ఇటీవల “పట్టుదల” అనే సినిమాతో భారీ డిజాస్టర్ మూట కట్టుకున్నాడు తమిళ సూపర్‌స్టార్ అజిత్ కుమార్. ఆయన హీరోగా, “మార్క్ ఆంటోనీ” చిత్ర దర్శకుడు ఆదిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో “గుడ్ బ్యాడ్ అగ్లీ” అనే సినిమా రూపొందింది. తెలుగు నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా, తమ మొదటి తమిళ వెంచర్‌గా నిర్మించింది. అజిత్ సరసన త్రిష హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రం, ప్రమోషనల్ కంటెంట్ ముందు నుంచి ప్రేక్షకులలో ఒక రేంజ్ అంచనాలు ఏర్పడేలా చేసింది. ఈ క్రమంలో ఈ సినిమా ఎలా ఉంది, ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది అనేది ఇప్పుడు మనం రివ్యూలో చూద్దాం.
“గుడ్ బ్యాడ్ అగ్లీ” కథ:
రెడ్ డ్రాగన్ అలియాస్ ఏకే (అజిత్ కుమార్) తన భార్య (త్రిష)కి ఇచ్చిన ఒక మాట కోసం, కన్న కొడుకు (కార్తికేయ దేవ్)ని టచ్ కూడా చేయకుండా జైలు పాలవుతాడు. 17 ఏళ్లు జైల్లో మగ్గిన తరువాత, తన కుమారుడు పుట్టినరోజు నాటికి బయట ఉండాలని జైలు నుంచి రిలీజ్ అవుతాడు. అయితే, సరిగ్గా కుమారుడు పుట్టినరోజు కొద్ది రోజుల్లో ఉండగా, అతనిని డ్రగ్స్ కేసులో అరెస్ట్ చేస్తారు. అసలు తన కుమారుడికి ఆ డ్రగ్స్‌కి సంబంధం లేదని తెలుసుకున్న ఏకే, తన కుమారుడిని ఆ కేసు నుంచి ఎలా విడిపించడానికి ప్రయత్నం చేశాడు? అసలు డ్రగ్స్ కేసులో ఏకే కొడుకు విహాన్‌ను ఇరికించింది ఎవరు? విహాన్ గర్ల్‌ఫ్రెండ్ నిత్య (ప్రియా ప్రకాష్ వారియర్)ను చంపింది ఎవరు? చివరికి తన కుమారుడిని జైలు నుంచి ఏకే విడిపించగలిగాడా లేదా? ఇలాంటి విషయాలు తెలియాలంటే సినిమాని బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే.
విశ్లేషణ:
ముందు నుంచి ప్రచారం జరుగుతున్నట్టుగానే, ఇది ఒక గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామా. గతంలో అజిత్ చేసిన “బిల్లా” లాంటి సినిమాలతో అజిత్‌కి గ్యాంగ్‌స్టర్ అనే ముద్ర తమిళ ప్రేక్షకులలో భారీగానే ఉంది. దానికి తన స్టైలిష్ మేకింగ్‌తో కొత్త సబ్‌గులు అదే ప్రయత్నం చేశాడు. నిజానికి ఇది కొత్త కథ ఏమీ కాదు. తన ఫ్యామిలీ కోసం అన్నీ వదిలేసుకున్న ఒక గ్యాంగ్‌స్టర్, అదే ఫ్యామిలీకి ఇబ్బంది ఎదురైతే ఎంతవరకు తెగించి పోరాడాడు అనే లైన్‌తో ఎన్నో సినిమాలు వచ్చాయి. ఈ సినిమా కూడా దాదాపుగా అదే లైన్‌లో వచ్చింది. అయితే, ఇక్కడ అజిత్ కుమార్ స్టైలిష్ మేక్‌ఓవర్ బాగా కలిసి వచ్చింది. దానికి తోడు వింటేజ్ అజిత్ కుమార్‌ని చాలా చోట్ల చూపించే ప్రయత్నం చేయడంతో, ఒక రేంజ్‌లో సినిమా వర్కౌట్ అయింది. నిజానికి ఇది తెలుగు ప్రేక్షకులకు సంబంధించిన కప్ ఆఫ్ టీ అయితే కాదు. తమిళ ప్రేక్షకుల కోసమే డిజైన్ చేసుకున్నారు. అయితే, అజిత్‌కి తెలుగులో కాస్త మార్కెట్ ఉండడంతో పాటు మైత్రి మూవీ మేకర్స్ సంస్థ కావడంతో, తెలుగులో కూడా రిలీజ్ చేశారు. కానీ, తెలుగు ప్రేక్షకులు ఈ సినిమాని పూర్తిస్థాయిలో కనెక్ట్ కాలేరు. కానీ తమిళ ప్రేక్షకులు, ముఖ్యంగా అజిత్ అభిమానులు మాత్రం ఒక పండగ చేసుకునేలాంటి సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు డైరెక్టర్ ఆదిక్ రవిచంద్రన్. పూర్తిస్థాయిలో అజిత్ ఎలివేషన్స్, అజిత్ మేనరిజంల వంటి వాటిని దృష్టిలో పెట్టుకుని ఈ సినిమా లైన్ రాసుకున్నారు. ఈ సినిమాకి అజిత్ కాకపోతే వేరే హీరో ఎవరూ వర్కౌట్ కాదేమో అన్నట్లుగా కథ రాసుకున్న దర్శకుడు, అజిత్ స్క్రీన్ ప్రెజెన్స్ విషయంలో అంతే మ్యాజిక్ చేశాడు. స్క్రీన్ మీద అజిత్ కనిపించిన ప్రతిసారీ, ఆయన అభిమానులైతే పండగ చేసుకునేలా సినిమా డిజైన్ చేయడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు. ఒకరకంగా సినిమా కథ పెద్దగా ఆసక్తికరంగా లేకపోయినా, రొటీన్ అనిపించినా కూడా, అజిత్ కేవలం స్క్రీన్ ప్రెజెన్స్‌తోనే సినిమా మొత్తాన్ని నడిపించే ప్రయత్నం చేశాడు. ముఖ్యంగా సిమ్రాన్‌తో రాసుకున్న ట్రాక్ అయితే అజిత్ అభిమానులకు ఫీస్ట్.
నటీనటులు:
అజిత్ కుమార్ ఈ సినిమాలో ఎప్పటిలాగే తనదైన ఈజ్‌తో ఆకట్టుకున్నాడు. మనోడికి ఇలాంటి పాత్రలు కొత్తవి కాదు. ఉన్న పాత్రను ఒక రకంగా దుల్ల కొట్టేశాడు. ఇక త్రిష పాత్ర పరిమితమే అయినా, ఆమె ఉన్నంతలో ఆకట్టుకుంది. అజిత్ కుమారుడి పాత్రలో నటించిన కార్తికేయ దేవ్‌కి మరో మంచి పాత్ర దొరికింది. అర్జున్‌దాస్ మరోసారి విలన్‌గా ఒక రేంజ్‌లో తనదైన పాత్రలో ద్విపాత్రాభినయం చేస్తూ ఆకట్టుకున్నాడు. సునీల్ పాత్ర పరిమితమైనా ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. ప్రసన్న పాత్ర కూడా చాలా పరిమితం.
టెక్నికల్ టీం:
ఫైట్స్ డిజైన్ చేసిన తీరు ప్రేక్షకులను తిరిగి చేసేలా ఉంది. అలాగే, సినిమా కోసం అజిత్ లుక్ విషయంలో జాగ్రత్తలు పడ్డారు. ఆర్ట్ డిపార్ట్‌మెంట్ పనితీరు ప్రతి ఫ్రేమ్‌లో కనిపించింది. అలాగే, అజిత్ కుమార్ మీద కంప్యూటర్ గ్రాఫిక్స్ వాడారో లేకపోతే ఇంకేమైనా చేశారో తెలియదు, కానీ అజిత్ ఫ్యాన్స్ ఎలా చూడాలని కోరుకుంటారో అలా చూపించడంలో టీం సక్సెస్ అయింది. కథ కొత్తగా లేకపోయినా, థ్రిల్ చేసే ఎలిమెంట్స్ ఉండేలాగా రాసుకున్నాడు డైరెక్టర్. తెలుగు డైలాగ్స్ కూడా ఆకట్టుకునేలా ఉన్నాయి. పాటలు పెద్దగా గుర్తుంచుకునేలా అయితే లేవు, కానీ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మాత్రం బాగుంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణ విలువలు అత్యద్భుతంగా ఉన్నాయి.
ఫైనల్‌గా: ఈ “గుడ్ బ్యాడ్ అగ్లీ” ఫ్యాన్స్ అండ్ యాక్షన్ లవర్స్‌కి ఫీస్ట్, కామన్ ఆడియన్స్‌కి ఒక వర్త్ వాచ్.