NTV Telugu Site icon

రివ్యూ: సి.ఎస్.ఐ. సనాతన్

Csi Sanatan Review1

Csi Sanatan Review1

ఇటీవల ‘పులి మేక’ వెబ్ సీరిస్ తో ఆది సాయికుమార్ ఓటీటీ వ్యూవర్స్ ను ఆకట్టుకున్నాడు. అతని తాజా చిత్రం ‘సి.ఎస్.ఐ. సనాతన్’ శుక్రవారం జనం ముందుకు వచ్చింది. శివశంకర్ దేవ్ ను దర్శకుడిగా పరిచయం చేస్తూ అజయ్ శ్రీనివాస్ దీన్ని నిర్మించారు. మరి సి.ఎస్.ఐ. కు చెందిన సనాతన్ కు ఎదురైన సమస్య ఏమిటీ? దాన్ని అతను ఎలా సాల్వ్ చేశాడో తెలుసుకుందాం.

విక్రమ్ చక్రవర్తి (తారక్ పొన్నప్ప) వి.సి. అనే పెద్ద కంపెనీకి అధిపతి. ఆ సంస్థ ప్రజోపయోగకర కార్యక్రమాలు ఎన్నో చేస్తుంటుంది. అలానే మధ్య తరగతి, దిగువ మధ్యతరగతి ప్రజల నుండి రోజుకు పది రూపాయల చొప్పన డబ్బులు వసూలు చేసి, వడ్డీలేని రుణాలను అందిస్తుంటుంది. బట్… అందులో ఇన్వెస్ట్ చేసిన వారెవరూ తిరిగి డబ్బుల్ని పొందిన దాఖలాలు మాత్రం ఉండవు. దాంతో ఇన్వెస్టర్స్ లో అసంతృప్తి మొదలవుతుంది. ఇదిలా ఉండగానే ఓ ఇంటర్నేషనల్ కంపెనీతో డీల్ కుదుర్చుకునేందుకు విక్రమ్ చక్రవర్తి ఫారిన్ వెళ్ళడానికి సిద్ధమౌతాడు. అయితే… ముందు రోజు రాత్రి ఆఫీస్ లో పార్టీ జరుగుతుండగా, అతను హత్యకు గురౌతాడు. ఈ మర్డర్ మిస్టరీని ఛేదించేందుకు సి.ఎస్.ఐ. సనాతన్ (ఆది సాయికుమార్) రంగంలోకి దిగుతాడు. వి. సి. కంపెనీలో పనిచేసే ఐదుగురుపై అతని అనుమానం ఉంటుంది. వారిలో హంతకుడు ఎవరు? అతని మోటివ్ ఏమిటీ? అనేది నిగ్గు తేల్చడమే ఈ చిత్ర కథ.

మధ్యతరగతి మనుషులకు భారీ రిటర్న్స్ ఆశను చూపించి, డబ్బులు గుంజడం అనేది అనేక సంస్థలు, అనేక సంవత్సరాలుగా చేస్తూనే ఉన్నాయి. ఇన్వెస్టర్స్ ఒక్కసారిగా తమ పెట్టుబడుల్ని తిరిగి ఇవ్వమని ఒత్తిడి చేసినప్పుడు సదరు కంపెనీలు బోర్డ్ తిప్పేయడమూ మనం చూస్తున్నాం. అలాంటి ఓ భారీ స్కామ్ చుట్టూ ఈ కథ సాగుతుంది. అయితే… కంపెనీ అధినేత హత్యకు గురికావడమే ఇందులోని ట్విస్ట్. తెలుగులోనే కాదు… గత కొంతకాలంగా వివిధ భాషల్లో ఇలాంటి మర్డర్ మిస్టరీ మూవీస్ చాలానే వస్తున్నాయి. వెబ్ సీరిస్ లు కూడా ఇలాంటి నేపథ్యంలో అనేకం రూపొందుతున్నాయి. సహజంగా అలాంటి వాటిల్లో పోలీస్ డిపార్ట్ మెంట్ కు చెందిన వారు హంతకులను పట్టుకుంటారు. కానీ ఇందులో ఆ పని సి.ఎస్.ఐ. (క్రైమ్ సీన్ ఇన్వెస్టిగేషన్) అధికారి చేస్తాడు. ఓ క్రైమ్ జరిగినప్పుడు అక్కడ దొరికే ఆధారాలను క్షణ్ణంగా పరిశీలించి, వాటి ద్వారా హంతకుడెవరనేది గెస్ చేయడమే ఈ అధికారుల పని. ఇందులో ఆ పనిని సనాతన్ చేపట్టడంతో పోలీస్ ఆఫీసర్స్ బ్యాక్ సీట్ లోకి వెళ్ళిపోయారు. డైరెక్టర్ శివశంకర్ దేవ్ కు ఇదే ఫస్ట్ ఫీచర్ ఫిల్మ్. స్టోరీ బాగానే రాసుకున్నాడు. మధ్య మధ్యలో ఫ్యాష్ బ్యాక్ కు వెళ్ళి, మళ్ళీ ప్రెజెంట్ లోకి కథ వస్తూ ఉంటుంది. అది కాస్తంత గందరగోళానికి గురిచేస్తుంది. అయితే… చివరిలోని ట్విస్ట్ ఆసక్తికరంగా ఉంది. దీనికి సీక్వెల్ కూడా ఉంటుందని ప్రకటించారు. సహజంగా ఇలాంటి సినిమాలకు మరో ఇన్వెస్టిగేషన్… సీక్వెల్ స్టోరీ అవుతుంది!

నటీనటుల విషయానికి వస్తే… ఆది సాయికుమార్ ఎంట్రీ కాస్తంత లేట్ గా జరిగింది కానీ అక్కడ నుండి ప్రతి సన్నివేశంలో అతని ప్రెజెన్స్ ఉంది. యాక్షన్ పార్ట్ లోనూ మెప్పించాడు. కథకు అడ్డం కాకూడదని పెద్దంతగా పాటలు పెట్టలేదు. ఉన్న ఒకటి రెండు ఓకే… బాగానే ఉన్నాయి. తారక్ పొన్నప్ప స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది. మధుసూదన్ మంత్రి పాత్రను పోషించాడు. ఇతర ప్రధాన పాత్రలను నందిని రాయ్, మిషా నారంగ్, అలి రెజా, వాసంతి, రవిప్రకాశ్, ఖయ్యూమ్, అప్పాజీ తదితరులు పోషించారు. జి. శేఖర్ సినిమాటోగ్రఫీ బాగుంది, అనీశ్ సోలోమాన్ నేపథ్య సంగీతం కూడా ఓకే.

టీవీలో క్రైమ్ అండ్ ఇన్వెస్టిగేషన్ బ్యాక్ డ్రాప్ లో అనునిత్యం బోలెడన్ని షోస్ వస్తున్నాయి. అలానే ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లోకి వెళితే ఎన్నో వెబ్ సీరిస్ కనిపిస్తున్నాయి. ఆ జాబితాలోకే ‘సి.ఎస్.ఐ. సనాతన్’ కూడా చేరుతుంది. సిల్వర్ స్క్రీన్ ను దృష్టి పెట్టుకుని తీస్తున్నప్పుడు సమ్ థింగ్ డిఫరెంట్ గా, స్పెషల్ గా ప్రయత్నించి ఉండాల్సింది! అలా జరగలేదు. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్స్ ను ఇష్టపడే వారికి ఓ మేరకు నచ్చే ఆస్కారం ఉంది.

రేటింగ్: 2.5/ 5

ప్లస్ పాయింట్స్
మర్డర్ మిస్టరీ కావడం
ఆర్టిస్టుల పెర్ఫార్మెన్స్
క్లయిమాక్స్ ట్విస్ట్

మైనెస్ పాయింట్
కొత్తదనం లేని కథ
ఆసక్తి కలిగించని కథనం

ట్యాగ్ లైన్: మరో ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్!