Kerala Crime Files Review:కేరళ క్రైమ్ ఫైల్స్, కొద్ది రోజుల క్రితం విడుదలై సంచలనం రేపిన ది కేరళ స్టొరీ పేరును పోలి ఉండటంతో ఈ సిరీస్ మీద అందరి ఆసక్తి నెలకొంది. అయితే ఆ సినిమాకు కానీ ఈ సిరీస్ కి కానీ ఎలాంటి లింక్ లేదు. కేరళలో జరిగిన ఒక హత్య కేసును ఆధారంగా చేసుకుని ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ గా ఈ సిరీస్ ను తెరకెక్కించారు మలయాళ మేకర్స్. అయితే డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సంస్థ దీన్ని అన్ని ప్రధాన భారతీయ భాషల్లో దబ్ చేసి రిలీజ్ చేశారు. ఈ మధ్య మలయాళ సినిమాలను తెలుగు ప్రేక్షకులు విపరీతంగా ఎంకరేజ్ చేస్తూ ఉండడంతో ఈ సిరీస్ మీద కూడా ఆసక్తి ఏర్పడింది. మరి ఈ సిరీస్ ఎలా ఉంది? అనేది రివ్యూలో చూద్దాం.
కథ:
శరత్ (ఎఆర్ హరిశంకర్) కేరళలోని ఒక పాడుబడ్డ భవనంలో నడిచే లాడ్జిలో రిసెప్షనిస్ట్‌గా పనిచేస్తుంటాడు. ఎప్పుడూ లేనిది ఒకరోజు నీటి సమస్య తలెత్తగా ఏదైనా రూమ్‌లో లీకేజీ ఉందోమోనని చెక్ చేస్తున్న క్రమంలో ఓ రూమ్‌లో మహిళ (రూత్ పి జాన్) మరణించి ఉండడంతో షాకై పోలీసులకు సమాచారం అందిస్తాడు. అయితే పోలీసులు రంగంలోకి దిగిన తరువాత ఆమె పేరు స్నప్న అని వేశ్య వృత్తిలో ఉందని తెలుసుకుంటారు. కేసును ఛేదించేందుకు రంగంలోకి దిగుతారు. వారి చేతిలో ఆమెను హత్య చేసింది షిజు (శ్రీజిత్ మహదేవన్) అని అతని ఫేక్ అడ్రెస్ తో బరిలోకి దిగిన పోలీసులు అతణ్ని ఎలా పట్టుకున్నారు? అసలు నిజంగా ఆమెను చంపింది అతనేనా? ఈ వేటలో వారికి ఎదురైన ఇబ్బందులు ఏమిటి? అనేదే ఈ సిరీస్ కథ.
విశ్లేషణ:
మలయాళ డైరెక్టర్ అహ్మద్ ఖబీర్ డైరెక్ట్ చేసిన తొలి వెబ్ సిరీస్ ‘కేరళ క్రైమ్ ఫైల్స్’. ఇది మనల్ని సీట్ల నుంచి కదలకుండా కూర్చోబెట్టే థ్రిల్లర్ కాదు కానీ ఆకట్టుకునే విధంగా సాగింది. మొత్తం ఆరు ఎపిసోడ్‌లలో సాగే ఈ సిరీస్ లో సర్కిల్ ఇన్‌స్పెక్టర్ కురియన్ అవిరాన్ (లాల్), సబ్ ఇన్‌స్పెక్టర్ మనోజ్ (అజు వర్గీస్) నేతృత్వంలోని పోలీసుల బృందం సెక్స్ వర్కర్ హత్యను పరిశోధించడం చుట్టూ సాగుతాయి. 2011 నాటి కథలో పోలీసులు ఒక వేశ్య హత్య కేసును ఛేదించాల్సి వస్తుంది. అయితే వారి చేతులో ఉన్న ఏకైక క్లూప ఒక నకిలీ చిరునామా. షిజు, పరాయిల్ వీడు, నీందకర అనే పేరుతో ఉన్న వ్యక్తి కోసం ఐదుగురు పోలీసులు ఎలా వేట సాగించారు, అనే విధంగా ఈ సిరీస్ సాగుతుంది. CI ఈ పోలీసుల బృందానికి నాయకత్వం వహిస్తున్నప్పటికీ, చాలా వరకు SI మనోజ్, అతని క్రింద ఉన్న ముగ్గురు పోలీసులు ద్వారా గ్రౌండ్ లెవల్ విచారణ జరుగుతుంది. ‘కేరళ క్రైమ్ ఫైల్స్’ అని పెట్టడంతో అక్కడి సంచలన కేసుల గురించి చెప్పి ఉంటారనుకుంటే కేవలం ఒకే ఒక్క మర్డర్ కేసు ఆధారంగా ఈ సిరీస్ సాగుతుంది. అస్లు ఏమాత్రం మీడియా ఫోకస్, రాజకీయ జోక్యం లేని కేసును పోలీసులు ఛాలెంజ్ గా తీసుకుని ఎలా సాల్వ్ చేశారు అనేది ఈ సిరీస్ లో చూపారు. ఏమాత్రం క్లూలు లేని సమయంలో ఒక హంతకుడిని పోలీసులు ఆరు రోజుల్లో ఎలా పట్టుకోగలిగారో ఆరు ఎపిసోడ్లలో చూపించి ఔరా అనిపించారు. అయితే పోలీసులు వారి భార్యలతో ఎలా ఉంటారు, వారి టెన్షన్లు ఎలా ఉంటాయి అనేవి చూపిస్తూ క్రైమ్ స్టోరీకి ఎమోషన్స్ తో టచ్ ఇచ్చారు.
నటీనటులు:
మలయాళంలో హాస్య పాత్రలకు పేరుగాంచిన అజు వర్గీస్, నీతితో ఉండే పోలీసుగా కనిపించి కొంత మేర ఆకట్టుకున్నాడు. లాల్ కురియన్ పాత్రలో కూడా తన పరిధి మేర ఆకట్టుకున్నాడు. నిజానికీ కురియన్‌గా నటించిన లాల్ తప్ప మిగతా వాళ్ళు అందరూ తెలుగు వారికి కొత్తే అయినా తమ తమ పాత్రలతో కొంతమేర ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. అజూ వర్గీస్ తో పాటు కానిస్టేబుళ్లుగా నటించిన నవస్, జీన్స్ షాన్, సంజుకే స్క్రీన్ ప్రెజెన్స్ ఎక్కువ కావడంతో కొంత కనెక్ట్ కాలేకున్నా వారు మాత్రం తమ పాత్రలకు న్యాయం చేశారు.
టెక్నికల్ టీమ్:
మలయాళ డైరెక్టర్ అహమ్మద్ ఖబీర్ డైరెక్ట్ చేసిన తొలి వెబ్ సిరీస్ అయినా ‘కేరళ క్రైమ్ ఫైల్స్’తో కొంత మేర ఆకట్టుకునే ప్రయత్నం చేసి ఆ మేరకు సఫలం అయ్యాడు. ఏదో ఊహించుకుని సిరీస్ మొదలు పెడితే కష్టమే, అలా కాకుండా ఎలాంటి ఎక్స్ పెక్టేషన్స్ లేకుండా చూస్తే సిరీస్ నచ్చుతుంది. ఈ సిరీస్ కి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మరింత బలాన్ని చేకూర్చిందని అనడంలో సందేహం లేదు. సినిమాటోగ్రఫీ యాప్ట్ గా సెట్ అయింది. ఎడిటింగ్ కు కూడా వంకలు పెట్టలేని విధంగా ఉంది.
ప్లస్ పాయింట్లు:
సిరీస్ కు ఎంచుకున్న కథ
ఇన్వెస్టిగేషన్ సీన్స్
బ్యాక్ గ్రౌండ్ స్కోర్
మైనస్ పాయింట్లు:
థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ లేకపోవడం
డైలాగులు
బాటమ్ లైన్: సా……గుతూ ఉండే పోలీస్ ఇన్వెస్టిగేషన్ ‘కేరళ క్రైమ్ ఫైల్స్’