NTV Telugu Site icon

KA Movie Review: క సినిమా రివ్యూ.. కిరణ్ అబ్బవరం హిట్ కొట్టాడా?

Ka Movie Review

Ka Movie Review

వరుస సినిమాలు చేస్తూ వెళ్లే కిరణ్ అబ్బవరం కాస్త గ్యాప్ తీసుకుని మరీ ఈసారి సరైన హిట్టు కొట్టాలని క అనే సినిమా చేశాడు. ఇద్దరు అన్నదమ్ములు సందీప్, సుజిత్ దర్శకులుగా వ్యవహరించిన ఈ సినిమాని కిరణ్ అబ్బవరం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తూ వచ్చారు. కచ్చితంగా ఈ సినిమాతో ఒక కొత్త ప్రయత్నం చేసేము కాబట్టి హిట్టు కొడతామని ముందు నుంచి చెబుతూ వచ్చారు. దానికి తోడు ఒక యంగ్ నిర్మాత వంశీ నందిపాటి ఈ సినిమా హక్కులను మంచి రేటుకు కొనుగోలు చేయడంతో ఈ సినిమా మీద ప్రేక్షకులలో కాస్త ఆసక్తి ఏర్పడింది. మరి ఎట్టకేలకు ఈ సినిమా ప్రేక్షకులు ముందుకు వచ్చేసింది. మరి ప్రేక్షకుల ఆసక్తిని అంచనాలను ఈ సినిమా ఎంతవరకు అందుకుంది అనేది? ఇప్పుడు మన రివ్యూలో చూద్దాం.

క కథ :
ఒక అనాధ శరణాలయంలో పెరిగిన అభినయ వాసుదేవ్ (కిరణ్ అబ్బవరం)కు అనుకోకుండా ఇతరుల ఉత్తరాలు చదివే అలవాటు ఏర్పడుతుంది. అలవాటు ఎంతలా మారిపోతుందంటే ఆ ఊరి పోస్ట్మాన్ బ్యాగులో నుంచి ఉత్తరాల కొట్టేసి మరీ చదివే అంత. ఆ అలవాటు వల్ల అభినయ వాసుదేవ్ ఎన్నో ఇబ్బందులు గురవ్వాల్సి వస్తుంది. చివరికి ఇలా కాదు నేనే పోస్ట్మాన్ అయితే వచ్చే ఉత్తరాలని చదివేయొచ్చు అని భావిస్తాడు. అలా మధ్యాహ్నం 3 గంటలకే చీకటి పడే కృష్ణగిరి అనే ఊరికి పోస్ట్మాన్ సుబ్బు(కింగ్స్లీ) దగ్గర పని చేసేందుకు వెళ్తాడు. ఆ ఊరికి వెళ్ళిన అభినయ వాసుదేవ్ కి చదువు లేకపోయినా ఉత్సాహం వంతుడు కావడంతో ఆ ఊరి పోస్ట్ మాస్టర్ రంగారావు(అచ్యుత్ కుమార్) అసిస్టెంట్ పోస్ట్మాన్ అనే ఉద్యోగాన్ని కల్పించి మరీ ఇస్తాడు. అయితే మరోపక్క ఆ ఊరికి చెందిన అమ్మాయిలు విచిత్రంగా మాయం అవుతూ ఉంటారు. ఇక పోస్టుమాస్టర్ వద్ద ఉద్యోగానికి చేరిన అభినయ వాసుదేవ్ ఆయన కుమార్తె సత్యభామ(నయన్ సారిక)తో ప్రేమలో పడతాడు. ఉత్తరాలు చదివే అలవాటు ఉన్న అభినయ వాసుదేవ్ ఆ ఊరికి వస్తున్న అనేక ఉత్తరాలను చదివి వాటిలో కొన్నింటిని మార్చి రాస్తూ కొన్ని అనర్ధాలను జరగకుండా కాపాడే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఇలాంటి ఓ క్రమంలో ఓ వ్యక్తిని కోర్టు బయట హత్య కాకుండా కాపాడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అయితే అసలు ఆ ఊరి వాళ్ళు ఒక వ్యక్తిని ఎందుకు చంపాలి అనుకున్నారు? అభినయ వాసుదేవ్ కాపాడైన వ్యక్తిని అతనే తిరిగి ఎందుకు చంపాలనుకున్నాడు? అసలు ఆ ఊరిలో మాయం అవుతున్న అమ్మాయిలకు లాలా, ఆబిద్ షేక్ లకు ఉన్న లింక్ ఏంటి? వాసుదేవ్ -సత్యభామలు ఒకటయ్యారా? లాంటి విషయాలు తెలియాలంటే ఈ సినిమాని బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే.

విశ్లేషణ: ఈ సినిమా ప్రమోషన్స్ అంతా ఒక ఎత్తు అయితే ఈమధ్య జరిగిన ట్రైలర్ రిలీజ్ ప్రెస్ మీట్ లో ఇలాంటి కాన్సెప్ట్ తో ఇప్పటివరకు ఒక సినిమా కూడా రాలేదు. వచ్చినట్టు నిరూపిస్తే నేను పూర్తిగా సినిమాలు చేయడం మానేస్తానంటూ ఒక బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చాడు కిరణ్ అబ్బవరం. అయితే ఆయనది ఓవర్ కాన్ఫిడెన్స్ అనిపించేలా అప్పుడు అనిపించినా సినిమా చూసిన తర్వాత మాత్రం ఆ అభిప్రాయం పూర్తిగా మారిపోతుంది. ఎందుకంటే కిరణ్ అబ్బవరం హీరోగా తెరకెక్కిన ఈ సినిమాని దర్శకులు నడిపించిన తీరు ప్రేక్షకులను మెస్మరైజ్ చేసేలా ఉంటుంది. నిజానికి మొదలైనప్పుడు సాధారణ కథలాగే అనిపిస్తుంది. ఒక ఊరు, ఆ ఊరికి ఉన్న సమస్యలు ఆ సమస్యలను ఎక్కడి నుంచో వచ్చి రక్షించాలనుకునే ఓ హీరో. ఇలా సాదాసీదాగా మనం గతంలో చూసిన అనేక సినిమాల్లో కథలాగానే అనిపిస్తుంది. కానీ కథ సాగుతున్న కొద్దీ కథ మీద మరింత ఆసక్తి పెంచే ప్రయత్నం చేశారు దర్శకులు. అదే సమయంలో ప్రీ క్లైమాక్స్ మొదలైనప్పటి నుంచి ప్రేక్షకుడు ఒక్కసారిగా అబ్బురపడేలా ఈ సినిమా స్క్రీన్ ప్లే రాసుకున్నారు. నిజానికి నాన్ లీనియర్ స్క్రీన్ ప్లేతో ఈ మధ్యకాలంలో చాలా సినిమాలు వస్తున్నాయి. కానీ ప్రేక్షకులు అందరూ ఒక్కసారిగా అలర్ట్ అయ్యి వాహ్ ఏమన్నా చేశారా అనేలా క్లైమాక్స్ రాసుకున్నారు. ఒకపక్క ఇంటర్వెల్ బ్లాక్ తో సెకండ్ హాఫ్ మీద ఆసక్తి పెంచుతూనే హీరోకి ఎదురయ్యే అనేక సవాళ్ల విషయంలో ప్రేక్షకులను మరింత ఎంగేజ్ చేసేలా స్క్రిప్ట్ రాసుకున్నారు దర్శకులు. హీరోని ఒక ముసుగు వ్యక్తి కిడ్నాప్ చేసి చీకటి గదిలో బంధించడంతో మొదలయ్యే కథ అక్కడ హీరో చేత ముసుగు వ్యక్తి అతని జీవితంలో జరిగిన అనేక అంశాలను ఒక టైం మిషన్ లాంటి మిషన్ తో చెప్పించే తీరు కాస్త కొత్తగా అనిపిస్తుంది. అది హిప్నోటైజ్ చేసే మిషన్ అని అందులో జరిగింది జరిగినట్టు ఎలాంటి పొరపాటు లేకుండా చెప్పించడం కాస్త ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అయితే నిజానికి సినిమా మొదలు నుంచి విరామం ముందు వరకు రెగ్యులర్ డ్రామాలానే అనిపించినా ప్రీ ఇంటర్వెల్ ట్విస్ట్ తో పాటు ప్రీ క్లైమాక్స్ నుంచి ఎండ్ కార్డు పడే వరకు వచ్చే సన్నివేశాలు మాత్రం అబ్బురపడేలా ఉన్నాయి.. నిజానికి క్లైమాక్స్ ఎవరూ ఊహించని విధంగా రాసుకోవడంలో దర్శకులు సఫలమయ్యారు. అంతకు ముందు జరిగే కథలో కొన్ని విషయాలను ప్రేక్షకులు ఈజీగానే గుర్తుపట్టేలా ఉన్నా సరే క్లైమాక్స్ మాత్రం కచ్చితంగా ప్రేక్షకులు అందరినీ టచ్ చేసేలా ఉంది. జరిగిన సినిమా మొత్తాన్ని క్లైమాక్స్ తో లింక్ చేసిన విధానం మాత్రం దర్శకద్వయానికి హాట్సాఫ్ చెప్పేలా ఉంటుంది.

నటీనటుల విషయానికి వస్తే అభినయ వాసుదేవ్ అని 80 ఏళ్ల కాలం నాటి పోస్ట్మాన్ పాత్రలో కిరణ్ అబ్బవరం ఒదిగిపోయాడు. నిజానికి ఆయన లుక్స్ మీద ముందు నుంచి కొన్ని అనుమానాలు ఉన్నా సినిమా చూసిన తర్వాత మాత్రం కరెక్ట్ లుక్ అనిపించింది. సినిమాలో పాత్ర పేరుకు తగ్గట్టుగానే అభినయంతో కూడా కిరణ్ అబ్బవరం మెప్పించాడు. ఇక హీరోయిన్ పాత్రలో నటించిన నయన్ సారిక కనిపించినంత సేపు క్యూట్గా అనిపించింది. ఆమెకు కిరణ్ తో కెమిస్ట్రీ అదిరిపోయింది. ఇక మరో కీలకమైన పాత్రలో నటించిన తన్వి రామ్ చాలా న్యాచురల్ గా కనిపించింది. రాధా అనే పాత్రలో తాను తప్ప ఇంకెవరు నటించరేమో అనేలా సరిగ్గా నప్పింది. ఇక అచ్యుత్ కుమార్, తమిళ కమెడియన్ కింగ్స్లీ, అన్నపూర్ణమ్మ, బలగం జయరాం, శరణ్య ప్రదీప్ పంటివాళ్లు తమ అనుభవాన్ని చూపించారు మిగతా పాత్రలహరులు తమ పరిధి మేరకు ఆకట్టుకున్నారు.

ఇక టెక్నికల్ టీం విషయానికి వస్తే ఇది ఒక కాన్సెప్ట్ బేస్డ్ సినిమా. నోటితో చెప్పినప్పుడు కంటే దాన్ని చెప్పినంత బాగా తెరమీదకు తీసుకొచ్చినప్పుడే ప్రేక్షకులు థ్రిల్ ఫీల్ అవుతారు. ఆ విషయంలో సుజిత్, సందీప్ ఇద్దరు సక్సెస్ అయ్యారు. ఫస్ట్ హాఫ్ సహా సెకండ్ హాఫ్ లోను కొన్ని లోపాలు ఉన్నా కొన్ని అంశాలు లాజిక్స్ కి అందకపోయినా ప్రీ ఇంటర్వల్ తో పాటు ప్రీ క్లైమాక్స్ నుంచి ఎండు కార్డు వరకు నడిపించిన తీరు సినిమా మొత్తానికి మంచి ప్లస్ పాయింట్. ముఖ్యంగా ఈ సినిమాకి సామ్ సీఎస్ అందించిన సంగీతం ప్రధానమైన బలం. పాటలు ఇప్పటికీ హిట్ అయ్యాయి. సినిమాలోని బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం సినిమాని ఎలివేట్ చేయడంలో బాగా వర్కౌట్ అయింది. 70-80ల నాటి ఒక ఊరిని క్రియేట్ చేయడం కోసం ఆర్ట్ డిపార్ట్మెంట్ పడిన కష్టం ప్రతి ఫ్రేమ్లో కనిపించింది. ఇక సినిమాటోగ్రాఫర్ కూడా సినిమాని అందంగా ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడంలో సక్సెస్ అయ్యాడు. సినిమా కోసం చేసిన జాతర సాంగ్ కూడా ప్రత్యేకమైన ఆకర్షణగా ఉంటుంది. అలాగే స్పెషల్ గా డిజైన్ చేసినట్లు అనిపించే ఫైట్స్ భలే ఉన్నాయి.

చివరిగా ఎలాంటి అంచనాలు లేకుండా థియేటర్ కి వెళితే మీకు ఒక వర్త్ వాచ్ ఎక్స్పీరియన్స్.. కానీ కండిషన్స్ అప్లై