Karna Movie Review: ఈ మధ్య కాలంలో యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న సినిమాలకు మంచి ఆదరణ దక్కుతోంది. ఈ క్రమంలోనే స్నేహం గొప్పతనాన్ని చాటి చెప్పేలా ఒక భారీ యాక్షన్ ఎంటర్టైనర్ తెరకెక్కింది. కర్ణ పేరుతో సనాతన క్రియేషన్స్ బ్యానర్ పై కళాధర్ కొక్కొండ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తూనే స్వీయ నిర్మాణంలో హీరోగా నటించారు. ఈ సినిమా ట్రైలర్ ను దిల్ రాజు రిలీజ్ చేయడంతో ఈ సినిమా మీద అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చేసిన ఈ సినిమా ఎలా ఉంది అనేది రివ్యూలో చూద్దాం.
కథ:
కర్ణ(కళాధర్ కొక్కొండ) మూడు హత్యలు చేసి జైలు జీవితం గడిపి నుంచి బయటకు వస్తాడు. బయటకు రాగానే అన్న(దిల్ రమేష్)తో కలిసి గంజా కొనేందుకు వేరే ప్రాంతానికి వెళ్లి వస్తూ స్నేహితుడిని మోసం చేశానని చెబుతున్న వ్యక్తిని దారుణంగా చంపుతాడు. అతన్ని మాత్రమే కాదు ఆ తరువాత కూడా అనూహ్యంగా స్నేహితులను మోసం చేసిన వారిని టార్గెట్ చేసి చంపుతూ ఉంటాడు. అలా ఒక సారి మినిస్టర్ కొడుకుని కూడా చంపడంతో పోలీసులు కర్ణ కోసం వల పన్నారు. మరి పోలీసుల వలలో కర్ణ చిక్కుకున్నాడా? అసలు కర్ణ ఎందుకు స్నేహితులను మోసం చేసిన వారిని చంపుతున్నాడు? ప్రేమించిన ఫాతిమాను వివాహం చేసుకున్నాడా? చిన్ననాటి నుంచి కలిసి పెరిగిన పండు(మహేందర్) ఏమయ్యాడు? అనే విషయాలు సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.
విశ్లేషణ:
రియాలిటీకి దగ్గరగా ఉన్న సినిమాలు ఈ మధ్యకాలంలో సూపర్ హిట్ సాధిస్తున్న క్రమంలో అదే బాటలో యదార్థ సంఘటనల ఆధారంగా భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా కర్ణ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు కళాధర్. ఆయన హీరోగా నటిస్తూ డైరెక్ట్ చేస్తూ నిర్మించిన ఈ సినిమా ఓపెనింగ్ నుంచి హీరో క్యారెక్టర్ ను ఎస్టాబ్లిష్ చేస్తూ వచ్చారు. ఎప్పుడూ ఎదో ఒక లోకంలో ఉన్నట్లు అనిపించినా స్నేహానికి ద్రోహం జరుగుతుంది అంటే ఏమాత్రం సహించని వ్యక్తిగా ఎస్టాబ్లిష్ చేశారు. ఇక స్నేహానికి ద్రోహం అంటే చంపడానికి కూడా వెనుకాడని విధంగా కర్ణ ఎలా రాటు దేలాడు? అనే విషయాన్ని చాలా కన్విన్సింగ్ గా చెప్పడంలో డైరెక్టర్ సఫలం అయ్యాడు. అయితే కథగా బాగానే ఉన్నా స్క్రీన్ ప్లే మీద కూడా కొంత ఫోకస్ పెట్టి నటీనటులను కూడా కాస్త పేరున్న వారిని తీసుకుని ఉంటే ప్రేక్షకులకు మరింతగా కనెక్ట్ అయి ఉండేది.
నటీనటులు:
హీరోగా నటించిన ‘కళాధర్ కొక్కొండ’ కొత్త అని ఏమాత్రం అనిపించకుండా చాలా ఈజ్ తో ఇంటెన్సిటీతో నటించారు. హీరోయిన్ గా మోనా ఠాకూర్ తన పరిధి మేరకు ఆకట్టుకుంది. సాంగ్స్ లో గ్లామరస్ గా కనిపించింది. ఇక ఛత్రపతి శేఖర్, దిల్ రమేష్, మహేందర్, ప్రసాద్, నూకరాజు, అజయ్, ఎజాస్, ప్రియ, ఆస్మా సయ్యద్ వంటి వారు తమ తమ పాత్రల పరిధి మేరకు ఆకట్టుకున్నారు. ఛత్రపతి శేఖర్, దిల్ రమేష్ మినహా మిగతా వారంతా కొత్త వారే అయినా వచ్చిన అవకాశాన్ని బాగా వాడుకున్నారని చెప్పాలి..
టెక్నికల్ టీమ్:
ఈ సినిమాలో హీరోగా నటించిన కళాధర్ అలా నటిస్తూనే మరోపక్క డైరెక్టర్ గా నిర్మాతగా వ్యవహరించారు. అయితే కళాధర్ లో నటుడు-రచయిత పోటీపడినట్లు అనిపించింది. డైరెక్టర్ గా స్క్రీన్ ప్లే విషయంలో మరింత జాగ్రత్త తీసుకుని ఉంటే బాగుండేది. అయితే నటుడిగా ఆకట్టుకున్న ఆయన డైలాగులతో కూడా మెప్పించారు. ఇక చివరలో సెంటిమెంట్ సీన్ అయితే ఊహించని విధంగా ఉంటుంది. సినిమాకు ప్రశాంత్ అందించిన సంగీతం కంటే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మరింత వర్క్ అవుట్ అయింది. ఎడిటింగ్ టేబుల్ మీద మరింత శ్రద్ధ పెట్టాల్సింది. ఇక శ్రవణ్ కుమార్ సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. నిర్మాణ విలువలు సినిమాకి తగినట్టు ఉన్నాయి.
ప్లస్ పాయింట్లు
కథ, డైలాగులు
బ్యాక్ గ్రౌండ్ స్కోర్
మైనస్ పాయింట్లు
స్క్రీన్ ప్లే
నిడివి
బాటమ్ లైన్: ఫ్రెండ్షిప్ ఈజ్ ఎవ్రీథింగ్ అనిపించే సినిమా.