ఈ మధ్యకాలంలో చిన్న సినిమాలు పెద్ద సినిమాలు అని తేడా లేకుండా బావుంటే అన్ని సినిమాలను ఆదరిస్తున్నారు. ప్రేక్షకులు ఈ నేపథ్యంలోనే పెద్దగా స్టార్ కాస్ట్ లేకపోయినా కంటెంట్ మీద నమ్మకంతో సినిమాలు చేస్తున్నారు దర్శకనిర్మాతలు. ఈ క్రమంలోనే టుక్ టుక్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. ఇటీవల కోర్టు సినిమాతో హిట్ అందుకున్న హర్ష్ రోషన్ సలార్ సినిమాలో పృధ్వీరాజ్ సుకుమారన్ చిన్నప్పటి పాత్రలో నటించిన కార్తికేయ దేవ్ సోషల్ మీడియాలో మంచి పాపులారిటీ సంపాదించిన మధు కీలక పాత్రలలో ఈ సినిమా రూపొందించారు. సుప్రీత్ కృష్ణ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. సినిమా కంటెంట్ మీద నమ్మకంతో ఒకరోజు ముందుగానే ప్రీమియర్స్ ప్రదర్శించింది సినిమా యూనిట్. మరి సినిమా ఎలా ఉంది? ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది అనేది ఇప్పుడు మనం రివ్యూలో చూద్దాం
టుక్ టుక్ కథ :
చిత్తూరు జిల్లాలోని ఓ గ్రామంలో ముగ్గురు కుర్రాళ్లు (హర్ష రోషన్, కార్తీకేయ దేవ్, స్టీవెన్ మధు) సరదాగా జీవితం గడిపేస్తూ ఉంటారు. అందరు కుర్రవాళ్ళలాగే బూతు వీడియోలు చూస్తూ, ఆడవాళ్లు స్నానం చేస్తుంటే దొంగచాటుగా చూస్తూ టైం పాస్ చేస్తూ ఉంటారు. అయితే వీడియోలు చూస్తూ, ఒక్కోసారి అమ్మాయిలను చూస్తూ ఉండే వారికి తామే ఆ వీడియోలు షూట్ చేసి ఎందుకు డబ్బులు సంపాదించకూడదు అనే ఆలోచన వస్తుంది. అలా చేయాలంటే మంచి కెమెరా ఒకటి సంపాదించాలనుకుంటారు. అల్లరి చిల్లరగా తిరిగే వీరికి బూతు వీడియోలు షూట్ చేస్తామంటే ఎవరు మాత్రం డబ్బులు ఇస్తారు? అందుకే తెలివిగా వినాయక చవితి వేడుక పేరుతో చందాలు వసూలు చేసి ఆ వేడుక జరిపి మిగిలిన డబ్బుతో కెమెరా కొనుక్కోవాలని స్కెచ్ వేస్తారు. ఊరేగింపు చేయాలంటే వాహనం ఉండాలి. ఆ వాహనానికి ఎక్కువ ఖర్చవుతుంది అని ఫీల్ అయ్యి మూలన పడ్డ బజాజ్ చేతక్ స్కూటర్‌ను బయటకు తీసి రిపేర్ చేయించి దాన్ని ఒక టుక్ టుక్ బండి లాగా రెడీ చేయించి దాని మీదనే ఊరేగిస్తారు. ఆ దెబ్బతో వారి లైఫ్ ఉన్నట్టుండి మారిపోయి విపరీతంగా డబ్బు చేతికి వస్తుంది. అయితే దానికి తోడు టుక్ టుక్ బండి దానంతట అదే కదులుతూ ఉండడం, ఏదైనా విషయం జరుగుతుందా లేదా అని అడిగితే తల ఊపుతూ సమాధానం చెప్పడంతో వీరికి కొత్త సమస్యలు మొదలవుతాయి. అయితే అసలు ఒక వాహనం అలా దానంతట అదే ఎందుకు కదులుతుంది? దానికి అదృశ్య శక్తులు ఏమైనా తోడయ్యాయా? అది దైవ శక్తి లేక దుష్టశక్త ? అనే విషయాలు తెలియాలంటే సినిమాని బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే.
విశ్లేషణ:
వాహనాలలో అదృశ్య శక్తులు ప్రవేశించి వాటి ద్వారా కద నడిపించిన సినిమాలు గతంలోనే తెలుగులో కొన్ని వచ్చాయి ఇది కూడా దాదాపుగా అదే లైన్తో రూపొందించబడింది అల్లరి చిల్లరగా తిరిగే ముగ్గురు కుర్రాళ్ళు బూతు బొమ్మలు షూట్ చేసి డబ్బులు సంపాదించడానికి సిద్ధమవుతారు దానికి దేవుడినే నమ్ముకుని వినాయక చవితి ఉత్సవాలు జరిపోవడానికి కోసం ఒకటుకు సిద్ధం చేస్తారు ఆ తరువాత అనుకోకుండా దానిలోకి అదృశ్య శక్తులు రావడంతో ఆ అదృశ్య శక్తిని నమ్ముకుని వీరు బోలెడు డబ్బు సంపాదిస్తారు. ఆ తరువాత ఆ అదృశ్య శక్తి ఇంకేదో కాదు ఆ వాహనంలో దూరిన ఒక ఆత్మ అని తెలియడంతో ఒక దెబ్బకి బెదిరిపోతారు. అయితే అసలు ఆత్మ కథ ఏంటి? ఎందుకు ఈ వాహనంలో దూరింది? చివరికి దానికోసం ఈ ముగ్గురు కుర్రాళ్ళు ఏం చేశారు అని రాసుకున్న కథ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంది. ఫస్టాఫ్ అంతా ఇలా సరదా సరదాగా సాగిపోతే సెకండ్ హాఫ్ లో ఒక రొటీన్ లవ్ స్టోరీ ని తీసుకొచ్చి ప్రేక్షకులను కాస్త సాగదీసిన ఫీలింగ్ కలిగించారు. నిజానికి సినిమాలో కొన్ని లాజిక్ లెస్ సీన్స్ కూడా ఉన్నాయి. అలాగే కొన్ని విషయాలను కనెక్టివిటీ లేకుండా క్లోజ్ చేసిన విధానం కూడా కాస్త ఇబ్బందికర అంశమే. అయితే క్లైమాక్స్ ముగించిన తీరు ఆకట్టుకునేలా ఉంది. అలాగే దర్శకుడు ప్రమోషన్స్ లో చెప్పినట్లుగా దీన్ని ఫ్రాంచైజ్ గా చేసే ఆలోచనను క్లైమాక్స్లో చూపించారు. ఈ సినిమా బాగా నడిస్తే మరిన్ని భాగాలు ఇదే ఫ్రాంచైజ్ లో వచ్చే అవకాశం ఉంది. కొందరికి ఫస్ట్ ఆఫ్ బాగా కనెక్ట్ అయితే కొందరికి మాత్రం సెకండ్ హాఫ్ ఇంకా కనెక్ట్ అవుతుంది. ఒక రొటీన్ లవ్ స్టోరీకి ముగ్గురు కుర్రాళ్లతో ఒక ఆత్మ కథను ఎలా లింక్ చేశారనేది బిగ్ స్క్రీన్ మీదకు తీసుకురావడంలో దర్శకుడు పనితనం కనిపించింది.
ఇక నటీనటుల విషయానికి వస్తే ఇటీవలే కోర్టు అనే సినిమాతో తనదైన నటనతో ఆకట్టుకున్న రోషన్ ఈ సినిమాలో కూడా ఒక సాదాసీదా కుర్రాడి పాత్రలో ఇమిడిపోయాడు. అతనితో పాటు నటించిన కార్తికేయ దేవ్ తో పాటు మధు నేటి తరం కుర్రాళ్ళుగా ఆకట్టుకున్నారు. నటి శాన్వీ మేఘన సెకండాఫ్‌ను ఎమోషనల్‌గా మార్చడమే కాకుండా తన వంతు బాధ్యతగా సినిమాకు ఒక కంప్లీట్ ఫీల్ తీసుకు వచ్చింది. తండ్రి పాత్రలో దయానందరెడ్డి ఒక ఎమోషనల్ ఫీల్ ఉన్న పాత్రలో నటనతో ఆకట్టుకొన్నాడు. ఇతర నటీనటులు తమ పాత్రలకు పూర్తిగా న్యాయం చేశారు. ఇక సాంకేతిక విభాగాల పనితీరు విషయానికి వస్తే.. సినిమాటోగ్రఫి ఈ సినిమాకి ప్లస్ పాయింట్ కోనసీమ వాతావరణాన్ని కార్తీక్ సాయికుమార్ అందంగా కెమెరాలో బంధించాడు కానీ చిత్తూరు బ్యాక్ డ్రాప్ గా చూపించడం కాస్త ఎబ్బెట్టుగా అనిపించింది..ఇక సీన్స్ కు తగినట్టు, కథను ఎలివేట్ చేసే విధంగా సంతూ ఓంకార్ మ్యూజిక్ అందించారు. ఫస్టాఫ్‌లో కొన్ని సీన్స్ ట్రిమ్ చేస్తే బాగుండేది అనిపిస్తుంది. ఇక నిర్మాణ విలువలు బాగున్నాయి.
ఫైనల్లీ లాజిక్స్ పక్కన పెట్టి చూస్తే టుక్ టుక్ ఇంట్రెస్టింగ్ ఫాంటసీ రైడ్..