నాగచైతన్యను పెళ్లి చేసుకుని అక్కినేని వారి ఇంటి కోడలైన తర్వాత, శోభిత దూళిపాళ్ల నటించిన మొదటి సినిమా ‘చీకటిలో’. ఈ సినిమాని అమెజాన్ ఒరిజినల్ మూవీగా రూపొందించారు. గతంలో ‘కిరాక్ పార్టీ’, ‘తిమ్మరసు’ లాంటి సినిమాలు డైరెక్ట్ చేసిన శరణ్ కొప్పిశెట్టి దీనికి దర్శకత్వం వహించారు. నిజానికి ఈ సినిమా వస్తుందని చాలామందికి ఈ మధ్యకాలం వరకు తెలియదు. ఎందుకంటే అమెజాన్ ప్రైమ్ కూడా చాలా లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తూ ఈ సినిమాని తీసుకొచ్చింది. చివర్లో మొదలుపెట్టిన ప్రమోషన్స్ సినిమా మీద బజ్ పెంచాయి. సినిమా ఎలా ఉంది? ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది? అనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం.
కథ:
సంధ్య నెల్లూరి (శోభిత దూళిపాళ్ల) క్రిమినాలజిస్ట్‌గా అర్హతలు ఉన్నా సరే, ఆమె ఒక న్యూస్ ఛానల్‌లో క్రైమ్ షో యాంకర్‌గా వ్యవహరిస్తూ ఉంటుంది. అనూహ్యంగా ఆమె వద్ద పనిచేసే బాబి (అదితి మైకల్) రేప్‌కు గురికాబడి మర్డర్ అవుతుంది. ఈ క్రమంలో ఆ కేసుని సీరియస్‌గా తీసుకున్న సంధ్య, పోలీసులకు కూడా సాధ్యం కానీ సమయంలో సాల్వ్ చేసి హాట్ టాపిక్ అవుతుంది. అయితే సంధ్య భావించిన విధంగా అది సింగిల్ మర్డర్ కాదని, ఒక సీరియల్ కిల్లర్ చేసే మర్డర్స్‌లో భాగమని తెలుస్తుంది. అసలు బాబిని చంపింది ఎవరు? ఆ సీరియల్ కిల్లర్ ఎవరు? చివరికి ఆ సీరియల్ కిల్లర్‌ని సంధ్య కనుక్కున్నదా? మధ్యలో పోలీస్ ఆఫీసర్స్ రాజీవ్ కృష్ణ, చైతన్య, ఆనందిత, ఈషా చావ్లా పాత్రలేమిటి? అనేది తెలియాలంటే సినిమాని చూడాల్సిందే.
విశ్లేషణ:
సినిమా ప్రారంభమే ఒక యువతి రేప్‌తో మొదలవుతుంది. హీరోయిన్ పాత్ర పరిచయం, ఆ తర్వాత వెంటనే ఆమె వద్ద అసోసియేట్‌గా పనిచేస్తున్న యువతి రేప్ అండ్ మర్డర్‌తో ఒక్కసారిగా సినిమా మీద ఆసక్తి పెరుగుతుంది. అసలు ఏమాత్రం క్లూ లేని రేప్ అండ్ మర్డర్ కేసుని, ఎప్పుడో కొన్నేళ్ల క్రితం గోదావరి జిల్లాలో జరిగిన కేసులతో లింక్ చేసే విధానం రియలిస్టిక్‌గా అనిపించకపోయినా, సినిమా ముందుకు నడవడానికి మాత్రం బాగా ఉపయోగపడింది.
నిజానికి ఈ సినిమాని ఒక థ్రిల్లర్ అంటూ ముందు నుంచి ప్రొజెక్ట్ చేశారు కానీ, ఇదొక ఇన్వెస్టిగేటివ్ డ్రామా అని చెప్పొచ్చు. సినిమా నడుస్తున్నంత సేపు ఏదో కొత్త సినిమా చూస్తున్న ఫీలింగ్ అయితే కలగదు, ఎందుకంటే ఇలాంటి సినిమాలు తెలుగులో కోకొల్లలుగా వస్తూనే ఉంటాయి. అయితే ఈ సినిమా విషయంలో కొత్తదనం ఏమిటంటే, అది సినిమా చూస్తేనే అర్థమవుతుంది. అది చెప్పేస్తే స్పాయిలర్ అవుతుంది కాబట్టి చెప్పలేని పరిస్థితి. ఈ సినిమాలో ఒక కొత్త పాయింట్ తీసుకుని దాని చుట్టూ కథ రాసుకున్నారు.
అయితే పూర్తిస్థాయిలో డ్రామా మీద ఫోకస్ చేయకపోవడంతో, సినిమా రొటీన్ సినిమా అనే ఫీలింగ్ కలుగుతుంది. దానికి తోడు సినిమా కలర్ గ్రేడింగ్ కూడా అదోరకంగా అనిపిస్తూ ఉండటం కాస్త ఇబ్బందికర అంశం. రెగ్యులర్ ఇన్వెస్టిగేటివ్ డ్రామా సినిమాలు చూసేవారికి ఈ సినిమా ఈజీగానే ప్రెడిక్ట్ చేసేలా అనిపిస్తుంది కానీ, సాధారణ ఆడియన్స్ మాత్రం సినిమాలో వచ్చే ట్విస్టులు చూసి ఆశ్చర్యపోతారు. అసలు ఏమాత్రం ఊహించని విధంగా సీరియల్ కిల్లర్‌ని హీరోయిన్ అండ్ పోలీస్ టీం పట్టుకునే విధానం ఆకట్టుకుంటుంది. వాస్తవానికి ఈ సినిమాతో ఈషా చావ్లా చాలాకాలం తర్వాత రీఎంట్రీ ఇచ్చింది. ఆమెకు ఏదో సాలిడ్ రోల్ పడిందనుకుంటే పొరపాటే, అప్పుడప్పుడు కనిపించే పోలీస్ ఆఫీసర్ పాత్రలో ఆమె నటించింది. ఒక రకంగా చెప్పాలంటే, ఇది శోభిత పాత్ర చుట్టూ రాసుకున్న సినిమా. ఆమెను లేడీ ఓరియంటెడ్ హీరోయిన్‌గా నిలబెట్టే ప్రయత్నం చేసింది ఈ సినిమా, అయితే అది పూర్తిస్థాయిలో సఫలం కాలేదు. ఒక రెగ్యులర్ క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ పాత్రలో మెరిసిన ఆమె తన పాత్రకు న్యాయం చేసింది కానీ, సినిమా పూర్తిస్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకునే విషయంలో సక్సెస్ కాలేదని చెప్పొచ్చు. అలా అని తీసిపారేసే సినిమా కూడా కాదు. రెగ్యులర్ ఆడియన్స్ ఓటీటీలో సరదాగా థ్రిల్ ఫీల్ అయ్యేలా దర్శకుడు డిజైన్ చేసుకున్నాడు, అది కొంతవరకు సక్సెస్ కూడా అయిందని చెప్పొచ్చు.
నటీనటులు:
శోభిత దూళిపాళ్ల, సంధ్యా నెల్లూరి అనే పాత్రలో ఇమిడిపోయింది. ఆమెకు ఈ తరహా పాత్ర మొదటిసారి కావడంతో కాస్త కేర్ తీసుకుని నటించింది. ఇక ఈషా చావ్లా ఈ సినిమాతో ఎందుకు రీఎంట్రీ ఇచ్చిందో తెలియదు, ఎందుకంటే ఆమె పాత్ర చాలా పరిమితం. విశ్వదేవ్ రాచకొండ పాత్ర కూడా అక్కడక్కడ మాత్రమే కనిపిస్తుంది. కృష్ణ చైతన్య మాత్రం కాస్త ఎక్కువగానే కనిపించాడు. శ్రీనివాస్ వడ్లమాని, అదితి మైకల్ వంటి వారు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.
సాంకేతిక విభాగం:
టెక్నికల్ టీం విషయానికి వస్తే, ఈ సినిమా సినిమాటోగ్రఫీ ఎందుకో కాస్త డార్క్ టోన్‌లో ఉంది. అది థ్రిల్లర్ సినిమాలకు సరిగ్గా సరిపోయింది, అయితే ఎందుకో కాస్త చూడడానికి ఇబ్బందికరంగానే అనిపించింది. ఎడిటింగ్ అయితే క్రిస్పీగానే ఉంది. సాంగ్స్‌కి స్కోప్ లేదు కానీ, నేపథ్య సంగీతం ఆకట్టుకునేలా ఉంది. నిర్మాణ విలువలు ఫర్వాలేదు.
ఫైనల్ వర్డిక్ట్: ఈ ‘చీకటిలో’ సినిమా ఓ రొటీన్ ఇన్వెస్టిగేటివ్ డ్రామా విత్ లిటిల్ థ్రిల్స్!