Inti Number 13 Movie Review: తెలుగు భాష అనే కాదు దాదాపు అన్ని భాషల్లో హారర్ మూవీస్ అంటే ఎప్పుడూ పడిచచ్చేంత క్రేజ్ ఉంటుంది. ఈ దెయ్యాలు, ప్రేతాత్మలకు సంబంధించిన కథలతో ఎన్నో సినిమాలు వచ్చాయి, ఇంకా వస్తూనే ఉన్నాయి. అయితే కొందరు దర్శకులు అదే నేపథ్యంగా ఎంచుకున్నా, వైవిధ్యం ఉన్న కథలతో, ఇప్పటి వరకు ఎవరూ టచ్ చేయని పాయింట్ తీసుకొని కొత్తదనాన్ని చూపించే ప్రయత్నం చేస్తుంటారు. అలా దర్శకుడు పన్నా రాయల్ కాలింగ్ బెల్, రాక్షసి వంటి హారర్ మూవీస్ చేశారు. ఇప్పుడు తన మూడో చిత్రంగా ‘ఇంటి నెం.13’ను తెరకెక్కించగా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. టీజర్, ట్రయిలర్ తో ప్రేక్షకులను భయపెట్టిన ఈ సినిమా ఎలా ఉంది అనేది రివ్యూలో చూద్దాం పదండి.
కథ :
ఒక పండు ముసలి వ్యక్తి తన జీవితంలో ప్రేతాత్మల నుంచి ఎంత మందిని కాపాడానో చెబుతూ ‘ఇంటి నెం.13’ అనే ఒక విల్లాకు సంబంధించిన కథ చెబుతాడు. ఆ కధ ప్రకారం అర్జున్ ఒక నవలా రచయిత. ఆయన రాసిన ఓ నవల 10 లక్షల కాపీలు అమ్ముడు పోయిందంటూ అది ప్రింట్ చేసిన పబ్లిషర్ ఫోన్ చేసి చెప్పి బహుమానంగా ఒక విల్లా ఇస్తానని చెప్తాడు. అయితే దాని తాళాలను తన అన్నయ్య సంజయ్‌కి ఇమ్మని చెప్పగా సంజయ్, తన భార్య నిత్య, పనిమనిషి జేజెమ్మతో కలిసి ఆ ఇంట్లో దిగుతాడు. ఆ తర్వాత అర్జున్, నిత్య చెల్లెలు మధు కూడా అదే ఇంటికి వస్తారు. అయితే నిత్యకు తెల్ల ముసుగుతో కూడిన ఆకారాలు కనిపిస్తుంటాయి. కానీ దగ్గరకెళ్లి చూస్తే అక్కడేమీ ఉండదు. దీంతో డిప్రెషన్ లోకి వెళ్లి వింతగా ప్రవర్తిస్తుంటుంది. ఆమెకు చికిత్స చేయించేందుకు డాక్టర్‌ని తీసుకొస్తే అతనికి షాక్ ఇస్తుంది. చివరిగా గజానంద్(ఆనంద్‌రాజ్) రంగంలోకి దిగిఇంట్లో కనిపిస్తున్న తెల్ల ముసుగు ఆకారాలు ఎవరివి? అవి ఏం సాధించడానికి నిత్యను ఆవహించాయి? అనే విషయాలు ఏ విధంగా పరిష్కరించాడనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.
విశ్లేషణ :
హారర్ సినిమా అంటే దెయ్యాలు, ఆత్మలతోనే ఉంటుందని అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఆ లైన్ కి కొంచెం భిన్నంగా ఈ సినిమాను రూపొందించారు. ఏ హారర్ సినిమా అయినా ఒక ఇంట్లో ఆత్మలు కనిపించడంతోనే మొదలవుతుంది. ఈ సినిమాలో కేసుల సమస్య అలాంటిదే అయినా దాన్ని ప్రేక్షకుల ముందుకు తెచ్చిన విధానం డిఫరెంట్‌గా ఉంది. సినిమా మొదలైనప్పటి నుంచి చివరి దాకా బోర్ కొట్టకుండా నడిపించే విషయంలో దర్శకుడు పన్నా రాయల్ చేసిన ప్రయత్నం చాలా చోట్ల కనిపిస్తుంది. ఇక మధ్యమధ్యలో ట్విస్టులు కూడా థ్రిల్ కి గురి చేసేలా ఉన్నాయి. ఫస్ట్‌హాఫ్ సంగతి ఎలా ఉన్నా సెకండాఫ్ చాలా గ్రిప్పింగ్‌గా అనిపిస్తుంది. దర్శకుడు పన్నా రాయల్ తను అంతకుముందు చేసిన రెండు సినిమాలకు పూర్తి భిన్నంగా ఈ సినిమాను తెరకెక్కించే ప్రయత్నం చేసి చాలా వరకు సఫలం అయ్యాడు.
నటీనటుల విషయానికి వస్తే ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషించిన నవీద్, శివాంగి మెహ్రా ఆకట్టుకున్నారు. శివాంగి మెహ్రా పెర్‌ఫార్మెన్స్ గుర్తుండిపోతుంది. ఇక ఆనంద్‌రాజ్ తనదైన స్టైల్‌లో గజానంద్ గా మాయ చేశాడు. అతిథి పాత్రల్లో కనిపించిన తనికెళ్ళ భరణి, శ్రీలక్ష్మీ, పృథ్విరాజ్, సుదర్శన్, శివన్నారాయణ, రవివర్మ వారి పాత్రల పరిధి మేరకు నటించారు. సాంకేతిక నిపుణుల విషయానికి వస్తే సినిమాలో వినోద్ అందించిన సంగీతం, నేపధ్య సంగీతం హైలైట్ అయింది. ముఖ్యంగా ఆర్టిస్టుల నుంచి మంచి పెర్‌ఫార్మెన్స్‌ను రాబట్టుకున్నాడు. పి.ఎస్.మణికర్ణన్ సినిమాటోగ్రఫీ సినిమాకి పెద్ద అసెట్. ఎడిటర్ కూడా ల్యాగ్ లేకుండా 2 గంటల 6 నిమిషాలకు క్రిస్పీగా కట్ చేశారు. డైలాగ్స్ కొన్ని బాగున్నాయి. నిర్మాణ విలువలు బాగున్నాయి.
ఫైనల్‌గా హారర్ సినిమాలను ఇష్టపడే వారికి ఈ సినిమా నచ్చుతుంది.