Gaandeevadhari Arjuna Movie Review: వరుణ్ తేజ్ హీరోగా సాక్షి వైద్య హీరోయిన్ గా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం గాండీవధారి అర్జున. గతంలో గరుడ వేగ లాంటి సూపర్ హిట్ ఇచ్చిన ప్రవీణ్ సత్తార్ అలాంటి కథతోనే ఈ సినిమా చేస్తున్నట్లు ప్రకటించినప్పటి నుంచి సినిమా మీద అంచనాలు ఏర్పడ్డాయి. భోగవల్లి బాపినీడు భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా ఎట్టకేలకు శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మెగా హీరో వరుణ్ తేజ్ ప్రేక్షకులను ఈ సినిమాతో ఎంతవరకు ఆకట్టుకున్నాడు? ఈ సినిమా ఎంతవరకు మెప్పించింది అనేది సినిమా రివ్యూ లో చూద్దాం
గాండీవధారి అర్జున కథ
ఇండియన్ మిలటరీలో కొన్నాళ్లపాటు సేవలందించిన అర్జున్(వరుణ్ తేజ్) తల్లి అంతుచిక్కని వ్యాధి కారణంగా లండన్ షిఫ్ట్ అవుతాడు. అక్కడ ఆమెకు చికిత్స అందించాలి అంటే ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీలో ఉద్యోగం చేయడం కరెక్ట్ అని భావించి ఉద్యోగం చేస్తున్న క్రమంలో ఇండియా నుంచి వచ్చిన కేంద్రమంత్రి(నాజర్)ను ఒక వారం రోజులపాటు కంటికి రెప్పలా కాపాడాల్సిన బాధ్యతలు అర్జున్ భుజాల మీద పడతాయి. ఈ క్రమంలో కేంద్ర మంత్రి వద్ద తన మాజీ ప్రేయసి ఐరా(సాక్షి వైద్య)ను చూసి అక్కడ పని చేయకూడదు అనుకుంటాడు. కానీ అర్జున్ తల్లి వైద్యానికి కేంద్ర మంత్రి సహాయం చేయడంతో అతని మీద కృతజ్ఞతతో ప్రాణాలు కాపాడేందుకు నిలబడతాడు. అయితే కేంద్ర మంత్రిని కాపాడుతున్న క్రమంలో తన తల్లి అంతుచిక్కని వ్యాధితో బాధపడడానికి కారణమైన వ్యక్తి, కేంద్ర మంత్రిని చంపడానికి ప్రయత్నిస్తున్నాడని విషయం తెలుసుకుంటాడు. అర్జున్ కేంద్రమంత్రి ప్రాణాలు కాపాడాడా? అర్జున్ తల్లి ప్రాణాలు నిలబడ్డాయా? కేంద్ర మంత్రిని చంపడానికి అతని మాజీ అల్లుడు రణవీర్(వరుణ్ రాయ్) ఎందుకు ప్రయత్నిస్తున్నాడు? చివరికి అర్జున్ ఏం చేశాడు? అనేది ఈ సినిమా కథ.
విశ్లేషణ
గతంలో చందమామ కథలు, గుంటూరు టాకీస్ అంటూ తెలుగుదనం ఉట్టి పడే సినిమాలు చేసిన ప్రవీణ్ సప్తరు గరుడవేగ అనే సినిమాతో ఒక్కసారిగా అందరి దృష్టిలో పడ్డాడు. పూర్తిస్థాయి పోలీస్ డ్రామా మూవీతో అందరినీ ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత ఘోస్ట్ తో డిజాస్టర్ అందుకున్నా మరోసారి అలాంటి కథతోనే మన ముందుకు వచ్చాడు. గండీవధారి అర్జున ట్రైలర్ చూస్తేనే సినిమా కథాంశం స్పష్టంగా కనిపిస్తుంది. కేంద్ర మంత్రికి ప్రాణహాని ఉండడంతో బాడీగార్డ్ అయిన హీరో దానిని ఆపాలి. కథగా చెప్పుకుంటే ఒక్కమాటలో ఇదే చెప్పాలి. అయితే ప్రేక్షకులు ఎంగేజ్ అవ్వాలి అంటే ఇలాంటి సీన్స్ చూస్తే థ్రిల్ కలిగేలా తెరకెక్కించాలి. కానీ దురదృష్టవశాత్తూ ప్రవీణ్ సత్తారు అలాంటి థ్రిల్ క్రియేట్ చేయడంలో విఫలమయ్యాడు. చెత్త కూడా డంప్ చేయడానికి స్థలం లేని అగ్రదేశాలు ఆఫ్రికా భారత్ లాంటి స్థలం ఎక్కువగా లభ్యత ఉన్న ప్రదేశాలకు మెడికల్ వేస్ట్ ఎలక్ట్రానిక్ వేస్ట్ డంప్ చేస్తున్నాయి. వాటి వల్ల చుట్టుపక్కల ప్రజలకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి? ఎంత ఇబ్బందులు పడుతున్నారు అనే విషయాన్ని ఆధారంగా చేసుకుని ఈ కథ తెరకెక్కించారు. అగ్రదేశాలు తమ దేశంలో వేస్ట్ అంతా ఇలా పేద దేశాలకు అభివృద్ధి పేరుతో పంపుతూ చివరికి కాలుష్యాన్ని కలిగిస్తున్నారని ఆ పేద దేశాల మీదే నిందలు మోపుతున్న వ్యవహారాన్ని ఎత్తి చూపించే ప్రయత్నం చేశారు. అలాగే డబ్బు కోసం ఎంతకైనా తెగిస్తూ కన్న తల్లి లాంటి సొంత దేశాన్ని కాలుష్యం బారిన పడేలా చేస్తున్న వారి వ్యవహారాలను కూడా కళ్ళకు కట్టినట్లు చూపే ప్రయత్నం చేశారు. నిజానికి కథగా ఈ లైన్ బాగున్నా సరే పూర్తిస్థాయిలో ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే విధంగా తెరకెక్కించడంలో తడబాటు కనిపించింది. ముఖ్యంగా ఏదో ఒక స్పై మూవీ లాగా నడిచిపోతున్న ఫీలింగ్ కలుగుతుంది తప్ప ఎక్కడ ఎమోషన్స్ పెద్దగా వర్క్ అవుట్ అవ్వలేదు. ఎమోషన్స్ కి స్కోప్ ఉన్నా ఎందుకో పూర్తిస్థాయిలో యాక్షన్ సినిమాగానే దీన్ని తెరకెక్కించే ప్రయత్నం చేశాడు. ప్రవీణ్ సత్తార్ బహుశా అందుకే సినిమా ఎక్కడా ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే అవకాశాలు కనిపించలేదు. అలాగే ముందే ఊహించగలిగే ట్విస్టులు సినిమాకు పెద్ద మైనస్..
ఎవరెలా చేసారు అంటే?
ప్రవీణ్ సత్తార్ దర్శకత్వం విషయానికి వస్తే కథగా ఉన్నదాన్ని స్క్రీన్ ప్లే తో మ్యాజిక్ చేసే ప్రయత్నం చేసి కొంతవరకు సఫలం అయ్యాడు కానీ పూర్తిస్థాయిలో మాత్రం ఆకట్టుకోలేకపోయాడు. అయితే వరుణ్ తేజ్ ని స్టైలిష్ గా చూపించే విషయంలో మాత్రం మంచి మార్కులు వేసుకున్నాడు. అయితే డైలాగ్స్ విషయంలో మాత్రం కొంత కేర్ తీసుకుని ఉంటే బాగుండు అనిపించింది. ఎందుకంటే కొన్ని డైలాగులు అందరికీ కనెక్ట్ అయ్యేలా అనిపించలేదు. అయితే స్పై మూవీ ఛాయలు ఎక్కువగా కనిపించాయి. మిక్కీ జే మేయర్ సంగీతం విషయానికి వస్తే ఉన్నవి తక్కువ పాటలే అవి కూడా పెద్దగా గుర్తు పెట్టుకోదగ్గవి లేవు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ యాక్షన్ థ్రిల్లర్ కి తగ్గట్టు అనిపించలేదు. ముఖేష్ జి సినిమాటోగ్రఫీ ఎలివేట్ చేసేలా ఉంది. ధర్మేంద్ర కాకరాల ఎడిటింగ్ పర్వాలేదు అనిపించినా గ్రిప్పింగ్ కథనం మిస్ కావడంతో రచనావిభాగం కూడా బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది. నటీనటుల విషయానికి వస్తే గాండీవధారి అర్జునలో వరుణ్ తేజ్ యాక్షన్ మోడ్‌లోకి మారిపోయాడు. మాస్ హీరోలా కాకుండా హాలీవుడ్ రేంజ్ హీరోలా యాక్షన్ సీన్స్ లో ఇరగతీశాడు. ఈ పాత్రకు కరెక్ట్ గా సూట్ అయ్యాడు. సాక్షి వైద్య సినిమా అంతటా ఉంటుంది కానీ ఆమెకు నటించే స్కోప్ అయితే పెద్దగా దక్కలేదు. నాజర్, విమలా రామన్, వినయ్ రాయ్, వంటివారు తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. విమలా రామన్ పాత్ర పెద్దదేమీ కాదు. తమిళ చిత్రసీమలో అనేక సినిమాల్లో విలన్ పాత్రలు పోషించి మెప్పించిన వినయ్ రాయ్, అలాంటి ఒక పాత్రలోనే ఈ సినిమాలో కూడా కనిపించదు. అభినవ్ గోమతం అయితే కేవలం రెండే సీన్లకు పరిమితం అయ్యాడు.
ఓవరాల్గా చెప్పాలంటే గాండీవధారి అర్జునుడి గురి తప్పింది