Bedurulanka 2012 Movie Review : “ప్రేమతో మీ కార్తీక్” అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చినా “ఆర్ ఎక్స్ 100” అనే మాస్ మసాలా ఎంటర్టైనర్ తో హిట్ కొట్టి అందరికీ నోటెడ్ అయ్యాడు కార్తికేయ. ఆ తరువాత ఆయన చేస్తున్న సినిమాలు ఎందుకో వర్కౌట్ అవ్వడం లేదు. ఈ క్రమంలోనే కార్తికేయ తాజాగా “బెదురులంక 2012” అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. రామ్ గోపాల్ వర్మ శిష్యుడు డైరెక్షన్లో ఈ సినిమా తెరకెక్కింది. టీజర్, ట్రైలర్ తో సినిమా మీద అంచనాలు పెంచుకున్న ఈ సినిమా శుక్రవారం నాడు నాడు ప్రేక్షకుల ముందుకు రాగా సినిమా ఎలా ఉంది అనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం.
కథ: 2012 డిసెంబర్ లో యుగాంతం అంటూ జనాలు టెన్షన్ పడుతున్న క్రమంలో దాన్నే క్యాష్ చేసుకోవాలని బెదురులంక చిరంజీవిగా భావించే బెదురులంక అనే గోదావరి లంక గ్రామానికి చెందిన భూషణం (అజయ్ ఘోష్) ఒక స్కెచ్ వేస్తాడు. ఆ స స్కెచ్ లో భాగంగా జాతకాలు చెప్పుకునే బ్రహ్మం (శ్రీకాంత్ అయ్యంగార్)ను దొంగ బాబా అవతారం ఎత్తిస్తాడు, గాలికి తిరిగే డానియల్ (జబర్దస్త్ రాంప్రసాద్) ను పాస్టర్ అవతారం ఎత్తిస్తాడు. యుగాంతం ఆగాలంటే ఊర్లో ఉన్న బంగారం అంతా కరిగించి హిందువులు శివలింగం, క్రైస్తవులు శిలువ తయారు చేయించి గోదావరిలో కలపాలని ఆ ఊరి ప్రెసిడెంట్ (గోపరాజు రమణ)తో అందరికీ చెప్పిస్తాడు. ఊరంతా యుగాంతం భయంతో అందుకు ఒప్పుకున్నా నాస్తికుడైన శివ (కార్తికేయ) మాత్రం వినడు. నిజానికి ముందే శివ ప్రెసిడెంట్ కూతురు చిత్ర (నేహా శెట్టి)తో ప్రేమలో ఉంటాడు. అయితే బంగారం ఇవ్వకుండా ఎదురించిన శివను ఊరి నుంచి వెలేస్తాడు ప్రెసిడెంట్. ఈ క్రమంలో చిత్రకు పెళ్లి చేయాలని ఫిక్స్ అవడంతో ఆ విషయం తెలిసియాన్ శివ ఏం చేశాడు ? ఊరి ప్రజల మూఢ నమ్మకాలను పోగొట్టేందుకు శివ వేసిన స్కెచ్ ఏంటి? ఆ స్కెచ్ వేసి తన ప్రేమను గెలిపించుకున్నాడా? యుగాంతం దెబ్బకి అసలు ఆ బెదురులంకలో ఏమైంది? అనేదే ఈ సినిమా కథ.
విశ్లేషణ:
భయం మనిషి విచక్షణా జ్ఞానాన్ని కూడా పని చేయకుండా చేస్తుంది. అలాంటి భయాన్నే పెట్టుబడిగా చేసుకుని తమ పొట్ట పోసుకుంటున్న వారు ఎందరో ఉన్నారు. బెదురులంక 2012 కూడా అలాంటి భయాన్ని క్యాష్ చేస్తూనే నవ్వించే ప్రయత్నం చేసింది. యుగాంతం నేపథ్యంలో మన దగ్గర తక్కువే కానీ ఇతర భాషల్లో చాలా సినిమాలు వచ్చాయి. అయితే అవన్నీ యాక్షన్, థ్రిల్లర్ కాన్సెప్ట్ తో వచ్చిన సినిమాలే కానీ ఆ యుగాంతంను అల్లుకుని ఒక మాంచి కామెడీ సినిమా చేశాడు దర్శకుడు క్లాక్స్. ఇక చనిపోతాం అని తెలిస్తే జనంలో ఉండే భయం కారణంగా పుట్టే ఫన్ ను భీభత్సంగా వర్కౌట్ అయ్యేలా చేశాడు. ఒకపక్క కడుపుబ్బా నవ్విస్తూనే జనాల మూఢవిశ్వాలపై బాంబులు లాంటి సెటైర్లు పేల్చాడు. వర్మ దగ్గర శిష్యరికం చేసిన ప్రభావమో ఏమో తెలియదు కానీ నాస్తికత్వం పేరుతో ఇవ్వాల్సిన వారికి గట్టిగా ఇచ్చి పడేశాడు. జనాల భయాన్ని కొందరు ఎలా వాడుకుంటారో, మతాల పేరుతో ఎలా ఆడుకుంటారో కళ్ళకి కట్టినట్టు చూపించాడు. తొలి సినిమా అయినా ఎక్కడా ఆ డౌట్ రాకుండా బాగా డీల్ చేశాడు. చావు భయం మనిషిని ఎంత దారుణంగా దిగజారుస్తుందనేది దర్శకుడు క్లాక్స్ చూపించాడు. పూర్తిగా విలేజ్ బ్యాక్ డ్రా, అక్కడి అమాయకంగా కనిపిస్తూ ఉండే జనాల మధ్య వర్కౌట్ అయిన సిచువేషనల్ కామెడీ బాగుంది. ఫస్ట్ ఆఫ్ కాస్త నెమ్మదిగా.. పెద్దగా బోర్ కొట్టకుండా సాగుతుంది కానీ కీలకమైన సెకండ్ హాఫ్ అంతా కడుపుబ్బా నవ్విస్తుంది. మరీ ముఖ్యంగా చివరి 40 నిమిషాలు నాన్ స్టాప్ నవ్వులు పూయించడంలో దర్శకుడు క్లాక్స్ క్లాప్స్ కొట్టించుకున్నాడు. జనం అమాయకత్వంపైనే ఈ సినిమాలో ఫన్ జనరేట్ చేసి భలే తీశాడురా అనిపించుకున్నాడు.
ఎవరెలా చేశారంటే:
ముందుగా టెక్నికల్ టీమ్ విషయానికి వస్తే `బెదురులంక` సినిమాకి మణిశర్మ సంగీతం అందించారన్న పేరే కానీ మ్యూజిక్ వర్కౌట్ కాలేదు. పాటలు సంధర్భానుసారంగా బానే అనిపించినా గుర్తుంచుకోదగ్గవి ఏమీ లేదు. బీజీఎం మాత్రం ఫర్వాలేదనిపించింది. కెమెరా వర్క్ అయితే బాగుంది. డైలాగులు చాలా బాగున్నాయి. హీరో చేత చెప్పించిన చాలా డైలాగ్స్ లో ఎంతో అర్థం కనిపిస్తుంది, చాలా ఆలోచింప చేసే డైలాగులు రాశాడు. కథని తీసుకెళ్లిన తీరు కూడా వంకలు పెట్టలేని విధముగా ఉంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. ఇక నటీనటుల విషయానికి వస్తే శివ పాత్రలో కార్తికేయ ఎప్పటిలానే ఎంతో ఎనర్జిటిక్‌గా కనిపించి తనకు ఈజ్ ఉన్నట్టు చేసుకుపోయాడు. నేహా శెట్టి గ్లామర్ ప్లస్ అవుతుంది అనుకుంటే పెద్దగా ఏమీ వర్కౌట్ కాలేదు. అయితే ఉన్నంతలో వంకలు పెట్టకుండా ఆకట్టుకుంది. కానీ కొన్ని కాస్ట్యూమ్స్ లో హీరోకంటే పెద్ద వయసు ఉన్న మహిళలా కనిపించింది. దానిమీద ఫోకస్ పెట్టాల్సింది. ఇక అజయ్ ఘోష్, గోపరాజు రమణ, శ్రీకాంత్ అయ్యంగార్, రాం ప్రసాద్, సత్య, వెన్నెల కిషోర్ల పాత్రలు ఒక రేంజ్ లో నవ్వించేస్తాయి. కసిరాజుగా కనిపించిన రాజ్ కుమార్ కసిరెడ్డి కూడా అద్భుతంగా ఆకట్టుకునే పాత్రలో కనిపించాడు.
ఓవరాల్ గా బెదురులంక 2012.. కొన్ని లోపాలున్నా కామెడీ ఇష్టపడే వారికి ఫుల్ మీల్స్