బ్రహ్మాజీ, శత్రు, మాస్టర్ మహేంద్రన్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘కర్మణ్యే వాధికారస్తే’ టైటిల్ తో ఆసక్తి రేకెత్తించింది. సస్పెన్స్ ఇన్వెస్టిగేటివ్ మిస్టరీ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా నేడు(అక్టోబర్ 31) ప్రేక్షకుల ముందుకు రాగా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.
కర్మణ్యే వాధికారస్తే కథ :
సినీస్టార్ పృథ్వీ(పృథ్వీ) ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురై ఓ వ్యక్తి మరణించడంతో ఆ కేసును ఏసీపీ అర్జున్ (శత్రు) విచారిస్తుంటాడు. చనిపోయిన వ్యక్తి మృతదేహాన్ని స్వాధీనం చేసుకునేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో ఆ వ్యక్తి గురించి ఆరా తీయగా ఫేక్ ఆధార్ తో నగరానికి వచ్చినట్లుగా గుర్తిస్తాడు. మరోవైపు యాడ్ ఫిల్మ్‌మేకర్ జై(మాస్టర్ మహేంద్ర) అమ్మాయిలను ట్రాప్ చేసి, రేప్ చేసి హత్యలు చేస్తుంటాడు. మరోపక్క సస్పెండ్ అయిన హెడ్ కానిస్టేబుల్ కీరిటీ(బ్రహ్మాజీ).. చెక్‌పోస్ట్ దగ్గర డ్యూటీ చేస్తున్న సమయంలో తీవ్రంగా గాయపడ్డ ఓ బాలిక కనపడడంతో ఆమెను ఆస్పత్రిలో చేర్పించి, పరీక్షలు చేయించగా.. అత్యాచారానికి గురైనట్లుగా తెలుస్తుంది. ఆమెను కొంతమంది గ్యాంగ్ రేప్ చేశారని తెలుస్తుంది. అయితే బాలికను తన ఇంట్లోని ఉంచుకొని చికిత్స అందిస్తుంటాడు. వేర్వేరుగా జరిగిన ఈ మూడు కేసుల వెనుక ఉన్నది ఎవరు? ఎందుకు చేశారు? ఆపరేషన్ జిస్మత్ అంటే ఏంటి? జిష్ణు ఎవరు? ఇందులో హానీ ట్రాప్ ఎవరు చేయించారు? ఎందుకు చేశారు? ఫిల్మ్‌మేకర్ జైకి జిష్ణుకి ఉన్న సంబంధం ఏంటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ:
ఈ మధ్యకాలంలో ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ సినిమాలో బాగా వర్క్ అవుట్ అవుతున్నాయి ముఖ్యంగా ఓటీడీలో వస్తున్న ఈ తరహా సినిమాలు ఏ భాషలో ఉన్న ప్రేక్షకులు ఆదరిస్తున్నారు.. ఇది కూడా ఒక రకమైన సస్పెన్స్ ఇన్వెస్టిగేటివ్ మిస్టరీ థ్రిల్లర్. స్టూడెంట్ మర్డర్స్, మిస్సింగ్ కేసులు, కిడ్నాప్‌లు.. ఇలా మనం ప్రతిరోజూ టీవిలో పేపర్స్ లో చూసే సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు అమర్ దీప్. ఇటీవల ఎక్కువ నమోదు అవుతున్న హానీట్రాప్ అంశాన్ని చూపించిన తీరు ఆకట్టుకుంది. మూడు రకాల క్రైమ్స్.. వాటి వెనుక ఎవరో ఒకరే ఉన్నారనే విషయం తెలిసినా.. ఆ ఒకరు ఎవరనేది మాత్రం ఎండింగ్ వరకు తెలియకుండా దర్శకుడు సెస్పెన్స్ మెయింటైన్ చేసిన తీరు ఆకట్టుకుంది. ఒక్కో ట్విస్ట్ రివీల్ అవుతుంటే.. అసలు కథ భలే అనిపిస్తుంది. ఫస్టాఫ్ మొత్తం మూడు కేసులు..విచారణ చుట్టునే తిరిగే సినిమా ఇంటర్వెల్ సీన్ సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. ఇక సెకండ్ హాఫ్ లో మూడు కేసుల వెనుక ఉన్నదెవరు? వారి లక్ష్యం ఏంటి? అనేది చూపించారు. ఫస్టాపఫ్ లో కన్ఫ్యూజింగ్ గా అనిపించిన సన్నివేశాలకు సెకండాఫ్‌లో జస్టిఫికేషన్ ఇచ్చారు. స్క్రీన్‌ప్లే విషయంలో ఇంకాస్త జాగ్రత్త తీసుకొని ఉంటే సినిమా ఫలితం మరోలా ఉండేదనీ చెప్పొచ్చు.
ఈ సినిమాలో నటీనటుల విషయానికి వస్తే ఏసీపీ అర్జున్‌గా శత్రు ఆకట్టుకున్నాడు. పలు సినిమాల్లో నెగెటివ్ పాత్రల్లో కనిపించిన శత్రు..ఇందులో హీరో లాంటి పాత్రలో నటించి మెప్పించాడు. యాడ్ ఫిల్మ్‌మేకర్ జైగా మాస్టర్ మహేంద్ర తనదైన నటనతో మెప్పించాడు. బ్రహ్మాజీ చాలా రోజుల తర్వాత మరోసారి పోలీసు పాత్రలో నటించగా ఆయన పాత్ర చేసే ఇన్వెస్టిగేషన్ ఆసక్తికరంగా ఉంటుంది. బెనర్జీ, పృథ్వి, శివాజీ రాజా, అజయ్ రత్నం, శ్రీ సుధా, కృష్ణ భట్‌తో పాటు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రల పరిధిమేర నటించారు. నటీనట్ల విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్ అంతా కన్ఫ్యూజ్ చేసిన దర్శకుడు సెకండ్ హాఫ్ లో ఒక్కొక్క విషయాన్ని రివీల్ చేస్తూ వెళ్లిన తీరు ఆకట్టుకుంటుంది. సినిమాటోగ్రఫీ సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉంది. పాటలు పెదగా లేవు కానీ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకి మంచి ప్లస్ పాయింట్ అనే చెప్పాలి. నిడివి విషయంలో ఇంకా కత్తెరకు పని చెబితే సినిమా రిజల్ట్ మరోలా ఉండేదేమో.
ఫైనల్లీ : కర్మణ్యే వాధికారస్తే..ఓ సస్పెన్స్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ విత్ ఎంగేజింగ్ మూమెంట్స్.