NTV Telugu Site icon

Kabzaa Movie Review: కబ్జా

Kabzaa

Kabzaa

Kabzaa Movie Review: కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర నటించిన తొలి పాన్ ఇండియా సినిమా ‘కబ్జా’. పునీత్ రాజ్ కుమార్ జయంతి సందర్భంగా శుక్రవారం ఈ సినిమా వివిధ భాషల్లో గ్రాండ్ గా రిలీజైంది. ఆర్. చంద్రు స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ‘కబ్జా’ను తెలుగులో ప్రముఖ నిర్మాత, పంపిణీదారుడు సుధాకర్ రెడ్డి విడుదల చేశారు. భారీ అంచనాలతో తెరకెక్కిన ‘కబ్జా’ఎలా ఉందో చూద్దాం.

పాన్ ఇండియా మూవీ ‘బాహుబలి’ తర్వాత వచ్చిన కన్నడ చిత్రం ‘కేజీఎఫ్’ కూడా జాతీయ స్థాయిలో చక్కని విజయాన్ని సొంతం చేసుకుంది. ‘బాహుబలి: ది కన్ క్లూజన్’ తరహాలోనే ‘కేజీఎఫ్’ సీక్వెల్ సైతం రికార్డులు సృష్టించింది. దాంతో కన్నడ చిత్రసీమలోని కొందరు దర్శక నిర్మాతలకు పాన్ ఇండియా ఫీవర్ పట్టుకుంది. అలా తెరకెక్కింది ఉపేంద్ర తాజా చిత్రం ‘కబ్జా’. పూర్తి స్థాయిలో ‘కేజీఎఫ్‌’ ఫార్మాట్ ను ఇది కబ్జా చేసేసింది. బహుశా అందుకే ‘కబ్జా’ అని పేరు పెట్టారేమో! స్వాతంత్ర సమరయోధుడి కొడుకైన అర్కేశ్వర్ దేశాన్ని శాసించే అండర్ వరల్డ్ డాన్ ఎలా అయ్యాడన్నది ఈ చిత్ర కథ.

భారతదేశం స్వాతంత్రాన్ని పొందిన తర్వాత అమరాపురం సంస్థానాధిపతి వీర బహదూర్ (మురళీశర్మ) కు నలువైపుల నుండి చిక్కులు ఎదురవుతాయి. అతని కూతురు మధుమతి (శ్రియా)ని పైలెట్ ట్రైనింగ్ పొందుతున్న అర్కేశ్వర్ (ఉపేంద్ర) ప్రేమిస్తాడు. కానీ ఊహించని విధంగా అతని అన్నను లోకల్ గూండాలు మట్టుపెడతారు. దాంతో తప్పనిసరి పరిస్థితుల్లో అర్కేశ్వర్ సైతం రౌడీగా మారతాడు. అతన్ని ప్రేమించిన మధుమతి, తండ్రిని ఎదిరించి అర్కేశ్వర్ ను పెళ్ళిచేసుకుంటుంది. అండర్ వరల్డ్ వర్గాలకు చుక్కలు చూపిస్తూ… అర్కేశ్వర్ సైతం దేశంలోనే అతి పెద్ద డాన్ గా అవతరిస్తాడు. అతనిపై కక్ష పెంచుకున్న వీర బహుదూర్ ప్రభుత్వ సాయం తీసుకుని అర్కేశ్వర్ కు ఎలా చెక్ పెట్టాడన్నది మిగతా కథ.

‘కబ్జా’ను రెండు భాగాలుగా రూపొందించారు. తాజాగా విడుదలైన ప్రధమభాగంలో అర్కేశ్వర్ అంచెలంచెలుగా అండర్ వరల్డ్ డాన్ ఎలా అయ్యాడన్నది చూపించారు. ఇటు అర్కేశ్వర్ కు, అటు ప్రభుత్వ బలగాలతో వచ్చిన పోలీస్ అధికారి సుదీప్ కు నడుమ శివరాజ్ కుమార్ పాత్ర ఎంట్రీ ఇవ్వడంతో ఈ భాగానికి ఫుల్ స్టాప్ పడింది. సో… ‘కబ్జా’ సీక్వెల్ లో శివరాజ్ కుమార్, సుదీప్ పాత్రలు పూర్తి స్థాయిలో కనిపించబోతున్నాయి. చిత్రం ఏమంటే… ‘కబ్జా’ మూవీ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకూ ‘కేజీఎఫ్’ పోకడలోనే సాగింది. కథా కథనాలన్నీ ఆ సినిమానే గుర్తు తెస్తాయి. సినిమా మొత్తం వాయిస్ ఓవర్ లోనే సాగింది. అందులో మాదిరి గానే ఇందులోనూ ఆరేడు మంది విలన్స్ ఉన్నారు. ప్రతి క్యారెక్టర్ కూ గ్రాండ్ ఎంట్రీని డిజైన్ చేశారు. ప్రతి సీన్ ఓ క్లయిమాక్స్ అన్నట్టుగా తీశారు. ‘కేజీఎఫ్’కు ఎక్కడా తగ్గకూడదన్నట్టుగా యాక్షన్ పార్ట్ ను భారీగా చిత్రీకరించారు. కానీ మూవీలో సోల్ మిస్ అయ్యింది. ఏ సీన్ కు ఆ సీన్ రిచ్ గా ఉన్నా… ఎలాంటి భావోద్వేగాలను కలిగించలేకపోయాయి. దాంతో నటీనటులు, సాంకేతిక నిపుణుల కృషి మొత్తం బూడిదలో పోసిన పన్నీరే అయ్యింది. గతంలోని దర్శకుడు ఆర్. చంద్రు తీసిన సినిమాలను చూసి వారికి ‘కబ్జా’ మింగుడుపడదు.

ఉపేంద్ర, శ్రియా, మురళీశర్మ, సుధ, కబీర్ దుహాన్ సింగ్, అవినాశ్, దేవ్ గిల్ తదితరులు ఇందులో కీలక పాత్రలు పోషించారు. పోసాని, కోట మెరుపులా మెరిసి మాయమయ్యారు. తన్యా హోప్ ఐటమ్ సాంగ్ లో నర్తించింది. కెమెరామెన్ ఎ. జె, మ్యూజిక్ డైరెక్ట‌ర్ ర‌వి బస్రూర్ పనితనం మెచ్చుకోదగ్గదే. కానీ ‘కేజీఎఫ్’ పోకడలోనే ఈ రెండూ ఉండటంతో ‘కబ్జా’ కంటూ ప్రత్యేకత లేకుండా పోయింది. విషయం తక్కువ బిల్డప్ లెక్క అన్నట్టుగా మూవీ సాగింది. ట్రైలర్ చూసి భారీ అంచనాలతో థియేటర్ కు వచ్చిన ప్రేక్షకులు ఉసూరుమనాల్సిందే! ఉపేంద్ర, సుదీప్, శివరాజ్ కుమార్ లకు ఉన్న ఇమేజ్ కారణంగా కన్నడనాట ఈ చిత్రానికి ఓపెనింగ్స్ ఏమైనా వస్తాయేమో కానీ… ఇతర భాషల్లో నిరాశ తప్పదు.

రేటింగ్: 2/ 5

ప్లస్ పాయింట్స్
ప్రొడక్షన్ వాల్యూస్
సినిమాటోగ్రఫీ, మ్యూజిక్

మైనెస్ పాయింట్స్
బలహీనమైన కథ
పండని సెంటిమెంట్
అపరిమితమైన యాక్షన్ సీన్స్

ట్యాగ్ లైన్: ‘కేజీఎఫ్’ ప్యాట్రన్ కబ్జా!

Show comments