మలయాళంలో సూపర్ హిట్ అయిన సినిమాలను తెలుగులో రిలీజ్ చేస్తున్న ట్రెండ్ ఈ మధ్య ఎక్కువైంది. ఈ క్రమంలోనే ప్రేమలు హీరో నస్లేన్ కీలక పాత్రలో నటించిన తాజా చిత్రం అలప్పుజా జింఖానా. ఈ సినిమా మలయాళంలో రిలీజ్ అయి సూపర్ హిట్‌గా నిలిచింది. దాన్ని ఈ రోజు తెలుగు ప్రేక్షకుల ముందుకు జింఖానా పేరుతో తీసుకువచ్చారు మేకర్స్. ప్రమోషనల్ కంటెంట్ ఆసక్తికరంగా అనిపించడంతో సినిమా మీద ప్రేక్షకులలో కాస్త అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఈ రోజు రిలీజ్ అయిన ఈ సినిమా ఆ అంచనాలను అందుకుందా లేదా అనేది ఇప్పుడు మన రివ్యూలో చూద్దాం.
జింఖానా కథ: కేరళలోని అలప్పుజ అనే ప్రాంతానికి చెందిన జోజో జాన్సన్ (నస్లేన్) తన స్నేహితులతో కలిసి టైం పాస్ చేస్తూ ఉంటాడు. ఇంటర్ ఫెయిల్ అయిన అతను పాస్ అవ్వాలంటే ఏదైనా స్పోర్ట్స్ క్యాటగిరీ ఉంటే ఈజీగా పాస్ అవచ్చని తెలుసుకుని, తన ఇతర నలుగురు స్నేహితులతో కలిసి లోకల్‌లో ఉన్న జిమ్ఖానాలో బాక్సింగ్ ట్రైనింగ్ కోసం జాయిన్ అవుతాడు. అక్కడ ఆంటోనీ జోషువా (లుక్మన్ అవరన్) దగ్గర ట్రైనింగ్ తీసుకుంటూ స్టేట్ లెవెల్ కాంపిటీషన్‌కి సిద్ధమవుతాడు. అయితే, ఎగ్జామ్ పాస్ అవ్వడం కోసం బాక్సింగ్ ఎంచుకున్న జోజో జాన్సన్ బాక్సింగ్ విషయంలో సీరియస్‌గానే ఉన్నాడా లేక టైం పాస్ చేస్తున్నాడా? స్టేట్ లెవెల్ ఛాంపియన్ అయిన ఆంటోనీ జోషువా ఎందుకు కోచ్‌గా సెటిల్ అవ్వాల్సి వచ్చింది? లాంటి విషయాలు తెలియాలంటే సినిమాని బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే
విశ్లేషణ
ఇది ఒక అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్‌గా రాసుకున్నారు. గాలికి తిరిగే నలుగురు కుర్రాళ్లు అనుకోకుండా బాక్సింగ్ మీద మనసు పారేసుకుంటారు. అలా మనసు పారేసుకున్న తర్వాత వారు ఒక స్టేట్ లెవెల్ కాంపిటీషన్‌కి వెళ్లాల్సి వస్తుంది. అలా వెళ్లిన క్రమంలో వారి పరిస్థితి ఏమిటి? వాళ్లు స్టేట్ లెవెల్ కాంపిటీషన్‌లో గెలిచారా లేదా అనే ఆసక్తికరమైన అంశాలతో ఈ సినిమా తెరకెక్కింది. సినిమా మొదలైనప్పటి నుంచి ఎక్కువగా కామెడీ మీద ఫోకస్ చేస్తూ వచ్చాడు దర్శకుడు. ఎక్కడ వేరే దారి పట్టకుండా కేవలం డైలాగ్ బేస్డ్ కామెడీతో బండి నడిపించే ప్రయత్నం చేశారు. అది చాలా వరకు వర్కౌట్ అయింది. నిజానికి ఒరిజినల్ వర్షన్ ఎలా ఉందో తెలియదు, కానీ తెలుగు కోసం రాసుకున్న డైలాగ్స్ మాత్రం ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించేలా ఉన్నాయి. ముఖ్యంగా ట్రెండింగ్ టాపిక్స్ అయిన అలేఖ్య చిట్టి పికిల్స్ మొదలుపెట్టి వేణు స్వామి, బాలయ్య డైలాగ్స్ వంటి వాటితో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నం చాలా వరకు సఫలం అయింది. నిజానికి సినిమాలో కథ పెద్దగా ఉండదు. కేవలం నలుగురు కుర్రాళ్ల మధ్య వచ్చే సిచువేషనల్ కామెడీతోనే సినిమా అంతా నడుస్తుంది. సినిమా మొదలైనప్పటి నుంచి ఆ విషయం ఈజీగానే ప్రేక్షకులు అర్థం చేసుకునేలా కథ రాసుకున్నాడు డైరెక్టర్. అయితే, కథకు బాక్సింగ్ బ్యాక్‌డ్రాప్ తీసుకోవడం ఆసక్తికర అంశం. కాకపోతే, ఈ బాక్సింగ్ బ్యాక్‌డ్రాప్ సినిమా చూస్తున్న సమయంలో మనకి సార్పట్టా సినిమా జ్ఞాపకం రావడం కొంత ఇబ్బందికర అంశం అయినా, ఎక్కడా బోర్ కొట్టకుండా సినిమా మొత్తం నడిపించడంలో దర్శకుడు కాలిద్ రెహమాన్ సక్సెస్ అయ్యాడు. సినిమాలో లాజిక్స్ వెతక్కుండా ఉంటే ఎంజాయ్ చేసేలా ఉంది.
నటీనటుల విషయానికి వస్తే, నస్లేన్ మినహా మిగతా వాళ్లందరూ మనకి పెద్దగా పరిచయం లేదు. లుక్మన్ కొన్ని సినిమాల్లో నటించాడు కాబట్టి అతన్ని కూడా గుర్తుపట్టొచ్చు. ఇక ఈ సినిమాలో ప్రేమలు తర్వాత కాస్త అలాంటి తరహా పాత్రలోనే నస్లేన్ ఆకట్టుకున్నాడు. ఒకపక్క అమ్మాయిలతో ఫ్లర్ట్ చేస్తూ, మరోపక్క ఎలా అయినా ఇంటర్ పాస్ అయి మంచి భవిష్యత్తుతో ముందుకు వెళ్లాలని తపనపడే ఒక సగటు కుర్రాడిగా ఆకట్టుకున్నాడు. అతని స్నేహితుల పాత్రలో నటించిన వారందరూ కూడా తమదైన ప్రతిభ కనబరిచారు. ఇక సినిమా టెక్నికల్ టీం విషయానికి వస్తే, టెక్నికల్ టీం మొత్తం మార్కులు కొట్టేసింది. సంగీతం, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ రెండింటితో సంగీత దర్శకుడు ఆకట్టుకున్నాడు. సినిమాటోగ్రఫీ ఒక టాప్ నాచ్ లెవెల్‌లో ఉంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. ఎడిటింగ్ కూడా క్రిస్పీగా ఉంది, కానీ సెకండ్ హాఫ్ విషయంలో ఇంకా కేర్ తీసుకుని ఉంటే బాగుండేది. తెలుగు డైలాగ్స్ రాసిన వారిని అభినందించాల్సిందే.
ఫైనల్లీ, ఈ జిమ్ఖానా ఒక అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ విత్ బాక్సింగ్ బ్యాక్‌డ్రాప్.