హారర్, కామెడీలను మేళవించి సినిమాలను తెరకెక్కించడం ఒక ఆర్ట్. ఒకప్పుడు ఈ తరహా సినిమాలు తెలుగులో చాలా వర్కౌట్ అయ్యాయి కూడా. చాలాకాలం తర్వాత అటువంటి కోవలోనే విభిన్నమైన ‘జిన్’ అనే సినిమా కూడా దాదాపుగా అదే కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సాదలమ్మ ఫిల్మ్ ప్రొడక్షన్స్ మరియు బిల్వ స్టూడియోస్ బ్యానర్లపై నిఖిల్ ఎం. గౌడ నిర్మించిన ఈ చిత్రానికి చిన్మయ్ రామ్ దర్శకత్వం వహించారు. డిసెంబర్ 19న విడుదలైన ఈ మూవీ ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో సినిమా రివ్యూలో చూసి తెలుసుకకొందాం.
జిన్ కథ:
ఒక పాడుబడిన కాలేజీ భవనం, అక్కడి లైబ్రరీలో జరిగే వింత సంఘటనల చుట్టూ ఈ సినిమా కథ అంతా తిరుగుతుంది. పరీక్షలు రాసేందుకు భూతనాల చెరువు దాటి జ్ఞాన వికాస్ కాలేజ్‌కి వెళ్లిన నలుగురు స్నేహితులకు అక్కడ అనూహ్యమైన పరిస్థితులు ఎదురవుతాయి. ఆ భవనంలో వారు బంధించబడటం, అక్కడ జిన్ సృష్టించే బీభత్సం వారిని ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. అసలు ఆ కాలేజీ చరిత్ర ఏమిటి? ఆ బిల్డింగ్‌లో ఆత్మలు ఎందుకు ఉన్నాయి? జిన్ బారి నుండి ఆ కుర్రాళ్లు ఎలా తప్పించుకున్నారు? అనేది బిగ్ స్క్రీన్ మీద చూసి తెలుసుకోవాల్సిందే.
సినిమా విశ్లేషణ:
సినిమా ప్రారంభం నుండే దర్శకుడు ఒక విధమైన ఉత్కంఠను కలిగించడంలో సఫలమయ్యారు. నలుగురు కుర్రాళ్ల అల్లరి చేష్టలు, వారి మధ్య సాగే సంభాషణలు ప్రేక్షకులను నవ్విస్తాయి. అయితే, కాలేజీ భవనంలోకి ప్రవేశించిన తర్వాత వారు ఎదుర్కొనే ఇబ్బందులు, భవనం నుండి బయటకు రాలేకపోవడం వంటి సీన్లు ఉత్కంఠను పెంచుతాయి. ఇంటర్వెల్ ముందు వచ్చే చిన్న ట్విస్ట్ సినిమాపై ఆసక్తిని కలిగిస్తుంది. అయితే సెకండాఫ్‌లో అసలు కథ మొదలవుతుంది. జిన్ ఎంట్రీ ఇవ్వడం, పోలీసుల ఇన్వెస్టిగేషన్, ఆ భవనానికి సంబంధించిన గతం వంటి అంశాలను దర్శకుడు ఆసక్తికరంగా మలిచారు. ప్రీ-క్లైమాక్స్ వరకు కథను పట్టుగా నడిపించిన తీరు బాగుంది. ముఖ్యంగా క్లైమాక్స్ అందరినీ ఆకట్టుకుంటుంది. ఇక సెకండ్ పార్ట్‌కు మంచి లీడ్ ఇస్తూ సినిమాను ముగించడం ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురిచేస్తుంది. నటీనటుల విషయానికి వస్తే సెకండాఫ్‌లో అమిత్ రావ్ ఎంట్రీ సినిమాకు ప్రధాన బలం. కేవలం కంటి చూపుతోనే భావాలను పలికిస్తూ, సెటిల్డ్ పర్ఫామెన్స్‌తో ఆకట్టుకున్నాడు. పర్వేజ్ సింబా కూడా తన నటనతో సినిమాకు నిండుదనాన్ని తీసుకొచ్చాడు. హీరో ఫ్రెండ్స్ గ్యాంగ్ టైమింగ్, కామెడీ సినిమాలో నవ్వులను పూయించాయి. పోలీస్ ఆఫీసర్ & ఇతర పాత్రలు తమ పరిధి మేరకు బాగానే ఒదిగిపోయారు. తెలుగు ప్రేక్షకులకు వీరు కొత్తగా అనిపించినా, నటనలో మాత్రం మెప్పించారు.
సాంకేతిక విభాగం విషయానికి వస్తే సాంకేతికంగా ఈ సినిమా ఉన్నత ప్రమాణాలతో ఉంది. సునీల్ కాలేజీ సెట్టింగ్స్‌ను, భయానక వాతావరణాన్ని కెమెరాలో అద్భుతంగా బంధించారు. హారర్ సినిమాలకు ప్రాణం పోసేది సంగీతమే. అలెక్స్ అందించిన నేపథ్య సంగీతం థియేటర్లలో ప్రేక్షకులకు మంచి థ్రిల్లింగ్ అనుభూతిని ఇస్తుంది. నిర్మాత నిఖిల్ ఎం. గౌడ ఖర్చు విషయంలో ఎక్కడా రాజీ పడలేదని లొకేషన్లు మరియు సెట్లను చూస్తే అర్థమవుతోంది.
ఫైనల్ గా ‘జిన్’ మూవీ నవ్విస్తూనే భయపెట్టడంలో కొంతవరకు సక్సెస్ అయింది. హారర్, మిస్టరీ థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే వారికి మాత్రమే.