Bangladesh: బంగ్లాదేశ్‌లో హిందూ వ్యక్తి హత్య సంచలనంగా మారింది. రాడికల్ ఇస్లామిస్ట్ విద్యార్థి నేత, ఇంక్విలాబ్ మంచా చీఫ్ షరీఫ్ ఉస్మాన్ హాదిని కాల్చిన తర్వాత బంగ్లాదేశ్ వ్యాప్తంగా హింసాత్మక సంఘటనలు జరిగాయి. మైమన్‌సింగ్ జిల్లాలో హిందూ వ్యక్తి దీపు చంద్ర దాస్‌ను ‘‘దైవ దూషణ’’ చేశాడనే ఆరోపణలపై, మతోన్మాద గుంపు దాడి చేసి చంపేసింది, చనిపోయిన తర్వాత నగ్నంగా ఉన్న శరీరానికి నిప్పటించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Read Also: Phone Tapping Case: ఫోన్ టాంపింగ్ కేసులో కొత్తగా ఏర్పాటైన సిట్ దూకుడు..
అయితే, హత్యకు ముందు దీపు చంద్ర దాస్ పోలీస్ కస్టడీలో ఉన్నట్లు మరో వీడియో వైరల్ అవుతోంది. తాను ఎలాంటి దైవ దూషణ చేయలేదని వారితో చెప్పడం వినవచ్చు. అయితే, అతడిని పోలీసుల నుంచి గుంపు తీసుకెళ్లి హత్య చేసిందా? లేక పోలీసులే వారికి అప్పగించారా? అనే దానిపై సందేహాలు నెలకొన్నాయి. మైమన్‌సింగ్ లోని భలుకాలో ఒక వస్త్ర కర్మాగారంలో పనిచేసే దీపును కొట్టి చంపారు. బంగ్లాదేశ్ ఉగ్రవాద నిరోధక దళం, రాపిడ్ యాక్షన్ బెటాలియన్ కంపెనీ కమాండర్ అక్కడి మీడియాతో మాట్లాడుతూ.. దీపు ఫేస్‌బుక్‌లో మతపరమైన మనోభావాలు దెబ్బతీశాడని సూచించే ఎలాంటి ఆధారాలు లేవని చెప్పారు.
అయితే, ఈ ఘటన మహ్మద్ యూనస్ నేతృత్వంలోని బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం ఈ ఘటనను ఖండించింది. “మైమెన్‌సింగ్‌లో ఒక హిందూ వ్యక్తిని మూకదాడి చేసి చంపడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. కొత్త బంగ్లాదేశ్‌లో ఇటువంటి హింసకు తావు లేదు. ఈ దారుణానికి పాల్పడిన వారిని వదిలిపెట్టబోము” అని యూనస్ కార్యాలయం తెలిపింది.