NTV Telugu Site icon

Dhoom Dhaam Review: ‘ధూం ధాం’ మూవీ రివ్యూ

Dhoom Dham

Dhoom Dham

హనీమూన్ ఎక్స్ ప్రెస్ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన హెబ్బా పటేల్ హీరోయిన్ గా చేతన్ కృష్ణ హీరోగా తెరకెక్కిన సినిమా ‘ధూం ధాం’. సాయి కుమార్, వెన్నెల కిషోర్, గోపరాజు రమణ, ప్రవీణ్, నవీన్, వినయ్ వర్మ, వడ్లమాని శ్రీనివాస్, హర్షిణి.. పలువురు ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషించారు. ఫ్రైడే ఫ్రేమ్ వర్క్స్ బ్యానర్ పై ఎంఎస్ రామ్ కుమార్ నిర్మాణంలో సాయి కిషోర్ మచ్చా దర్శకత్వంలో ధూం ధాం సినిమాను తెరకెక్కించారు. గోపీ మోహన్ ఈ సినిమాకు స్టోరీ, స్క్రీన్ ప్లే అందించిన ధూం ధాం సినిమా నవంబర్ 8న థియేటర్స్ లో రిలీజయింది. మరి ఈ సినిమా ఎలా ఉంది అనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం.

‘ధూం ధాం’ కథ :
రియల్ ఎస్టేట్ బిజినెస్ రామరాజు(సాయి కుమార్‌)కి అతని కొడుకు కార్తిక్‌(చేతన్‌ కృష్ణ)అంటే చాలా ఇష్టం. కొడుకు కోసం ఏ పనైనా చేయడానికి సిద్ధమయ్యే మనస్తత్వం. అయితే అమ్మా నాన్న, స్నేహితులు మాత్రమే అంటూ లైఫ్ లీడ్ చేస్తున్న కార్తిక్‌ జీవితంలోకి సుహానా(హెబ్బా పటేల్‌) ఒక షాక్ ఇచ్చి మరీ వస్తుంది. ముందు గొడవ పడ్డా, తరువాత ఒకరినొకరు ఇష్టపడతారు. ఇంట్లో వాళ్లకు చెప్పి పెళ్లి చేసుకోవాలనుకుంటే కొన్ని షాకింగ్ విషయాలు తెలుస్తాయి. కార్తిక్‌, సుహానా కుటుంబాల మధ్య అసలు ఏం జరిగింది? సుహానా కుటుంబానికి కార్తిక్ చేసిన ద్రోహమేమిటి? సుహానా కుటుంబానికి రామరాజు చేసిన ద్రోహమేంటి? చివరికి ఏం జరిగింది? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ: శ్రీను వైట్లతో ఎక్కువ సినిమాలకు రచయితగా పనిచేసిన స్టార్ రైటర్ గోపి మోహన్ ఈ సినిమాకు కథ అందించాడు. దానికి తోడు దర్శకుడు కూడా శ్రీను వైట్ల దగ్గర పని చేసి ఉండడంతో పాటు ట్రైలర్ కూడా ఆసక్తికరంగా అనిపించడంతో ఈ సినిమాలో ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుందని ముందే ఫిక్స్ అయ్యారు. సినిమా కూడా కొత్త కథ ఏమీ కాదు. గతంలో మనం చూసిన శ్రీను వైట్ల రెడీ, ఢీ.. లాంటి పలు సినిమాల్లో లాగే ఈ సినిమా స్క్రీన్ ప్లే కూడా రాసుకున్నారు. హీరో, హీరోయిన్ ప్రేమించుకోవడం అయితే ముందే హీరో, అతని తండ్రికి హీరోయిన్ ఫ్యామిలీతో విబేధాలు ఉండటం, చివర్లో ఓ పెళ్ళిలో అందరితో కామెడీ జనరేట్ చేస్తూ హీరో హీరోయిన్ ఫ్యామిలీకి సపోర్ట్ చేయడం వంటి లైన్ తో కథను నడిపించారు. అయితే నిజానికి ఇలాంటి పాయింట్ లో చాలా సినిమాలు వచ్చినా తండ్రి కొడుకుల ప్రేమ చుట్టూ ఇలాంటి కథను ఎంచుకోవడం మాత్రం ఆసక్తికరం. ఫస్ట్ హాఫ్ అంతా హీరో – హీరోయిన్ల ప్రేమతో సాగగా సెకండ్ హాఫ్ లో రెండు కుటుంబాలు పెళ్ళిలో కలవడం కాస్త ఊహకు తగ్గట్టే ఉంది. ఫస్ట్ హాఫ్ లో కామెడీ డోస్ పెద్దగా లేకున్నా సెకండ్ హాఫ్ లో కామెడీ ట్రాక్ బాగా వర్కౌట్ అయింది. క్లైమాక్స్ రెగ్యులర్ అయినా ఊహకు తగ్గట్టే ఉన్నా కామెడీతో బండి నడిపించారు.

నటీనటుల విషయానికి వస్తే గతంలో పలు చిత్రాల్లో నటించిన చేతన్‌ కార్తిక్‌ పాత్రలో ఫర్వాలేదు అనిపించాడు. అయితే నటనలో గత సినిమాలతో పరిణితి సాధించినా ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాల్సిన అవసరమైతే వుంది. హెబ్బా పటేల్‌ కూడా తన పాత్రలో మెప్పించింది. సినిమాలో అందంగా కనిపించింది. ఇద్దరి కెమిస్ట్రీ కూడా బాగుంది. ఈ సినిమాకు సెకండ్ హీరో వెన్నెల కిషోర్‌ అని అనడంలో ఎలాంటి సందేహం లేదు. సెకండాఫ్‌లో ఎంట్రీ ఇచ్చిన కిషోర్‌ తన వినోదంతో అందరిని కడుపుబ్బా నవ్వించాడు. తండ్రి పాత్రలో సాయికుమార్‌, భూపతి బ్రదర్స్‌గా గోపరాజు రమణ రాజు, వినయ్‌ వర్మ, బెనర్జీలు తమ పాత్రలను రక్తికట్టించారు. టెక్నికల్ టీం విషయానికి వస్తే సినిమాటోగ్రఫీ సినిమాకు అదనపు ఆకర్షణ. సినిమాను కలర్‌ఫుల్‌గా చూపించారు. గోపీ సుందర్ అందించిన పాటలు బాగున్నాయి, నేపథ్య సంగీతం ఆకట్టుకుంది. గోపీ మోహన్‌ కథ, స్క్రీన్‌ప్లే రెగ్యులర్‌ ఫార్మట్‌ అయినా కామెడీ పేలింది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

ఫైనల్లీ ‘ధూమ్‌ ధామ్‌’ అంచనాల్లేకుండా వెళితే నవ్వించే కామెడీ డ్రామా.

Show comments