శివాజీ ప్రధాన పాత్రలో నవదీప్, రవికృష్ణ, నందు, బిందు మాధవి వంటి వారు ఇతర కీలక పాత్రలలో నటించిన చిత్రం ‘దండోరా’. ఈ సినిమాని ‘బెదురులంక’, ‘కలర్ ఫోటో’ సినిమాలను నిర్మించిన రవీంద్ర బెనర్జీ ముప్పానేని నిర్మించారు. కొత్త దర్శకుడు మురళీకాంత దర్శకత్వంలో ఈ సినిమా రూపుదిద్దుకుంది. నిజానికి ప్రమోషన్ కార్యక్రమాలతోనే సినిమా మీద మంచి బజ్ ఏర్పడింది. దానికి తోడు, ఇటీవల రిలీజ్ అయిన టైటిల్ సాంగ్ కూడా సినిమాకి బాగా ప్లస్ అయింది. మరి ఈ సినిమా డిసెంబర్ 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుండగా, రెండు రోజుల ముందుగానే సినిమా మీద నమ్మకంతో చిత్ర బృందం ప్రీమియర్స్ ప్రదర్శించింది. సినిమా ఎలా ఉంది, ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది అనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం.
దండోరా కథ:
మెదక్ ప్రాంతానికి చెందిన తుళ్లూరు అనే గ్రామంలో శివాజీ ఓ పెద్ద కులానికి చెందిన రైతు. అయితే అతను మరణిస్తే, ఆ కుల సంఘానికి చెందిన స్మశాన వాటికలో అతనిని దహనం చేయడానికి వీల్లేదని ఆ కుల పెద్దలు తీర్మానం చేస్తారు. అయితే ఎలాగైనా అంత్యక్రియల ప్రక్రియ పూర్తి చేయాలని ఆ ఊరి సర్పంచ్ (నవదీప్) ప్రయత్నం చేస్తూ ఉంటాడు. తమ మాట వినకపోవడంతో శివాజీ కొడుకు విష్ణు (నందు) తో ఆ ఊరి కుల పెద్దలను ఒప్పించే ప్రయత్నం చేయాలని భావిస్తాడు.
ఈ క్రమంలో సిటీలో ఉండే విష్ణు, తన భార్య వనిత (మౌనిక రెడ్డి) తో ఊరికి వచ్చి చేసిన ప్రయత్నం ఏమిటి? అసలు శివాజీని కుల పెద్దలు ఎందుకు ఊరిలో దహనం చేయనివ్వడం లేదు? ఆ ఊరిలో అణగారిన వర్గానికి చెందిన రవి (రవికృష్ణ) ఎందుకు హత్య చేయబడ్డాడు? శివాజీకి, ఆ ఊరిలో వేశ్య వాటికకు చెందిన శ్రీలత (బిందు మాధవి) కు ఉన్న సంబంధం ఏమిటి? చివరికి శివాజీ అంతిమ సంస్కారాలకు ఆ ఊరి వాళ్ళు ఒప్పుకున్నారా లేదా? అనే విషయాలు తెలియాలంటే సినిమాని బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే.
విశ్లేషణ:
నిజానికి ఎవరు ఎన్ని చెప్పినా, ప్రభుత్వాలు ఎంత కాదని మొత్తుకున్నా, ఏదో ఒక స్థాయిలో కుల వివక్ష ఇంకా కొనసాగుతోంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. కాలంతో పోటీ పడుతూ పరుగులు పెడుతున్న ఈ సమయంలో కూడా, ఇంకా ఏదో ఒక ప్రాంతంలో కులం కారణంగా గొడవలు, హత్యలు సైతం జరుగుతూ ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. దాన్నే ప్రధానమైన అంశంగా తీసుకుని ఈ సినిమా దర్శకుడు కథ రాసుకున్నాడు.
పరువు హత్యలు ఇప్పటివరకు మనం చాలా చూశాం. ఆ పరువు హత్యల కారణంగా హత్య చేయబడిన బాధితుడి కుటుంబం ఎంత నరకం అనుభవిస్తుందో, క్షణికావేశంలో ఆ హత్యకు కారణమైన కుటుంబంతో పాటు ఆ హత్యలో భాగమైన వారి కుటుంబాలు ఎంత నరకయాతన అనుభవిస్తాయో ఈ సినిమా కళ్ళకు కట్టింది. నిజానికి ఈ సినిమా ఓపెనింగ్ సీన్ లోనే “మన చావు బతుకులు కూడా పొలిమేర అవతలే రాశాడు రా దేవుడు” అంటూ రాసుకున్న ఒక సీన్ అయితే అందరినీ కదిలిస్తుంది.
వాస్తవానికి ఈ స్మశాన వాటిక అంశం కచ్చితంగా చర్చించాల్సిందే. ఒక్కొక్క కులం ఆధారంగా ప్రభుత్వం ఆయా కుల సంఘాలకు స్మశాన వాటికను కేటాయిస్తూ ఉంటుంది. అయితే ఆ స్మశాన వాటికలకు తీసుకువెళ్లాల్సిన పరిస్థితుల్లో మాత్రం, కొంతమంది “మా ఇళ్ళ మధ్యలో నుంచి స్మశానానికి తీసుకువెళ్తే ఊరుకోం” అని అడ్డుపడుతూ ఉంటారు. గ్రామాల్లో ఇది చాలా సర్వసాధారణం. ఇదే విషయాన్ని కథ కోర్ పాయింట్‌కి లింక్ చేసుకుంటూ దర్శకుడు రాసుకున్న కథనం ఆకట్టుకునేలా ఉంది. 2004లో మొదలయ్యే కథను నాలుగు లీనియర్ స్క్రీన్‌ప్లేతో 2019 వరకు నడిపించిన తీరు ఆకట్టుకుంటుంది.
నిజానికి దర్శకుడు చెప్పాలనుకున్న పాయింట్స్ అన్నీ మనం సభ్య సమాజంలో చూస్తూ వస్తున్నవే. కానీ తనదైన శైలిలో ప్రశ్నిస్తూ, ఆ ప్రశ్నలకు తానే సమాధానం చెబుతూ దర్శకుడు రాసుకున్న కథ ప్రేక్షకులను ఆలోచింపజేసేలా ఉంది. అయితే సినిమా చూస్తున్న సమయంలో ఇంకా డెప్త్ గా ఎమోషన్స్ పలికి ఉంటే బాగుండేదేమో అనిపిస్తుంది. కానీ సినిమా విషయంలో మాత్రం సెన్సార్ గట్టిగానే కట్స్ పెట్టడంతో, బహుశా అందువల్ల ఆ ఎమోషన్స్ పూర్తిస్థాయిలో క్యారీ అవ్వలేదేమో అనిపిస్తుంది.
మొత్తంగా చూసుకుంటే, ఈ సినిమాలో కొత్త పాయింట్ మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని చెప్పాలి. ఇప్పటివరకు బాధిత కుటుంబాలు పడిన వేదననే చూపించారు, కానీ ఇప్పుడు ఆ బాధకు కారణమైన కుటుంబాలు ఎంత నరకయాతనకు గురవుతున్నారో చూపించిన విధానం మాత్రం అభినందనీయం. అలాగే ఈ సినిమాలో ప్రస్తావించిన అంశాలు ఆలోచింపజేస్తాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. మొదటి సినిమా అయినా దర్శకుడు డేరింగ్ స్టెప్ వేసి ఇలాంటి సబ్జెక్టుతో రావడం కచ్చితంగా అభినందనీయం. కాకపోతే ఇంకా ఎమోషనల్ ఫీల్ వచ్చి ఉంటే సినిమా వేరే లెవల్‌లో ఉండేది. సినిమా చివరి 20 నిమిషాలు మాత్రం ఊహకు అందకుండా రాసుకున్న తీరు అందరినీ మెప్పించేలా ఉంది.
నటీనటులు & సాంకేతిక వర్గం:
నటీనటుల విషయానికి వస్తే, ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నటించిన శివాజీ ఆ పాత్రలో నటించలేదు, జీవించాడు. ‘మంగపతి’కి మించి ఈ సినిమాలో శివాజీ తన క్యారెక్టర్‌కు న్యాయం చేశాడు. ఇక ఆ తర్వాత నటించిన వారిలో రవికృష్ణ క్యారెక్టర్ బాగా వర్కవుట్ అయింది. అలాగే బిందు మాధవి కుమార్తె పాత్రలో నటించిన రాజ్య, కనిపించింది తక్కువ సీన్స్ అయినా, కళ్ళతో నటిస్తూ పర్ఫామెన్స్‌తో ఆకట్టుకుంది. ఇక బిందు మాధవి, నందు, మౌనిక ఎవరికి వారు తమ పాత్రలలో జీవించేశారు. నిజానికి ఈ పాత్రలకు వారిని ఎంచుకున్న దర్శకుడిని అభినందించాల్సిందే. ఏ ఒక్కరి క్యారెక్టర్‌ను తక్కువ చేయకుండా వారికి ఇచ్చిన ప్రాధాన్యతతో సినిమా ఒక మంచి ఫీల్ తీసుకొచ్చింది.
టెక్నికల్ టీం విషయానికి వస్తే, సంగీత దర్శకుడు ఇచ్చిన పాటలతో పాటు నేపథ్య సంగీతం సినిమాకి చాలా ప్లస్ అయింది. ‘దండోరా’ టైటిల్ సాంగ్‌తో పాటు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అయితే సినిమాని ఎలివేట్ చేయడంలో బాగా ఉపయోగపడింది. ఇక సినిమాటోగ్రఫీ కూడా చాలా ప్లెజెంట్‌గా ఉంది. ఎక్కడా ఇబ్బందికర ఫ్రేమ్స్ లేకుండా, అసభ్యతకు తావు లేకుండా ప్రకృతిని చూపించిన విధానం అభినందనీయం. నిడివి క్రిస్పీగానే ఉన్నా, ఎందుకో కొన్ని సీన్స్ సాగదీసిన (ల్యాగ్) ఫీలింగ్ కలుగుతుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.
ఫైనల్లీ ఈ దండోరా ఆలోచింపచేసే ఓ హానెస్ట్ అటెంప్ట్.