రాక్షసుడు అనే సినిమాతో హిట్ అందుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్, ఆ తర్వాత మరో హిట్ అందుకునేందుకు అనేక ప్రయత్నాలు చేశాడు. ఇటీవల భైరవం అనే సినిమా రీసెంట్ టాక్ అందుకున్నా, కమర్షియల్ హిట్ కాలేదు. అయితే, ఆయన చేసిన హారర్ థ్రిల్లర్ సినిమా కిష్కింధపురి ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. నిజానికి, రెండు రోజుల ముందు నుంచే సినిమాకి ప్రీమియర్స్ ప్రదర్శిస్తూ వచ్చారు. ఆ ప్రీమియర్స్‌కి మంచి టాక్ కూడా వచ్చింది. అనుపమ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాని కౌశిక్ డైరెక్ట్ చేశాడు. ఈ సినిమా ఎలా ఉంది, ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది అనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం.
కిష్కింధపురి కథ:
కిష్కింధపురి అనే ఒక ప్రాంతంలో రాఘవ (బెల్లంకొండ సాయి శ్రీనివాస్), మైథిలి (అనుపమ పరమేశ్వరన్) ఒక గోస్ట్ వాకింగ్ టూర్ కంపెనీలో పనిచేస్తూ ఉంటారు. దెయ్యాలు ఉన్నాయని చెప్పబడే ప్రాంతాలకు కొంతమందిని ఒక టూర్‌లాగా తీసుకెళ్లడం వీరి వృత్తి. అలా అనుకోకుండా సువర్ణ మాయ రేడియో స్టేషన్ అనే ఒక ప్రాంతానికి వీరి టీమ్ ఎనిమిది మందిని తీసుకెళ్తుంది. అలా వెళ్లిన వాళ్లు ఒక్కరొక్కరుగా చనిపోతూ ఉంటారు. అయితే, అసలు సువర్ణ మాయ రేడియో స్టేషన్‌లో ఏం జరిగింది? అక్కడికి వెళ్లిన వారు ఒక్కరొక్కరుగా ఎందుకు చనిపోతున్నారు? లాంటి విషయాలు తెలియాలంటే సినిమాని బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే.
విశ్లేషణ:
ఇది తెలుగులో ఇప్పటివరకు వచ్చిన అన్ని హారర్ స్టోరీ ఫార్మాట్‌లనే ఫాలో అవుతూ సాగిన సినిమా. ఒక హారర్‌తో పాటు మరోపక్క థ్రిల్లింగ్ అంశాలను కలగలిపి దర్శకుడు కథ రాసుకున్నాడు. అన్ని సినిమాలలో లాగానే ఫస్ట్ హాఫ్‌లో హీరో అండ్ గ్యాంగ్ ఒక దెయ్యాన్ని నిద్ర లేపుతారు. ఫస్ట్ హాఫ్ అంతా దెయ్యంతో ఇబ్బందులు పడుతూ, సెకండ్ హాఫ్ స్టార్ట్ అయ్యాక ఆ దెయ్యం బ్యాక్ స్టోరీ ఏంటో ప్రేక్షకులకు చెప్పే ప్రయత్నం చేశాడు డైరెక్టర్. ఫస్ట్ హాఫ్‌లో దెయ్యం ఎంటర్ అయినప్పటి నుంచి థియేటర్లో ప్రేక్షకులు సీట్లకు అతుక్కుపోయి చూసేలా కథ రాసుకున్నాడు డైరెక్టర్. నిజానికి, సినిమా స్టార్ట్ అయిన పది నిమిషాల తర్వాత ఎవరూ ఫోన్లు చూడరు, అంతగా సినిమాలో లీనం అయిపోతారని బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఇచ్చిన స్టేట్‌మెంట్ చాలా వరకు నిజమైంది. నిజంగానే ప్రేక్షకులు ఫోన్లు చూడకుండా థియేటర్లో స్క్రీన్‌కి అతుక్కుపోయారు. ఫస్ట్ హాఫ్ అంతా ఆసక్తికరంగా సాగుతూ, మంచి ఇంటర్వెల్ ట్విస్ట్‌తో ప్రేక్షకులలో మరిన్ని అంచనాలు పెంచేలా చేశారు. అయితే, ఫస్ట్ హాఫ్ అంత రేసీగా సెకండ్ హాఫ్ లేదు. దెయ్యం బ్యాక్ స్టోరీ ఆసక్తికరంగానే ఉన్నా, కొన్ని లాజిక్స్ మిస్ అయ్యాయి. అయితే, దెయ్యం సినిమాలకు లాజిక్స్ ఏంటని హైపర్ ఆదితో ఒక డైలాగ్ వేయించి ముందుగానే ప్రిపేర్ చేయించేశారు అనుకోండి, అది వేరే విషయం. సెకండ్ హాఫ్ కాస్త ఫస్ట్ హాఫ్‌తో పోలిస్తే అక్కడక్కడ లాజిక్స్ మిస్ అయినా, సినిమా మొత్తం ఆకట్టుకునేలా ఉంది. సినిమాలో కొన్ని సీన్స్ తర్వాత ఏం జరగబోతోంది అనే విషయం అర్థం అయిపోయేలా ఉన్నా, కొన్ని ట్విస్టులు మాత్రం ఆసక్తికరంగా ఉన్నాయి.
నటీనటులు:
ఈ సినిమాలో రాఘవ అనే పాత్రలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఒదిగిపోయాడు. ఈ థ్రిల్లర్ కాన్సెప్టులు మన వాడికి బాగానే కనిపిస్తున్నాయి. అనుపమ పరమేశ్వరన్‌కి ఇది ఓ రొటీన్ సినిమానే అనిపించినా, సెకండ్ హాఫ్‌లో మాత్రం ఆమె ఇరగదీసింది. విశ్వరూప పుత్ర అనే పాత్రలో నటించిన శాండీ మాస్టర్ మాత్రం సినిమా మొత్తానికి హైలైట్‌గా నిలిచాడు. ఇక మిగతా పాత్రలలో నటించిన హైపర్ ఆది, సుదర్శన్ సహా మిగతా పాత్రధారులు అందరూ తమ తమ పాత్రల పరిధి మేరకు నటించారు.
టెక్నికల్ టీమ్:
టెక్నికల్ టీమ్ విషయానికి వస్తే, ఈ సినిమా మొత్తానికి హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ అయితే, టెక్నికల్ టీమ్ విషయానికి వచ్చేసరికి హీరో మాత్రం చైతన్ భరద్వాజ్. హారర్ సినిమాలకు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ప్రాణం. ఆ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ని ఒక రేంజ్‌లో సినిమాని ఎలివేట్ చేసేలా కొట్టాడు చైతన్ భరద్వాజ్. అలాగే, టెక్నికల్‌గా ఈ సినిమా బాగుంది. సినిమా విజువల్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. అదేవిధంగా, సినిమా రన్ టైమ్ కూడా ప్రేక్షకులకు అనుకూలంగా ఉంది. కథ రొటీన్ అయినా, కథనం విషయంలో కాస్త ఇంకా కేర్ తీసుకుని ఉంటే బాగుండేది.
కిష్కింధపురి – సువర్ణ మాయతో వణికించిన బెల్లంకొండ.*