Kali Movie Review: ప్రిన్స్, నరేష్ అగస్త్య లీడ్ రోల్స్‌లో నటించిన తాజా చిత్రం ‘కలి’. శివ శేషు డైరెక్ట్ చేసిన ఈ సినిమాను కె.రాఘవేంద్ర రెడ్డి సమర్పణలో లీలా గౌతమ్ వర్మ నిర్మించారు. టీజర్, ట్రైలర్ తో అంచనాలు పెంచిన కలి మూవీ శుక్రవారం అక్టోబర్ 4న థియేటర్లలో రిలీజైంది. అలాంటిది ఈ మూవీ ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.
‘కలి’ కథ:
శివరామ్(ప్రిన్స్) ఒక పెద్ద యూనివర్సిటీలో జువాలజీ ప్రొఫెసర్. ఎవరు ఏ సహాయం అడిగినా కాదనకుండా చేస్తుండే అతన్ని ప్రేమించి వేద(నేహా కృష్ణన్), పెద్దలను ఎదురించి పెళ్లి చేసుకొంటుంది. అయితే శివరామ్ మంచితనం వల్ల అందరూ అతన్ని మోసం చేయడంతో ఆస్తులన్నీ పోగొట్టుకొంటాడు. చివరకు డిప్రెషన్‌లోకి వెళ్లి సూసైడ్‌కు ప్రయత్నించడంతో ఇష్టపడి పెళ్లి చేసుకున్న భార్య వేద కూడా అతన్ని వదిలేసి ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది. మరోసారి శివరామ్ ఉరి వేసుకునే సమయానికి.. కలియుగాన్ని పాలించే కలి పురుషుడు (నరేష్ అగస్త్య) ఎంట్రీ ఇస్తాడు. ఆ తర్వాత శివరాం, కలి మధ్య ఏం జరిగింది? అసలు కలి పురుషుడు ఎందుకు శివరామ్ దగ్గరికి వచ్చాడు? శివరామ్ కు అసలు కష్టాలకు రీజన్ ఏమిటి? శివరామ్ సూసైడ్ చేసుకున్నాడా? శివరామ్ ని వదిలి వెళ్లిన తన భార్య వేద మళ్ళీ వస్తుందా? లేదా? అసలు శివరామ్ కోసం కలి ఎందుకు వచ్చాడు? లాంటి విషయాలు తెలియాలంటే కలి సినిమాను థియేటర్లో చూడాల్సిందే.
విశ్లేషణ:
సినిమానే ఆత్మహత్యలకు వ్యతిరేకంగా తెరకెక్కించిన సినిమా అని ముందు నుంచి సినిమా యూనిట్ ప్రచారం చేస్తూ వచ్చింది. నిజానికి జీవితంలో సమస్యలు ఎదురైతే సూసైడ్ పరిష్కారం కాదు అనేదే సినిమాలో ప్రధానంగా చూపారు. మరణం వల్ల జరిగేది ఏమిటి? జరగనిది ఏమిటి? అనేవి చూపిస్తూ మంచి పాయింట్‌తో కథ రాసుకున్నాడు డైరెక్టర్. ఫస్టాఫ్ కథలోకి వెళ్లడానికి కొంత టైమ్ తీసుకున్నా సెకండాఫ్‌లో కలి, శివరాం మధ్య నడిపించిన డ్రామా, ఎమోషన్స్ అద్బుతంగా ఉన్నాయి. నిజానికి ప్రయోగాత్మక చిత్రమే అయినా భావోద్వేగాలను బాగా పండించే ప్రయత్నం చేసి అందులో చాలావరకు సఫలం అయ్యేడు డైరెక్టర్. అయితే ఎమోషన్స్ ఇంకా బలంగా రాసుకుని ఉంటే ఇంకా బెటర్‌గా ఉండేదనిపిస్తుంది. సినిమా ఫస్టాఫ్ లో నాలుగు యుగాల గురించి సీన్, సినిమా మధ్యలో కలి నివాసం సీన్ చాలా ఆసక్తి రేకెత్తించేలా ఉన్నాయి. ఐతే, కలియుగాన్ని ఏలే కలి పురుషుడు భూమ్మీదకు రావడమేంటి? చనిపోవాలనుకునే మనిషితో డిస్కషన్ పెట్టడమేంటి అనే అనుమానాలు కలిగినా ఈరోజు సినిమాల్లో లాజిక్స్ ఎక్కడ వెతకగలం చెప్పండి.. ఫీలింగ్ కలిగిస్తోంది. సినిమా నిడివి గంటన్నరే ఉండడం కలికి కలిసొచ్చింది.
నటీనటుల విషయానికి వస్తే:
శివరామ్ పాత్ర చేసిన ప్రిన్స్ భలే నటించాడు. డిఫరెంట్ ఎమోషన్స్ పలికిస్తూ ఆకట్టుకున్నాడు. ఇక కలి పురుషుడిగా చేసిన నరేష్ అగస్త్య సెటిల్డ్ పెర్ఫామెన్స్ ఇచ్చాడు. వేదగా చేసిన నేహా కృష్ణ పర్వాలేదనిపించింది. మిగిలిన పాత్రధారులు అంతా తమ పరిధి మేరకు ఆకట్టుకున్నారు. ఇక టెక్నికల్ అంశాల విషయానికొస్తే డైరెక్టర్ ప్రయోగాత్మకంగా, డిఫరెంట్ సినిమాతో ఎంట్రీ ప్లాన్ చేసుకున్నాడు. చెప్పాలనుకున్న విషయాన్ని ఫెర్ఫెక్ట్‌గా చెప్పడంలో సక్సెస్ అయ్యాడు. గ్రాఫిక్స్, వీఎఫ్ఎక్స్ అంశాలు సినిమాను రిచ్‌గా మార్చాయి. జీవన్ బాబు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు తగ్గట్టు ఉంది. ఎడిటర్ విజయ్ పనితనం బాగుంది. నిశాంత్ కొటారి, రమణ జాగర్లమూడి సినిమాటోగ్రఫి సన్నివేశాలను మరింతగా ఎలివేట్ చేసేలా ఉన్నాయి. కలి పాత్ర, కలి నివాసం డిజైన్ ప్రేక్షకులను మెప్పిస్తాయి. నిర్మాణ పరంగా చిన్న సినిమా అయినా బాగానే ఖర్చు పెట్టి తీశారు నిర్మాతలు.
ఫైనల్లీ ఎలాంటి అంచనాలు లేకుండా వెళితే ఓ డిఫరెంట్ సినిమా చూశామనే ఫీలింగ్ తో బయటకొస్తారు.