకి సంగీతంతో పాటు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా చాలా హైలైట్ అయ్యాయి. మ్యూజిక్ డైరెక్టర్ పనితనం బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విషయంలో బాగా కనిపించింది. సినిమాటోగ్రఫీ కూడా సినిమాకి మంచి అందాన్ని తెచ్చింది. అయితే కొత్త కథ పిక్ చేసుకోలేకపోయినా స్క్రీన్ ప్లే విషయంలో మాత్రం అనుభవం చూపించే ప్రయత్నం చేశాడు రాజేష్. గతంలో కొన్ని సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్గా పని చేసిన ఆయన పనితనం స్క్రీన్ మీద కనిపించింది. నిర్మాతలకు మొదటి సినిమానే అయినా ఎక్కడా ఆ విషయం కనిపించకుండా తెరకెక్కించారు.

ఫైనల్ గా ఒక్కమాటలో చెప్పాలంటే
కృష్ణ గాడు ఒక రేంజ్ అంటే… ఓ రేంజ్ కాకపోయినా హ్యాపీగా ఒకసారి చూసేయొచ్చు

Show comments